పండక్కి ఊరెళ్తున్నారా ! అయితే జర జాగ్రత్త..

by  |
పండక్కి ఊరెళ్తున్నారా ! అయితే జర జాగ్రత్త..
X

దిశ, సంగారెడ్డి : బతుకమ్మ, దసరా పండుగ కోసం గ్రామాలకు వెళ్లే వారు పలు జాగ్రత్తలు పాటించాలని ఎస్పీ రమణకుమార్ జిల్లా ప్రజలకు సూచించారు. ఉద్యోగ, వ్యాపార రీత్యా పట్టణ ప్రాంతాల్లో స్థిరపడ్డ వారు పండుగ కోసం కుటుంబంతో సహా తమ స్వగ్రామాలకు వెళతారన్నారు. ఈ క్రమంలో తాళం వేసిన ఇళ్ళను దొంగలు లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందన్నారు. పండగకి ఊరికి వెళ్లే వారు ఇరుగు, పొరుగు సమాచారం ఇవ్వడంతో పాటు మీ ఫోన్ నెంబర్ వారికీ ఇవ్వాలని, వారి ఫోన్ నెంబర్ మీరు తీసుకోవాలన్నారు. విలువైన వస్తువులను ఇంట్లో పెట్టకూడదని, అటువంటి వస్తువులు ఏవైన ఉంటే మీ వెంట తీసుకెళ్లడంగాని, బ్యాంక్‌ లాకర్‌లో పెట్టడం మంచిదన్నారు.

పండుగల వేళ బస్సులు/ట్రైన్ లలో రద్దీ ఎక్కువగా ఉండడంతో బంగారు ఆభరణాలు, ఫోన్ లు ఇతర సామాగ్రిని జాగ్రత్తగా ఉంచుకోవాలన్నారు. బస్సు ఆగిన చోట కిందకు దిగకుండా జాగ్రత్తగా ఉండాలన్నారు. బస్సులలో చైన్ స్నాచింగ్ లు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి చిన్న పిల్లలకి బంగారు ఆభరణాలు వేయవద్దని సూచించారు. పిల్లలను తల్లి తండ్రులు తమ దగ్గరే ఉండేలా చూసుకోవాలన్నారు. ఉదయం పూట వస్తువులను విక్రయించే వారిపై కాలనీ వాసులు నిఘా పెట్టాలన్నారు. రాత్రివేళ అనుమానంగా కాలనీలో ఎవరైనా కనిపిస్తే పోలీస్ స్టేషన్ కు గాని, 100 కు వెంటనే సమాచారం అందించాలని ఎస్పీ రమణకుమార్ సూచించారు.

Next Story

Most Viewed