ఆరంభ యాత్రే.. బీజేపీకి అంతిమ యాత్ర : వినోద్ కుమార్

by  |
ఆరంభ యాత్రే.. బీజేపీకి అంతిమ యాత్ర : వినోద్ కుమార్
X

దిశ, హుస్నాబాద్ : బీజేపీ చేపట్టిన ప్రజా సంగ్రామ పాదయాత్ర ఆరంభం కాదని.. అంతిమయాత్ర అవుతోందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినిపల్లి వినోద్ కుమార్ విమర్శించారు. ఈ సందర్భంగా హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వినోద్ కుమార్ మాట్లాడారు. టీఆర్ఎస్ పార్టీ ప్రవేశపెడుతున్న ప్రజా సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేకే బీజేపీ అసత్య ప్రచారాలు చేస్తూ, రాజకీయ పబ్బం గడుపుకుంటుందన్నారు. సీఎం కేసీఆర్ విద్యార్థులకు ఉచిత నిర్బంధ విద్యనందిస్తున్నది బీజేపీ నాయకులకు కనిపించట్లేదా అని మండిపడ్డారు. గత ప్రభుత్వాల హయాంలో వైద్య కళాశాలు తక్కువగా ఉన్నాయని, ప్రస్తుతం రాష్ట్రంలో వైద్య కళాశాల సంఖ్య పెంచిన ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ అన్నారు.

బండి సంజయ్ కుమార్ కరీంనగర్ పార్లమెంటు సభ్యుడిగా ఉండి హుస్నాబాద్ నియోజకవర్గానికి ఎన్ని నిధులు తీసుకొచ్చారో ప్రజలకు చెప్పాలన్నారు. సీఎం కేసీఆర్ రాబోయే రోజుల్లో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేసే మహత్తరమైన కార్యక్రమాన్ని తీసుకోబోతున్నారని తెలిపారు. బండి సంజయ్ ప్రజాసంగ్రామ పాదయాత్రను ప్రజలెవరూ పట్టించుకోలేదని ఎద్దేవా చేశారు. బీజేపీ చేపడుతున్న పాదయాత్రలు పార్టీ బలోపేతానికి తప్పా.. ప్రజలకు ఏ ఉపయోగం లేదన్నారు. టీఆర్ఎస్ పార్టీ కుటుంబ పాలన అని విమర్శించడం సరైంది కాదని, అన్ని రాజకీయ పార్టీల్లో కుటుంబ పాలనుందని మీ పార్టీలో ఎంతమంది ఉన్నారో చెప్పాలన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గానికి ఎన్ని నిధులు వెచ్చించి అభివృద్ధి పథంలోకి తీసుకొచ్చారో బండి సంజయ్ చెప్పాలని, లేకుంటే మా అభివృద్ధిని చూపిస్తామని ఎమ్మెల్యే సతీష్ కుమార్ సవాల్ విసిరారు. కార్యక్రమంలో హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్, మున్సిపల్ చైర్ పర్సన్ ఆకుల రజిత, మార్కెట్ కమిటీ చైర్మన్ అశోక్ బాబు, ఎంపీపీలు మానస, లక్ష్మీ, జడ్పీటీసీలు, ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed