సమస్యల ధరణి.. ప్రజలకు ముప్పు తిప్పలు

by  |
సమస్యల ధరణి.. ప్రజలకు ముప్పు తిప్పలు
X

‘ధరణి పోర్టల్‌ను చూసి ప్రపంచం అబ్బురపడుతున్నది. ఆన్‌లైన్‌లో సత్వర సేవలందిస్తున్నాం. సమస్య పరిష్కారం కోసం ఎవరైనా దరఖాస్తు చేసుకుంటే.. నిర్దిష్ట సమయంలో అధికారులే రికార్డులు పరిశీలించి సమస్యను పరిష్కరిస్తారు. సంబంధిత కాగితాలను రైతుల ఇంటికే తీసుకొచ్చి ఇస్తారు. ఎవరినీ కలవాల్సిన అవసరం లేదు. ఎవరికీ ఫైలు ఇవ్వాల్సిన పని లేదు.’ అంటూ ప్రజాప్రతినిధులు మొదలు అధికారుల వరకు ధరణి పోర్టల్ గురించి ఇలాగే చెబుతూ వస్తున్నారు. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. సమస్య పరిష్కారం కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుదారులకు అధికారులు చుక్కలు చూపిస్తున్నారు. సమస్యకు సంబంధం లేని డాక్యుమెంట్స్ అడుగుతూ ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఎలాగోలా అధికారులతో సంతకాలు చేయించి ఫైలును కలెక్టర్‌కు సమర్పించినా అక్కడా రిజెక్ట్ చేస్తున్నారు. ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారనే కారణాలను మాత్రం వెల్లడించడం లేదు.

దిశ, తెలంగాణ బ్యూరో : ధరణి పోర్టల్‌పై అధికారులు, ప్రజాప్రతినిధులు చెప్పిన మాటలకు ప్రస్తుతం కొనసాగుతున్న విధానానికి ఎక్కడా పొంతన కుదరడం లేదు. ఎదైనా సమస్య పరిష్కారం కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నా.. తహశీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్​ ఆఫీస్‌ల చుట్టూ బాధితులకు ప్రదక్షిణాలు తప్పడం లేదు. తమ భూమిపై, సర్వే నంబర్, సబ్ డివిజన్ పై ఎలాంటి వివాదాలు లేవని, దానిని నిషేదిత జాబితా (పీఓబీ) నుంచి తొలగించాలని దరఖాస్తు చేసుకున్న వారిని ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఖాస్రా పహాణీ నుంచి ప్రస్తుత ఏడాది వరకు పహాణీలను, సదరు భూమి వారికి ఎలా వచ్చింది అనే ఆధారాలను సమర్పించాలని దరఖాస్తుదారులను కలెక్టర్లు ఆదేశిస్తున్నారు. ఎవరో ఆ సర్వే నంబరులోని కొంత భూమిపై కేసు వేస్తే.. ఆ డాక్యుమెంట్లు తీసుకురావడం సామాన్య రైతుకు సాధ్యం కాదు. ఒకవేళ అడిగితే అతడి పట్టాదారు పాసు పుస్తకాల్లోని సర్వే నంబర్లపై కేసులు ఏవీ లేవని నిర్దారించుకుంటే సరిపోతుంది. కానీ, అదంతా పక్కన బెట్టి 70 ఏండ్లకు సంబంధించిన పహాణీలను అధికారులు అడగడం వెనక ఆంతర్యమేమిటని బాధితులు ప్రశ్నిస్తున్నారు. వాటన్నింటిని ఫైల్ చేసి తహశీల్దార్, ఆర్డీఓలతో సంతకాలు చేయించి కలెక్టర్ కార్యాలయంలో మాన్యువల్‌గా సమర్పించాలన్న ఆంక్షలు కొనసాగిస్తున్నారు. రాష్ట్రంలో పలువురు కలెక్టర్లు ఆన్‌లైన్ ​దరఖాస్తులతో పాటు ఇలా ఫిజికల్‌గా డాక్యుమెంట్లు సైతం అడుగుతుండటం గమనార్హం.

