‘మూడు రూట్లలో బారికేడ్లు ఎత్తేస్తాం’

by  |
‘మూడు రూట్లలో బారికేడ్లు ఎత్తేస్తాం’
X

న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవం రోజు రైతులు నిర్వహించ తలపెట్టిన ట్రాక్టర్ పరేడ్‌పై ఢిల్లీ పోలీసులు ఆదివారం క్లారిటీ ఇచ్చారు. శాంతియుత ట్రాక్టర్ ర్యాలీకి అనుమతి ఇచ్చినట్టు విలేకరుల సమావేశంలో ప్రకటించారు. అధికారికంగా నిర్వహిస్తున్న గణతంత్ర దినోత్సవ వేడుకలు పూర్తయ్యాకే కిసాన్ గణతంత్ర పరేడ్ ప్రారంభమవుతుందని తెలిపారు. టిక్రి, సింఘు, ఘజీపూర్‌లలో ఆందోళనకారులను అడ్డుకోవడానికి పెట్టిన బారికేడ్లను తొలగిస్తామని, ఈ మూడు రూట్‌లలో రైతులు ట్రాక్టర్ పరేడ్ ప్రారంభిస్తారని వివరించారు.

గణతంత్ర దినోత్సవానికి చేపడుతున్న భద్రత ఏర్పాట్ల గురించి సంయుక్త కిసాన్ మోర్చా నేతలతో ఐదారు చర్చల్లో మాట్లాడామని, అధికారికంగా నిర్వహించే వేడుకలకు ఎటువంటి ఆటంకం కలుగకూడదని మళ్లీ మళ్లీ వివరించామని స్పెషల్ కమిషనర్ ఆఫ్ పోలీస్(ఇంటెలిజెన్స్) దీపేంద్ర పాఠక్ తెలిపారు. ఈ చర్చల్లో రైతులతో స్పష్టమైన అవగాహన ఏర్పడిందని, తాము చేసిన సూచనలను రైతు సహోదరులు కట్టుబడి ఉంటారన్న విశ్వాసం తమకు కలిగిందని చెప్పారు. ట్రాక్టర్ ర్యాలీకి భద్రతనిస్తామని, ఆ మార్చ్ విజయవంతమవ్వడానికి సహకరిస్తామని అన్నారు.

ఢిల్లీ బార్డర్ లోపల 100 కి.మీల మేరకు..

రైతులతో ఏర్పడిన అవగాహన మేరకు టిక్రి బార్డర్ నుంచి బారికేడ్లను తొలగించి, ఆ దారిలో 52-63కిలోమీటర్ల వరకు వారికి అనుమతి ఉంటుందని ఢిల్లీ పోలీసులు వివరించారు. అలాగే, సింఘు నుంచి 60 కిలోమీటర్లు, ఘజిపూర్ నుంచి 46 కిలోమీటర్ల మేరకు వారి ర్యాలీకి అనుమతినిచ్చామని తెలిపారు. తొలిగా సింఘు రూట్ ఓపెన్ అవుతుందని, ఈ దారిలో సంజయ్ గాంధీ ట్రాన్స్‌పోర్ట్ నగర్ నుంచి భావన వరకు ర్యాలీ వెళ్తుందని అన్నారు. అదే తరహాలో టిక్రీలో మొదలైన ర్యాలీ నంగ్లోయ్, నజఫ్‌గడ్, ఝరోడాల గుండా సాగుతుందని, ఘజీపూర్‌లో మొదలైన ట్రాక్టర్ మార్చ్ అప్సర బార్డర్, హాపూర్‌ల మీదుగా వెళ్తుందని తెలిపారు. ఇవన్నీ కుండ్లి మనేసర్ పల్వాల్ ఎక్స్‌ప్రెస్‌వే దగ్గర కలుస్తాయని తెలిపారు. ఢిల్లీలో సరిహద్దుల్లోపల 100 కిలోమీటర్ల మేరకు ట్రాక్టర్ ర్యాలీ కవర్ చేస్తుందని వివరించారు.

ట్రాక్టర్ ర్యాలీపై పాక్ ఉగ్రవాదుల కన్ను?

రైతులు నిర్వహించనున్న ట్రాక్టర్ ర్యాలీకి ఆటంకాలు సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నట్టు తమకు సమాచారం అందిందని పోలీసులు తెలిపారు. ర్యాలీ సమయం, ఏర్పాట్లు, సేఫ్టీలు ముఖ్యమని అన్నారు. ఈ ర్యాలీకి అవాంతరాలు కలిగించాలని పాకిస్తాన్‌కు చెందిన కనీసం 308 ట్విట్టర్ ఖాతాలు కుట్రలు చేస్తున్నాయని వివరించారు. ఈ ర్యాలీపైనా పాకిస్తాన్‌లోని ఉగ్రవాద సంఘాలు కన్నేశాయని అన్నారు. అందుకే అన్ని రకాల భద్రతా ఏర్పాట్లను చేస్తున్నామని స్పెషల్ సీపీ పాఠక్ తెలిపారు.


Next Story

Most Viewed