రైతుల పొట్టగొడ్తున్న డీలర్లు.. సరిహద్దులు దాటుతున్న ఎరువులు

by  |
రైతుల పొట్టగొడ్తున్న డీలర్లు.. సరిహద్దులు దాటుతున్న ఎరువులు
X

దిశ, వెంక‌టాపురం : పిల్లిగుడ్డిదైతే ఎల‌ుక మీసం తిప్పింద‌న్నట్టుగా త‌యారైంది ఏజెన్సీ మారుమూల ప్రాంత‌మైన ములుగు జిల్లా వెంక‌టాపురం మండ‌లంలో వ్యవసాయశాఖ ప‌రిస్థితి. జిల్లా అధికారుల ప‌ర్యవేక్షణ అంతంత‌ మాత్రంగానే ఉండగా.. దీనికి తోడు జిల్లా వ్యవ‌సాయ‌శాఖ ప‌ర్యవేక్షణ మొత్తానికే కరువైంది. డివిజ‌న్ స్థాయి వ్యసాయ‌శాఖ అధికారి క‌నుస‌న్నల్లో కొంద‌రు ఎరువుల దుకాణాదారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. రెండేళ్లకు పైగా అవుతున్నా పూర్తిస్థాయి వ్యవ‌సాయ‌శాఖ అధికారిని ఇంతవరకు నియ‌మించ‌లేదు. దుకాణాలపై వ్యవ‌సాయ శాఖ అధికారుల త‌నిఖీలూ లేవు. విత్తన న‌మూనాల సేక‌ర‌ణ‌, ఎరువులు, పురుగు మందుల నిల్వలపై ఆరా తీసే అధికారి లేకపోవ‌డంతో వెంక‌టాపురం, వాజేడు మండ‌లాల్లోని ఎరువుల, పురుగు మందుల దుకాణదారులు ఆడిందే ఆట‌.. పాడిందే పాటగా సాగుతోంది. నిబంధన‌ల‌కు విరుద్ధంగా తెలంగాణ రైతుల ఆధార్ కార్డులు, ఈ పాస్ ద్వారా రికార్డుల్లో పేర్లు న‌మోదు చేసుకుని ఛత్తీస్‌గఢ్ రాష్ర్టానికి య‌థేచ్ఛగా ఎరువులను స‌రిహ‌ద్దులు దాటిస్తున్నారు. ఇందంతా ఓ డివిజ‌న్ స్థాయి అధికారి స‌హాయ స‌హ‌కారాల‌తోనే సాధ్యమౌతుంద‌నే విమ‌ర్శలు వినిపిస్తున్నాయి.

పొటాష్ కొర‌త‌.. దండుకుంటున్న వ్యాపారులు..

ప్రస్తుతం రాష్ట్రంలో వ‌రి పంటలు పోటాష్ వేసే దశలో ఉన్నాయి. పొటాష్‌, యూరియా అనేది మిర్చి మొక్కలు పెట్టు స‌మ‌యంలో డీఏపీ, పొటాష్ క‌లిపి దెక్కిలో చ‌ల్లుతారు. దీనిని వినియోగిస్తేనే వ‌రి తాలుపోకుండా దిగుబ‌డి వ‌స్తుంద‌ని, మిరి పైర్లు ఏపుగా పెరుగుతాయని శాస్ర్తవేత్తలు చెబుతున్నారు. అయితే. వినియోగానికి స‌రిప‌డా పొటాష్ నిల్వలు నిండుకునేలా డీల‌ర్లు కృత్రిమ కొర‌త సృష్టించారు. పొటాష్ కావాలంటే మార్కెట్ ధ‌ర‌ కంటే అద‌నంగా రూ.200 , ర‌వాణా రూ.60 అద‌నంగా అవుతుంది. కాగా, కొన్ని ఎరువుల దుకాణాదారుల‌కు మాత్రమే పొటాష్ స‌ర‌ఫ‌రా జరుగుతోంది. ప్రస్తుత ప‌రిస్థితుల్లో పొటాష్‌కు మంచి డిమాండ్ ఉండటంతో కొంద‌రు ఎరువుల దుకాణాదారులు పొటాష్‌‌కు కృత్రిమ కొర‌త సృష్టించి త‌మ ద‌గ్గర ఎరువులు, పురుగు మందులు కొనుగోలు చేసే రైతుల‌కు మాత్రమే విక్రయిస్తున్నార‌ని, త‌ప్పని స‌రిగా కావాలంటే మార్కెట్ ధ‌ర‌కంటే అధిక ధ‌ర చెల్లించాల్సిన ప‌రిస్థితి నెలకొంది. ప్రస్తుతం పొటాష్ త‌ప్పనిస‌రి కావ‌డంతో అధిక ధర చెల్లించైనా పొటాష్ కొనుగోలు చేస్తున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

