సార్.. డ్యూటీలోకి తీసుకోండి- స్కావెంజర్స్ విజ్ఞప్తి

by  |
schoolsa-op
X

దిశ వికారాబాద్: నిరుడు కరోనా తీవ్రత పెరిగి స్కూళ్లను బంద్ పెట్టాక.. వాటిల్లో పనిచేసే 900 మంది స్కావెంజర్లను సర్కారు తొలగించింది. దీంతో వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయి. బుధవారం నుంచి స్కూలు తెరుస్తుండడంతో తమను మళ్ళీ డ్యూటీలోకి తీసుకోవాలని కోరుతున్నారు. జీతాలను పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే మంత్రి సబితా ఇంద్రారెడ్డి, కలెక్టర్, ఇతర అధికారుల దగ్గరకు వెళ్లి తమ గోడును వెళ్లబోసుకున్నారు. వెంటనే తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని మొరపెట్టుకుంటున్నారు.

వేరేవాళ్లకు ఏమో జీతాలు పెంచి తమన్నా మాత్రం ఉద్యోగాల నుంచి తీసేశారని కుటుంబం గడవడం కష్టమవుతుందని వాపోతున్నారు. స్కావెంజర్లుగా పని చేసే వాళ్లలో ఎక్కువగా ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఉన్నారు. వారితో రోజంతా పని చేయించుకుని నెలకు రూ. 2500 నుంచి రూ. 3500 జీతమే సర్కార్ ఇచ్చింది. కొన్నిచోట్ల అయితే కొన్ని నెలలపాటు జీతాలను ఆపి తరువాత చెల్లించింది. పెరుగుతున్న ధరలకు తగ్గట్టు 18 వేలకు పెంచాలని స్వచ్ఛ కార్మికుల యూనియన్ కోరినా పట్టించుకోలేదు. పైగా కరోనా పేరుతో వారిని ఉద్యోగాల నుంచి తీసేసింది.

పంచాయతీ కార్మికులకు డ్యూటీలు

స్కావెంజర్లను తీసేసిన తర్వాత స్కూళ్లను శుభ్రం చేసే బాధ్యతను పంచాయతీ.. మున్సిపల్ కార్మికులకు సర్కారు అప్పగించింది. అయితే ప్రస్తుతం చాలా ఊర్లలో కార్మికులు 10 మందిలోపే ఉన్నారు. ఊరి పరిశుభ్రతతో పాటు స్కూల్లో క్లీనింగ్ అప్పగించడంతో భారం అవుతుంది. నీటిసరఫరా, డ్రైనేజీ క్లీనింగ్ ,చెత్త తీసుకుపోవడం, నర్సరీలను కాపాడడం, మొక్కలకు నీళ్లు పోయడం, డంపింగ్ యార్డ్ డ్యూటీలతోనే వారికి సరిపోతుంది. ఆ పనులన్నీ చేసి మళ్ళీ ఇక్కడ పని చేయటం తలకు మించిన భారమవుతుంది. గురువారం నుంచి స్కూల్లో క్లీనింగ్ పనులను ప్రారంభించిన తక్కువ మంది కార్మికులు ఉండటంతో పనులు ఇప్పటికీ ఇంకా పూర్తి కాలేదు. ఇప్పుడు పనులు పూర్తయిన, తర్వాత స్కూలు మొదలైతే మాత్రం తాము ఏమీ చేయలేమని పంచాయతీ కార్మికులు చెబుతున్నారు. ఊర్లలోనే పనులకే ఎక్కువ సమయం పడుతుందని అట్లాంటప్పుడు స్కూల్లో పనులు చేయడం సాధ్యం కాదని అంటున్నారు.

సర్కారు రోడ్డున పడేసింది

రెండేళ్ల పాటు నెలకు 2,500 జీవితానికి స్కావెంజర్‌గా పని చేసిన. బండచాకిరి చేసినా ఇచ్చిన జీతం తక్కువే అయినా కరోనా టైంల స్కూల్ లేవని సర్కారు మమ్మల్ని తొలగించి రోడ్డున పడేసింది. మమ్మల్ని మళ్ళీ డ్యూటీలోకి తీసుకోవాలని కలెక్టర్, అధికారులను ఇప్పటికే కోరినం. ఇప్పుడు పంచాయతీ కార్మికులు స్కూళ్లను క్లీన్ చేస్తున్నా.. స్కూలు మొదలైనంక చేయలేమంటున్నారు .అప్పుడు ఎవరు క్లీన్ చేస్తారు…?

రూ 6 వేల జీతంతో తీస్కోవాలె- చంద్రమ్మ

రూ.500 జీతం దగ్గర్నుంచి సర్కారు స్కూల్ లో స్కావెంజర్ గా చేసిన. తర్వాత రూ.2500కు పెంచినా, పొద్దున్న 9 నుంచి సాయంత్రం 6 గంటల దాకా డ్యూటీ చేయించుకున్నారు. ఆశా వర్కర్లు, అంగన్వాడీ, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్, కార్మికులకు జీతాలు పెంచిన సర్కార్.. మమ్మల్ని మాత్రం పని లేదని చెప్పి ఉద్యోగాల నుంచి తీసేసింది. ఇప్పుడు మొదలు అవుతున్నాయి కాబట్టి వెంటనే మమ్మల్ని డ్యూటీ లోకి తీసుకోవాలి. నెలకు కనీసం రూ 6 వేల జీతం ఇయ్యాలె.

ఉపాధ్యాయులం స్కావెంజర్స్ అవుతున్నాం

పాఠశాలలో స్కావెంజర్స్ లేక ఉపాధ్యాయులమే స్కావెంజర్స్ అవుతున్నామని, పాఠశాలలోని తరగతి గదులు, ఆవరణ మేమే శుభ్రం చేసుకుని, అటెండర్‌గా మారుతున్నామని, ప్రభుత్వం స్పందించి వెంటనే స్కావెంజర్‌ను నియమించాలని తెలిపారు.

Next Story

Most Viewed