ఒంగోలులో దివ్యాంగురాలు సజీవదహనం

by  |
ఒంగోలులో దివ్యాంగురాలు సజీవదహనం
X

దిశ,ఏపీ బ్యూరో: ఒంగోలులో దారుణం చోటు చేసుకుంది. దశరాజుపల్లిలో చిన్నవెంకన్న కుంట వద్ద ఓ దివ్యాంగురాలు శుక్రవారం సజీవ దహనమైంది. ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా ఇది ముమ్మాటికి హత్యేనని మృతురాలి తల్లి ఆరోపిస్తున్నారు. ఘటన వివరాల్లోకి వెళితే… ఉమ్మనేని భువనేశ్వరి (22) దివ్యాంగురాలు ..పట్టణంలోని కమ్మపాలెంలోని మూడో లైన్‌లో నివాసం ఉంటోంది. పట్టణంలోని 12వ వార్డు సచివాలయంలో వాలంటీర్‌గా ఆమె పని చేస్తున్నారు. నాగార్జున వర్సిటీలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌లో ఎంబీఏ చదువుతోంది. ఆమె చిన్నతనంలోనే తండ్రి చనిపోయాడు.

అక్క మానసిక వికలాంగురాలు. పట్టణంలోని ఓ బుక్‌ డిపోలో భువనేశ్వరి తల్లి జానకి పని చేస్తూ ఇద్దరు కూతుళ్లను పెంచింది. రోజూ మాదిరిగానే శుక్రవారం కూడా భువనేశ్వరీ సచివాలయానికి వెళ్లింది. సాయంత్రం 6.49 గంటలకు తల్లితో ఆమె ఫోన్‌లో మాట్లాడింది. ఆ తర్వాత ఆమె ఇంటికి రాలేదు. రాత్రి 8 గంటల సమయంలో కుమార్తెకు ఆమె ఫోన్ చేసింది. కానీ ఆమె ఫోన్ స్విచాఫ్ వచ్చింది. దీంతో కుమార్తె కోసం వెతకడం ప్రారంభించింది. కొద్ది సేపటి తర్వాత దశరాజుపల్లిలోని చినవెంకన్న కుంట వద్ద ట్రై సైకిల్‌పై ఓ యువతి తగుల బడుతోందని సమాచారాన్ని పోలీసులకు కిమ్స్ ఆస్పత్రి సెక్యూరిటీ ఆఫీసర్ అందజేశారు.

దీంతో వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కాగా ఆమె మంటల్లో కాలిపోతూ పోలీసులకు కన్పించింది. వెంటనే ఫైరింజన్‌ను పిలిపించి మంటలు ఆర్పారు. అప్పటికే ఆమె మరణించింది. విషయం తెలుసుకుని ఆమె తల్లి ఘటనా స్థలానికి చేరుకుంది. తన కుమార్తె చాలా ధైర్యవంతురాలనీ..ఆత్మహత్య చేసుకునేంత పిరికి వ్యక్తి కాదని ఆమె తల్లి అన్నారు. ఎవరో హత్య చేసి ఉంటారని ఆమె తల్లి అనుమానం వ్యక్తం చేశారు. అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story