Plumbers in Financial Trouble: కరోనా ఎఫెక్ట్.. పూటగడవని స్థితిలో ప్లంబర్స్

by  |
Plumbers in Financial Trouble: కరోనా ఎఫెక్ట్.. పూటగడవని స్థితిలో ప్లంబర్స్
X

దిశ, తెలంగాణ బ్యూరో : కోట్ల రూపాయలు వెచ్చించి భవనం నిర్మించినా అందులో కనీస వసతులు లేకపోతే వేస్టే. నీటి పైపులైన్ల నుంచి మరుగుదొడ్డిలో పైపులైన్ల ఏర్పాటు వరకు ప్లంబర్ కీలకం. మళ్లీ ఏ చిన్న లీకేజీ అయినా అతను మరమ్మతులు చేయాల్సిందే. అంతటి అమోఘమైన సేవలందించే ప్లంబర్‎ను కరోనా వెంటాడుతోంది. పనులు లేక ఇళ్లకే పరిమితం కావడం, వచ్చిన చిన్నాచితక పనులను సైతం లాక్‎డౌన్‎తో పనిచేయలేక పోతున్నారు. దీంతో ఆర్థికంగా చితికిపోయి కుటుంబ పోషణభారమైంది. ప్రభుత్వ సాయం కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.

రాష్ట వ్యాప్తంగా భవన నిర్మాణ రంగంలో 20లక్షల మంది పనిచేస్తున్నారు. అందులో 14లక్షల మంది వెల్ఫేర్ బోర్డులో రిజిస్టర్ చేసుకున్నారు. ఇందులో లక్షమందికిపైగా ప్లంబర్స్ పనిచేస్తుండగా, నగరంలోనే 60వేల మంది పనిచేస్తున్నారు. వీరు గాక ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు మరో 20వేల మంది పనిచేస్తున్నారు. గతేడాది కరోనా ఫస్ట్ వేవ్ నుంచి భవన నిర్మాణ రంగం కూదేలైంది. దీంతో ప్లంబర్స్‌గా పనిచేసేవారికి పనులు లేక ఇంటికే పరిమితం అయ్యారు. కొవిడ్ తగ్గడం భవన నిర్మాణ రంగం పుంజుకుంటున్న తరుణంలోనే మళ్లీ సెకండ్ వేవ్ ఉధృతి కారణంగా ఆధారపడ్డ వారి పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. ఇంటి అద్దెలు చెల్లించలేక, కుటుంబాన్ని పోషించుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

అడ్డమీది కూలీల కన్న అధ్వాన్నంగా..

అడ్డమీది కూలీలను ప్రభుత్వం కార్మికులుగా గుర్తించి వారికి వెల్ఫేర్ బోర్డులో సభ్యత్వం అందజేస్తుంది. ప్రభుత్వ సదుపాయాలు కల్పిస్తుంది. కానీ, ప్లంబర్స్‎కు ఎలాంటి గుర్తింపు లేదు. కేవలం బిల్డర్స్‌పై, తెలిసిన వారిపై ఆధారపడి జీవనం కొనసాగించాల్సిన పరిస్థితి. కొన్ని సమయాల్లో బిల్డర్స్ పనిచేయించుకొని కూలీ సైతం ఇవ్వడం లేదని పలువురు వాపోతున్నారు. భవన నిర్మాణంలో నీటి పైపులు, మరుగుదొడ్డి పైపులతో పాటు నీటి లీకేజీ అయినా, సంపుకు పైపు కనెక్షన్, నీటి సరఫరాలో అంతరాయం, పైపులో వాచర్, రింగ్, పగలడం తదితర ఏపనైనా చేయాల్సింది ప్లంబరే అయినా గుర్తింపు మాత్రం లేదు. ఇటు ప్రభుత్వం గుర్తించక, అటు బిల్డర్స్ పట్టించుకోక వారి పరిస్థితి ముందు నుయ్యి… వెనుక గొయ్యి లాగా తయారైంది. ఇతర పని రాక… చేసే పని లేకపోవడంతో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.

ఇతర రాష్ట్రాలకు చెందినవారు..

