ఇదేం లాక్‌డౌన్..? రోడ్డును ఆక్రమించిన జనం..

by  |
ఇదేం లాక్‌డౌన్..? రోడ్డును ఆక్రమించిన జనం..
X

దిశ, కామారెడ్డి : ఉదయం 6 గంటల నుంచి పది గంటల వరకు ప్రభుత్వం విధించిన అన్‌లాక్ ప్రక్రియను కామారెడ్డి ప్రజలు విచ్చలవిడిగా వినియోగించుకుంటున్నారు. అవసరం ఉన్నా లేకున్నా ప్రతి చిన్నదానికి జిల్లా కేంద్రానికి వస్తున్నారు. జనాల రద్దీతో కామారెడ్డి పట్టణం జనసంద్రంగా మారుతోంది. భౌతిక దూరం పాటించాలన్న ఆలోచన ఒక్కరికి కూడా లేదు. బయట తిరిగే వారిలో ఎంతమందికి కరోన లక్షణాలు ఉన్నాయో అనే భయం కూడా లేకుండా రోడ్లపైకి వస్తున్నారు. అవసరం అయితే తప్ప బయటకు రావద్దని ప్రభుత్వం సూచిస్తున్నా ప్రజలు పెడచెవిన పెడుతున్నారు. గుంపులు గుంపులుగా చేరుతూ మార్కెట్ ప్రాంగణాన్ని జనసంద్రంగా మారుస్తున్నారు. దుకాణాల యాజమాన్యాలు కూడా తమకు ఉన్న తక్కువ సమయంలో ఎక్కువ వ్యాపారం చేసుకోవాలనే ధోరణి అవలంభిస్తున్నారు.

ఒక్క దుకాణంలో కూడా భౌతిక దూరం పాటిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. తమ వ్యాపారాలు మాత్రమే ముఖ్యమన్న ధోరణిలో వ్యాపారస్తులు ఉంటున్నారు. ప్రభుత్వం నాలుగు గంటల పాటు సమయం ఇవ్వడంతో బయటకు వచ్చిన వారిని అధికారులు గానీ, పోలీసులు గానీ నిలువరించలేని పరిస్థితి నెలకొంది. ఏదైనా అంటే మేము సామగ్రి కొనుక్కోవాలా వద్దా అని ప్రజలు తిరగబడే సూచనలు ఉండటంతో కేవలం లాక్‌డౌన్ సమయంలో మాత్రమే బయటకు వచ్చిన వారిని కఠినంగా హెచ్చరిస్తున్నారు. ఇదే విధానం కొనసాగితే కరోన కేసులు మళ్ళీ తిరగదోడే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే పరీక్షలు తగ్గించి కేసులు తక్కువ చూపిస్తున్న అధికారులకు జనాలు ఇంతలా బయటకు రావడం ఆందోళనను కలిగిస్తోంది.


Next Story

Most Viewed