ఆ భూముల జోలికొస్తే క్రిమినల్ కేసులు పెడుతా.. పినపాక ఎమ్మార్వో వార్నింగ్

by  |
ఆ భూముల జోలికొస్తే క్రిమినల్ కేసులు పెడుతా.. పినపాక ఎమ్మార్వో వార్నింగ్
X

దిశ, మణుగూరు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలో ప్రభుత్వభూములను కబ్జా చేస్తే క్రిమినల్ కేసులు పెడతానని పినపాక మండల తహశీల్దార్ విక్రమ్ కుమార్ భూ కబ్జాదారులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. శనివారం మండలంలోని ఎమ్మార్వో ఆఫీసులో విలేకరులతో మాట్లాడుతూ.. మండలంలో కొందరు వ్యక్తులు ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్నట్టు తెలిసిందని.. వారు ఎవరైనా సరే వదిలిపెట్టేది లేదని ఘాటుగా హెచ్చరించారు. మండలంలోని కొందరు వ్యక్తుల కన్ను ప్రభుత్వ భూములపై పడిందని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

సర్వే నెంబర్ : “987” 2-10 రెండు ఎకరాల పది గుంటలు ఉప్పాకలో కొందరు వ్యక్తులు కబ్జా చేశారని తెలిసింది. వెంటనే అట్టి భూమిని స్వాధీనపరుచుకుని ప్రభుత్వానికి అప్పజెప్పానని తెలిపారు. అలాగే అన్నంపెళ్లి గ్రామంలోని సర్వే నెం ఎక్స్ బై 81 “2-20” రెండు ఎకరాల ఇరవై గుంటల భూమిని కొంతమంది ఆక్రమించుకుని కబ్జాచేసి ప్లాట్లుగా మార్చి అమ్మలని చూశారన్నారు. అట్టి భూమిని కూడా స్వాధీనపరుచుకుని ప్రభుత్వానికి అప్పజెప్పానన్నారు. అలాగే సర్వే నెంబర్ “818” 5-20 ఐదు ఎకరాల ఇరవై గుంటల భూమిని బయ్యారంలో కొందరు వ్యక్తులు కబ్జా చేస్తే అట్టి భూమిని కూడా ప్రభుత్వానికి అప్పజెప్పానని వివరించారు. ప్రభుత్వానికి అప్పజెప్పిన భూములన్నింటికీ ఫెన్సింగ్ వేయించి, ప్రభుత్వ భూమి బోర్డు పెట్టినట్టు ఆయన తెలిపారు. ప్రభుత్వభూములను కబ్జా చేస్తే ఇకపై సహించేది లేదని, ఎవరైనా ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే రెవెన్యూ కార్యాలయానికి తెలపాలని ఆయన ప్రజలను కోరారు.

మండల ప్రజలు, పలు మేధావుల మాటలు..

ప్రభుత్వ భూములను ఆక్రమించిన వ్యక్తులపై తహసీల్దార్ విక్రమ్ కుమార్ కొరడా ఝులిపిస్తున్నారని మండల ప్రజలు, పలువురు మేధావులు మాట్లాడుకుంటున్నారు. విక్రమ్ కుమార్ తహసీల్దార్‌గా వరంగల్‌లో పనిచేస్తున్నపుడు కొన్ని ఎకరాల ప్రభుత్వ భూములను కొందరు వ్యక్తులు కబ్జా చేస్తే ఆ భూములన్నింటినీ స్వాధీన పరుచుకొని ప్రభుత్వానికి అప్పజెప్పారని తెలిసింది. ఏ కబ్జాదారుడికి భయపడకుండా ప్రభుత్వం కోసం, ప్రజలకోసం పనిచేస్తున్నారని జిల్లాలో చర్చించుకుంటున్నారు. ఇలాంటి వ్యక్తికి జిల్లా కలెక్టర్ ఉత్తమ తహశీల్దార్ అవార్డు ఇవ్వడం ఎంతో గొప్ప విషయమని మండల ప్రజలు అంటున్నారు.



Next Story

Most Viewed