అక్కడ.. ఇక నో ఎలిఫెంట్ రైడ్స్

by  |
అక్కడ.. ఇక నో ఎలిఫెంట్ రైడ్స్
X

దిశ, ఫీచర్స్: జంతువులను చూడగానే పిల్లలతో పాటు, పెద్దలు ఎగ్జైటింగ్‌గా ఫీలవుతారు. చిన్నారులతో పోటీపడుతూ ఎనిమల్ రైడ్స్ ఆస్వాదిస్తారు. చాలా పర్యాటక ప్రాంతాల్లో ఏనుగు, ఒంటెల రైడ్స్ సర్వసాధారణం కాగా, ఈ రైడ్స్ జంతువులకు నష్టం కలిగిస్తున్నాయని పెటా (పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్) పేర్కొంది. ఎప్పటినుంచో వీటిని రద్దు చేయాలని ప్రభుత్వానికి విన్నవిస్తోంది. జైపూర్‌లోని అమెర్ ఫోర్ట్‌‌ ప్రాంతం ‘ఎలిఫెంట్ రైడ్స్’కు ప్రసిద్ధి. పింక్ సిటీకి వెళితే అమెర్ ఫోర్ట్, ఎలిఫెంట్ సఫారీ చూడందే ఆ యాత్ర సంపూర్ణం కాదు. ఇక పై అక్కడ ఏనుగు అంబారీ ఎక్కడం కుదరదేమో..ఎందుకంటే ఏనుగులు హింసకు గురవుతున్నాయంటూ, వాటిపై రైడ్స్ చేయించొద్దంటూ పెటా ప్రభుత్వానికి లేఖ రాయడంతో పాటు, రాజస్థాన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, సుప్రీం కోర్టుకు ఫ్యాక్ట్ షీట్ సమర్పించింది. ఏనుగుల స్థానంలో ఎలక్ట్రిక్ రాయల్ రథం ఉపయోగించాలని, అందుకు సంబంధించిన చారియట్ నమూనాను పెటా ఇండియా ప్రతినిధులు ప్రభుత్వానికి పంపించారు.

పెటా అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు..‘అమెర్ ఫోర్ట్ ఎలిఫెంట్ రైడ్స్’పై ఓ ప్రత్యేక కమిటీ వేయాల్సిందిగా పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. దాంతో భారత ప్రభుత్వం ప్రత్యేకంగా ‘ప్రాజెక్ట్ ఎలిఫెంట్ డివిజన్ కమిటీ’ని ఏర్పాటు చేసింది. అమెర్ ఫోర్ట్ వద్ద ఏనుగుల సవారీలను ఎలక్ట్రిక్ వెహికల్ రైడ్స్‌తో భర్తీ చేయాలని ఆ కమిటీ ఇటీవల సిఫారసు చేసింది. ఆ సిఫార్సు మేరకు ప్రముఖ డిజైన్ సంస్థ ‘డెస్మానియా డిజైన్‌’తో కలిసి పెటా ప్రతినిధులు రాజ రథాన్ని పోలి ఉన్న డిజైన్ రూపొందించారు. దానికి ‘మహారాజా’ అని పేరు పెట్టాలని సూచించారు. అమెర్ ఫోర్ట్ వద్ద ఉన్న కొండ ప్రాంతాలకు ఈ వెహికల్ అనుకూలంగా ఉండటంతో పాటు, ప్రతి ట్రిప్‌కు నలుగురు పర్యాటకులను తీసుకెళ్లగలదు. అంతేకాదు ఈ మహారాజ రథం ఎలక్ట్రిక్ వెహికల్ కావడంతో, పర్యావరణానికి ఎలాంటి నష్టముండదని పెటా ప్రతినిధులు తెలిపారు. ‘అమెర్ కోటకు వచ్చే పర్యాటకులు ఇకపై అత్యాధునిక మేజిస్టిక్ కార్లలో రాజులా ప్రయాణించొచ్చు.ఇది వారికి ప్రత్యేకమైన అనుభావాన్నిస్తుంది. పర్యావరణ కాలుష్యాన్ని, జంతు హింసను తగ్గించే ఎకో అండ్ ఎనిమల్ ఫ్రెండ్లీ డిజైన్ ఇది’ పెటా ఇండియా చీఫ్ అడ్వకేసీ ఆఫీసర్ ఖుష్బూ అన్నారు.

అమెర్ ఫోర్ట్ ప్రాంతంలో ఉన్న98 ఏనుగులలో 22 ఎలిఫెంట్స్ కోలుకోలేని కంటి సమస్యతో బాధపడుతున్నాయని, 42 ఏనుగులకు పాదాల సమస్యలు ఉన్నాయని, వాటిలో పెరిగిన గోర్లు, ఫ్లాట్ ఫుట్‌ప్యాడ్‌లు కాంక్రీట్ రోడ్లపై నడవకుండా ఉన్నాయని కమిటీ నివేదిక పేర్కొంది. మూడు ఏనుగులు క్షయవ్యాధితో బాధపడుతున్నట్లు తెలిపారు. కంటి సమస్యలున్న ఏనుగులను వాడకుండా ఉండటం, రైడ్‌ల కోసం ఏనుగులను కొత్తగా చేర్చుకోవడాన్ని నిషేధించడం వంటి అంశాలు కమిటీ సిఫార్సులలో ఉన్నాయి.

Next Story

Most Viewed