భారత్‌కు త్వరలో ఫైజర్ టీకా..

by  |
భారత్‌కు త్వరలో ఫైజర్ టీకా..
X

న్యూఢిల్లీ: అమెరికా ఫార్మా సంస్థ ఫైజర్ తమ టీకాలు అందుబాటులో ఉన్నాయన్న సంకేతాలనిచ్చిందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ టీకాలు వీలైనంత త్వరగా మనదేశానికి దిగుమతి చేసుకోవడానికి సంస్థతో చర్చలు జరుగుతున్నాయని వెల్లడించింది. వ్యాక్సినేషన్‌పై జాతీయ నిపుణుల బృందం సభ్యుడు డాక్టర్ వీకే పాల్ గురువారం మాట్లాడుతూ, గతేడాది ద్వితీయార్థం నుంచే విదేశీ సంస్థల నుంచి టీకాలు దిగుమతి చేసుకోవడానికి కేంద్రం ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టిందని వివరించారు. కానీ, దేశీయ సంస్థల నుంచి టీకాలు సేకరించినంత సులువుగా విదేశీ ఫార్మా సంస్థల నుంచి కొనుగోలు చేయలేమని అన్నారు. ఎందుకంటే దేశీయ సంస్థలు స్థానిక అవసరాలకు ప్రాధాన్యతన ఇచ్చినట్టే ఆయా అంతర్జాతీయ సంస్థలకూ ప్రాధాన్యాలుంటాయని చెప్పారు. అయినప్పటికీ రష్యాతో చేసిన చర్చలు ఫలించాయని, స్పుత్నిక్ వీ టీకా దేశానికి వచ్చిందని వివరించారు. వీటితోపాటే త్వరలోనే మరో నాలుగు టీకాలు ఇండియాకు రాబోతున్నట్టు తెలిపారు.

రోజుకు కోటి డోసుల పంపిణీకి కసరత్తులు

టీకా పంపిణీ కార్యక్రమానికి వేగవంతం చేయాల్సిన అవసరముందని డాక్టర్ పాల్ అభిప్రాయపడ్డారు. రోజుకు 43 లక్షల డోసుల పంపిణీని చేసే సామర్థ్యాన్ని సమకూర్చుకున్నామని, మరో మూడు వారాల్లో దీన్ని 73 లక్షలకు తీసుకెళ్లాలని అన్నారు. రోజుకు కోటి టీకా డోసులను పంపిణీ చేయడానికి కసరత్తులు చేయాలని తెలిపారు. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి అనుగుణంగా వ్యవస్థను సంసిద్ధం చేసుకోవాలని వివరించారు.

పిల్లలకు టీకా కోసం ప్రయత్నాలు షురూ

పిల్లలకు టీకాలు అందించే అంశం తమ దృష్టిలో ఉన్నదని డాక్టర్ వీకే పాల్ అన్నారు. కొవాగ్జిన్‌కు పిల్లలపై ప్రయోగాలకు అనుమతినిచ్చామని, రెండేళ్లు పైబడిన పిల్లలకు టీకాలు అందించే లక్ష్యంతో ఆ సంస్థ కసరత్తులు చేస్తు్న్నట్టు తెలిసిందని వివరించారు. సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కూడా నోవావాక్స్ టీకాను పిల్లలపై ట్రయల్స్ చేయడానికి యోచిస్తున్నట్టు తెలిసిందని పేర్కొన్నారు. ఫైజర్ టీకా 12ఏళ్లు పైబడిన వారిలో సమర్థవంతంగా పనిచేస్తున్నట్టు ఫలితాలు వచ్చాయని, ఇప్పటికే ఒకట్రెండు దేశాలు వారికి టీకా పంపిణీని ప్రారంభించే దశలో ఉన్నాయని తెలిపారు.



Next Story

Most Viewed