ముప్పుతిప్పలు, తిరస్కరణలు

పీఓబీ నుంచి తమ భూమిని తొలగించాలంటూ వచ్చే దరఖాస్తుల పరిష్కారం కోసం అధికారులు దరఖాస్తుదారులను ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఆ జాబితాలో ఎందుకు కేసు నమోదు చేశారు? ఎవరు కేసు వేశారు? ఎందుకు వేశారు? ఇప్పుడు ఏ స్టేజ్​లో ఉంది? ఇలాంటి వివరాలేవీ అధికారులు ఇవ్వడం లేదు. అన్నీ తెలుసుకుని ధరణి పోర్టల్ ​మాడ్యూల్ ​ద్వారా డాక్యుమెంట్లు అప్‌లోడ్​ చేసి దరఖాస్తు చేసుకున్నా సమస్య పరిష్కారం కావడం లేదు. కలెక్టర్ ​లాగిన్ ​నుంచి తహశీల్దార్‌ వద్దకు రావడానికి పైరవీ చేయాల్సిన పరిస్థితి. అప్లికేషన్ చూసి తహశీల్దార్ ​రిపోర్ట్ ​పంపినా వీటిని పరిశీలించకపోగా సంతకాలు చేసిన ఫైళ్లను తీసుకురావాలని, అందులో సంబంధించి ఖాస్రా పహాణీ మొదలుకొని ప్రస్తుతం వరకు అన్ని డాక్యుమెంట్లను సమర్పించాలని కలెక్టర్లు చెబుతుండటం గమనార్హం.

రికార్డులను పరిశీలించాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులదే అయినా ఆ పత్రాలన్నింటినీ తీసుకురావాలనడంతో దరఖాస్తుదారులు ఇబ్బంది పడుతున్నారు. ఇక కోర్టు కేసులతో సంబంధం లేకపోయినా.. నిషేధిత జాబితాలో నమోదు చేసిన భూములే అధికం. వాటికి సైతం ఇలా అన్ని పత్రాలను అడుగుతుండటం గమనార్హం. తమ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా 80 వేల దరఖాస్తులొస్తే అందులో కనీసం 10 వేలు సైతం అధికారులు పరిష్కరించలేదని సమాచారం. ప్రస్తుతం క్రయ విక్రయాలు, ఇతర లావాదేవీల కోసం అత్యవసరమైన వారే సమస్య పరిష్కారం కోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ వీటిని సరైన కారణం చెప్పకుండానే కలెక్టర్లు రిజెక్ట్​చేస్తున్నారు. కారణం చెబితే అవసరమైన పత్రాలతో దరఖాస్తుదారుడు మరో సారి ప్రయత్నించే అవకాశం ఉంది. నిజానికి ఆ పత్రాలన్నింటినీ చూసే బాధ్యత రెవెన్యూ అధికారులదేని, దరఖాస్తును పరిష్కరించేందుకు నాలుగు నుంచి ఆర్నెళ్ల సమయం తీసుకుంటున్నారని, ఆ తర్వాత సైతం రిజెక్ట్​అంటూ మెసెజ్ ​పంపడం వల్ల దరఖాస్తుదారులు ఎంత ఇబ్బంది పడతారో కలెక్టర్లు ఆలోచించాలని ఓ రిటైర్డ్ జాయింట్ కలెక్టర్ సూచించారు.

ఇలాంటి వారు ఎందరో..

హైదరాబాద్‌లో ప్రైవేటు ఉద్యోగం చేస్తోన్న రవి అనే వ్యక్తికి యాదాద్రి జిల్లాలో రెండెకరాల భూమి ఉంది. దాన్ని విక్రయించేందుకు ప్రయత్నించగా అది పీఓబీ జాబితాలో ఉందని తెలిసింది. ఆయన సర్వే నంబరులోని పాక్షిక భూమిపై ఎవరో కేసు వేశారు. ఆ సబ్​డివిజన్ ​ఆయనది కాదు. ఐనా మొత్తం సర్వే నంబరును అధికారులు పీఓబీలో చేర్చారు. సమస్యను పరిష్కరించాలని ఆయన ధరణి పోర్టల్‌లో దరఖాస్తు చేసుకున్నారు. నెలల తరబడి వేచిచూసినా పరిష్కారం కాకపోవడంతో యాదగిరిగుట్ట తహశీల్దార్​కార్యాలయానికి వెళ్లి ఆరా తీశారు. కేసుతో సంబంధం లేకపోయినా.. ఖాస్రా పహాణీ మొదలుకొని ప్రస్తుతం వరకు డాక్యుమెంట్లు అన్నీ తీసుకురావాలని అధికారులు చెప్పారు. సంబంధిత డాక్యుమెంట్స్ ఫైల్ చేసి తహశీల్దార్, ఆర్డీఓలతో సంతకాలు చేయించి కలెక్టరేట్‌లో సమర్పించారు. అయినా సమస్య పరిష్కారం కాలేదు. ఇంతలో కొత్త కలెక్టర్ ​వచ్చారు. కొత్త కలెక్టర్ నిషేధిత భూములకు సంబంధించిన ఫైళ్లను ముట్టుకోవడం లేదని రెవెన్యూ సిబ్బంది చెబుతుండటం గమనార్హం. ఇలా ఎందురో ఇబ్బందులు పడుతూ, ఉద్యోగానికి సెలవులు పెట్టి సమస్య పరిష్కారం కోసం అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు.

Next Story