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు ఒరిశా, బీహార్, మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తర ప్రదేశ్‌కు చెందిన వారు సైతం ప్లంబర్ వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. అయితే వీరిని మోటీవేషన్ చేసేవారు లేక.. ప్రభుత్వ సదుపాయాలు, కార్మిక వెల్ఫేర్ బోర్డు గురించి తెలియజేసేవారు కరువయ్యారు. సాధారణంగానే ఎవరైనా పనులు చెబితే తప్ప పనులు దొరకని పరిస్థితి. ప్రస్తుతం లాక్‌డౌన్‌లో వెసులుబాటు కల్పించినా ఇచ్చే చిన్న పనికి కిలో మీటర్ల దూరం వెళ్లాల్సి వస్తుందని, అక్కడ పనిచేసే సరికి టైం అయిపోతుందని తిరిగి రావడానికి వీలు లేకుండా పోతుందని పలువురు ప్లంబర్స్ ఆవేదన వ్యక్తం చేశారు. పనిచేయకపోతే పూటగడువదు… చేసేటందుకు వెళ్తే అక్కడే ఉండాల్సి వస్తుందని తెలిపారు. ఒక వేళ వస్తే పోలీసులు వేసే జరిమానాకు కూడా వచ్చిన కూలి సరిపోవడం లేదని… ప్రభుత్వం వెసులుబాటు కల్పించాలని కోరుతున్నారు.

సమస్యలు..

భవన నిర్మాణంలో ఎత్తులో పనిచేయడం, గాయాలు కావడం, సీసం, అస్బెస్టాస్ తోపనిచేయడంతో కండ్లు దెబ్బతినడం, మురుగు శుద్ధి సమయంలో అంటువ్యాధులైన కలరా, టైపాయిడ్, హైపటైటీస్, పోలియో, స్పారిడియెసిస్, అస్కారియాసిస్ సోకుతున్న ఘటనలు ఉన్నాయి. తిరిగి చికిత్స కోసం వేల రూపాయల్లో ఖర్చు చేయాల్సిన దుస్ధితి.

డిమాండ్లు..

కార్మికులుగా గుర్తించాలి. ఉచిత రేషన్. నెలకు రూ.5వేలు ఇవ్వాలి. ఆయూష్మాన్ భారత్ లో ప్లంబర్స్ కు వైద్య సేవలందించాలి. మృతి చెందిన ప్లంబర్స్ కుటుంబాలకు రూ.5లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలి.

రూ.5లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలి

బిల్డింగ్ అదర్స్ కన్‌స్ట్రక్షన్ బోర్డులో రూ.1500 కోట్లు ఉన్నాయి. అందులోంచి ప్రమాదవశాత్తు మృతి చెందిన ప్లంబర్స్ కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‎గ్రేషియా చెల్లించాలి. భవన నిర్మాణ రంగంలో పనిచేసే అందరికీ సంక్షేమ బోర్డులో రిజిస్టర్ చేసేకునే వెసులుబాటు కల్పించి ఆదుకోవాలి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి సైతం సంక్షేమ బోర్డులో అవకాశం ఇవ్వాలి. ఆయుష్మాన్ భారత్‌లో చేర్చి వైద్య చికిత్స అందించాలి. -అలూరి రవీశంకర్, ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ, బీఎంఎస్ కన్ స్ట్రక్షన్స్ మజ్దూర్ మహాసంఘ్

ఉచితంగా రేషన్ ఇవ్వాలి

నాది ఒరిస్సా. 30 ఏళ్లుగా ప్లంబర్స్ వృత్తిని నమ్ముకొని కుటుంబాన్ని పోషించుకుంటున్న. కరోనాతో పని దొరుక్తలేదు. పూటగడవడం కష్టంగా ఉంది. ఒక వేళ చిన్న పని దొరికినా కిలో మీటర్ల దూరం వెళ్లి పనిచేసే సరికి టైం అయిపోతుంది. రావడానికి వీలు పడ్తలేదు. వస్తే పోలీసులు ఫైన్లు వేస్తున్నారు. వచ్చిన కూలి కంటే ఎక్కువ ఫైన్ కట్టాల్సి వస్తుంది. ప్రభుత్వమే ఆదుకోవాలి. -రామ్ చంద్ర మొహంతి, ప్లంబర్, ఒరిశా

ఆదుకోకపోతే చావే శరణ్యం

18 ఏళ్లుగా భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న. ఎలక్ట్రిసిటీ వర్కుతోపాటు ప్లంబర్స్ వృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తున్న. కరోనా వచ్చిన కాడి నుంచి పని దొరక్త లేదు. కుటుంబాన్ని పోషించుకోవడం కష్టంగా ఉంది. ఢిల్లీ, కర్నాటక, బీహార్, అస్సాం తదితర రాష్ట్రాలు ఇస్తున్న మాదిరిగా తెలంగాణ ప్రభుత్వం నెలకు రూ.5వేలు ఇచ్చి ఆదుకోవాలి. లేకుంటే కరోనా కాలంలో మా కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి దాపురించింది. ఆదుకోకపోతే చావే శరణ్యం. -సైలెందర్, బీహార్

Next Story

Most Viewed