‘ఐకార్’ ఫలితాల్లో సూర్యాపేట వాసికి ఆలిండియా ఫస్ట్ ర్యాంక్

by  |
‘ఐకార్’ ఫలితాల్లో సూర్యాపేట వాసికి ఆలిండియా ఫస్ట్ ర్యాంక్
X

దిశ, నేరేడుచర్ల : ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్(ఐకార్) పీహెచ్‌డీ ఎంట్రన్స్ ఫలితాల్లో సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం గడ్డిపల్లి గ్రామానికి చెందిన రేగట్టె వెంకట్ ఉత్తమ ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయిలోనే (ఓబీసీ) కేటగిరిలో ఫస్ట్ ర్యాంక్ సాధించాడు. గడ్డిపల్లి గ్రామానికి చెందిన రేగట్టె అరవింద్, మంగమ్మ దంపతుల కుమారుడే వెంకట్. చిన్నతనం నుంచే వెంకట్ చదువులో చురుకైన విద్యార్థి. ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు గడ్డిపల్లిలోనే ప్రాథమిక పాఠశాలలో విద్యాభ్యాసం పూర్తి చేశాడు. ఆరవ తరగతి గురుకుల ఎంట్రన్స్ ఫలితాలలో సీటు సాధించి తుంగతుర్తిలోని తెలంగాణ రెసిడెన్షియల్ గురుకులంలో ఆరు నుంచి పదోతరగతి వరకు చదివాడు.

పదో తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబర్చినందుకు డీఆర్డీఏ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి హైదరాబాదు పట్టణంలోని బోడుప్పల్ ఎస్‌ఆర్ జూనియర్ కళాశాలలో సీటు పొంది ఇంటర్ పూర్తి చేశారు. ఆ తర్వాత హైదరాబాద్ పట్టణంలోని ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో బీటెక్ పూర్తి చేసి గుజరాత్ రాష్ట్రంలోనే జునాఘడ్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఎమ్‌టెక్ పూర్తిచేశారు. ప్రస్తుతం ఏపీలోని గుంటూరు జిల్లా బాపట్లలోని ఆచార్య ఎన్జీరంగా యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేస్తున్నాడు. రైతు కుటుంబం నుంచి వచ్చిన తను పీహెచ్‌డీ పూర్తి చేసి రైతులకు సేవలందించడమే తన లక్ష్యమని వెంకట్ తెలిపాడు.



Next Story