బంగారు తెలంగాణలో మా బ్రిడ్జి ఎక్కడా ?

by  |
బంగారు తెలంగాణలో మా బ్రిడ్జి ఎక్కడా ?
X

దిశ ప్రతినిధి, రంగారెడ్డి, కల్వకుర్తి: మారుతున్న కాలానికనుగుణంగా ప్రజా రవాణాలో ఎన్నో మార్పులు వచ్చాయి. మిలమిల మెరిసే తారురోడ్లు, భారీ వంతెనలు ఏర్పాటయ్యాయి. కానీ, కొన్ని గ్రామాల్లో ‘ఎక్కడవేసిన గొంగడి అక్కడే’ అన్న చందంగా తయారైంది. సరైన రవాణా సౌకర్యాలు లేక ప్రజలు అరిగోస పడుతున్నారు. వానాకాలం వచ్చిందంటే వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కొన్ని గ్రామాలకు ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితే కడ్తాల్, ఆమనగల్లు మండలాల్లో నెలకొంది. కడ్తాల్​మండలంలోని ముద్విన్​ వాగు, ఆమనగల్లు మండలంలోని పెద్దవాగు, రాంనుంతల వాగుపై వంతెనలు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

కడ్తాల్​ మండల పరిధిలోని ముద్విన్ గ్రామంలో 16 ఏళ్ల క్రితం వాగుపై నిర్మించిన వంతెన భారీ వర్షానికి కూలిపోయింది. నాటి నుంచి నేటి వరకూ వానాకాలం వచ్చిందంటే స్థానికులకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రతీ ఏడాది వివిధ రాజకీయ పార్టీలు మాయ మాటలు చెప్పి గద్దెనెక్కుతున్నాయే తప్ప వంతెన నిర్మించిన పాపాన పోలేదు. ఈ వాగు దాటేందుకు ఐదు గ్రామాల ప్రజలు నిత్యం అవస్థలు పడుతున్నారు. ఈ వాగు పై వంతెన నిర్మించాలని ఆయా గ్రామాల ప్రజలు అనేక మార్లు ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టారు. సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలకు ఎన్నో మార్లు వినతి పత్రాలు సమర్పించారు. ఒక్క నాయ కుడు పట్టించుకన్న దాఖాలాలు లేవని ఆయా గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పరిశీలనలకే పరిమితం..

ముద్విన్​వాగుపై వంతెన సమస్య ఒకటి, రెండు రోజుల ముచ్చట కాదు. సుమారుగా 16 ఏళ్లుగా కొనసాగుతుంది. రైతులు వ్యవసాయ పొలాలకు వెళ్లాలంటే వాగు దాటాల్సిందే. 2006, 2013లో కురిసిన భారీ వర్షానికి రాకపోకలు సుమారుగా నాలుగు రోజులు నిలిచిపోయాయి. వరద ఉధృతి తగ్గిన తర్వాత ఆ వాగులో మట్టి, పెద్ద పెద్ద బండరాళ్లు వేసి రాకపోకలు సాగిస్తా రు. ఇలాంటి పరిస్థితులను స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రత్యక్షంగా పరిశీలించారు. కానీ, ఆ సమస్యకు పరిష్కా రం ఏ నాయకుడు చూపకపోవడం బాధాకరమని ఆవే దన వ్యక్తం చేస్తున్నారు. వంతెన గురించి యువకులు ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రి కార్యాలయాలకు సైతం లేఖలు రాశారు. అయినప్పటికీ స్పందన కరువైంది.

ప్రజలకు తప్పని తిప్పలు..

ప్రతీ వర్షాకాలంలో ముద్విన్ వంతెనతో తిప్పలు తప్పడంలేదు. ఈ వాగు గుండా రాకపోకలు సాగించే శెట్టిపల్లి, గౌరారం, ఆకుతోటపల్లి, ముద్విన్ ప్రజలు వంతెన పునర్నిర్మాణం కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్, టీడీపీ హయాంలో హామీలు ఇచ్చి మరిచారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రెండోవ సారి అధికారంలోకి వచ్చినా వంతెన సమస్యను పరిష్కరించడంలో విఫలమైందని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు.

తండావాసుల పరిస్థితి దయనీయం..

ఆమనగల్లు​ మండల కేంద్రానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో శంకర్ కొండ తండా ఉంది. మేడిగడ్డ-శంకర్ కొండ తండాల మధ్య పెద్ద వాగు ఉంది. దీనికి తోడుగా రాంనుంతలవాగు సైతం ప్రస్తుత వర్షానికి పొంగిపొర్లుతోంది. వర్షం కురిసిందంటే పది రోజుల పాటు రాకపోకలు నిలిచిపోతాయి. ఎగువ ప్రాంతంలో ఉన్న ఆమనగల్లు సురసముద్రం చెరువు నిండితే ఈ వాగులు ఉధృతంగా పారుతుంటాయి. వాగు పారినన్ని రోజులు శంకర్ కొండ, దయ్యాల బోర్డ్, సామాయి పల్లి గిరిజనులు మండల కేంద్రానికి వెళ్లలేకపోతున్నారు. 108 వాహనం సైతం వెళ్లలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యార్థులు పాఠశాలలు, కళాశాలకు వెళ్లలేకపోతున్నారని తండావాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎన్నిసార్లు విన్నవించినా ప్రయోజనం లేదు.: పోతుగంటి యాదయ్య, సర్పంచ్

ముద్విన్ వాగుపై వంతెన నిర్మా ణం గురించి ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు నివేదించినా ఫలితం లేదు. ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ వంతెన నిర్మాణానికి హామీ ఇచ్చారు. వంతెన లేక రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయి.

16 ఏళ్లుగా ఇబ్బందులు: మహేశ్ ​స్థానికుడు

ముద్విన్ వాగుపై కొత్త వంతెన నిర్మించాలని16 ఏళ్లుగా ప్రజాప్రతినిధులను కోరుతున్నాం. అధికారంలో కి వచ్చిన పార్టీలన్నీ హామీ ఇస్తున్నాయి. ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే కిష్టారె డ్డి, మాజీ ఎంపీ జగన్నాథం, మా జీ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డికి వినతిపత్రం అందజేశాం.

ప్రతిపాదనలు పంపాం: సోనా శ్రీను నాయక్, రాంనుంతల సర్పంచ్

పెద్దతండా-రాంనుంతల మధ్య వాగుపై వంతెన లేక గ్రామస్తులు వ్యవసాయ పనులకు వెళ్లాలంటే ఇబ్బందులు కలుగుతున్నాయి. ఆ వాగు పారితే 10రోజుల వరకు రాకపోకలు బంద్. వంతెన నిర్మా ణం గురించి స్థానిక ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ద్వారా ప్రతిపాదనలు పంపాం. వంతెన వాగు నిర్మిస్తే మూడు మండలాల ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది.

వర్షాకాలంలో సమస్య: రాములు, తండావాసి

సురసముద్రం చెరువు అలుగు పడినప్పుడల్లా శంకర్ కొండ, దయ్యాలబోడ్, సమాయిపల్లి గ్రామస్తులకు సమస్య తప్పదు. సుమారుగా 10 రోజులకు పైగా రాకపోకలు నిలిచిపోయాయి.

Next Story

Most Viewed