హద్దులు దాటుతున్న ఎరువులు, పురుగు మందులు

ఎరువులు, పురుగు మందుల దుకాణాలపై వ్యవ‌సాయ‌శాఖ అధికారుల ప‌ర్యవేక్షణ అంతంత మాత్రంగానే ఉంది. దీంతో వెంక‌టాపురం, వాజేడు మండలాల‌కు చెందిన కొంద‌రు వ్యాపారులు ఎరువులు, పురుగు మందుల‌ను హ‌ద్దులు దాటిస్తూ అక్రమ మార్కెట్‌కు తెర‌లేపి ల‌క్షలు దండుకుంటున్నార‌నే ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. పురుగు మందులు కావాలంటే ఈపాస్ ద్వారానే రైతులు కొనుగోలు చేయాలి. దీంతో అక్రమార్జనే ల‌క్ష్యంగా పెట్టుకున్న కొంద‌రు వ్యాపారులు తెలంగాణ రైతుల ఆధార్ కార్డులతో ఎరువులు, కొనుగోలు చేసిన‌ట్లు పత్రాలు సృష్టించి పక్కనే ఉన్న ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి త‌ర‌లిస్తున్నట్లు ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి.

పాత‌ బ్యాచ్ నెంబ‌ర్లతో ఛత్తీస్‌గఢ్‌కు ఎరువులు..

మండ‌ల కేంద్రానికి చెందిన ఒక‌టి, రెండు పురుగు మందుల వ్యాపారుల‌తో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన రైతుల‌కు కొన్నేళ్లుగా వ్యాపార సంబంధాలు ఉన్నాయి. ఇదే అద‌ునుగా భావించి పాత‌ బ్యాచ్ నెంబ‌ర్ల ద్వారా ఎరువులు, పురుగు మందుల‌ను పక్కనే ఉన్న ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి త‌ర‌లించి త‌మ‌కు అనుకూల‌మైన వ్యాపార‌స్తుల వ‌ద్ద నిల్వ ఉంచుతున్నారు ఇక్కడి దుకాణాదారులు. మార్కెట్ ధ‌ర‌కంటే అద‌నంగా బ‌స్తాకు రూ.300 నుంచి రూ350 అధిక ధ‌ర‌ల‌కు విక్రయిస్తూ డబ్బులు వెనకేసుకుంటున్నారు. అంతే కాకుండా రాత్రి స‌మ‌యంలో వెంక‌టాపురం, వాజేడు మండ‌లాల నుంచి ప్రత్యేక వాహ‌నాల్లో ఎరువుల‌ను పక్క రాష్ట్రానికి త‌ర‌లిస్తున్నారు. నిత్యం జాతీయ ర‌హ‌దారి పై ఎక్కడో ఒక‌చోట వాహ‌నాల త‌నిఖీలు జ‌రుగుతూ ఉన్న సమయంలోనూ అధికారుల క‌న్ను గ‌ప్పి అక్రమార్కులు ఎరువుల‌ను ప‌క్క రాష్ట్రానికి త‌రలిస్తున్నారు. ఇకనైనా జిల్లా స్థాయి అధికారులు స్పందించి, మండలంలో పూర్తిస్థాయి వ్యవ‌సాయ అధికారిని నియ‌మించేలా చ‌ర్యలు తీసుకోవాల‌ని, ఫెర్టిలైజ‌ర్ దుకాణాల్లో క్రమం త‌ప్పకుండా త‌నిఖీలు చేప‌ట్టేలా అధికారులు చ‌ర్యులు తీసుకోవాల‌ని మండ‌ల రైతులు కోరుతున్నారు.

Next Story