జనసేనాని నోట.. ‘నల్లమల చెంచుల’ మాట.. వీడియో వైరల్

146

దిశ, అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లాలోని నల్లమల ప్రాంతంలో జీవిస్తున్న ఆదివాసీ చెంచు గిరిజనుల పరిస్థితిని వివరించిన చెంచు యువకులైన చిగుర్ల మల్లికార్జున్, శివ గురించి  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  ప్రస్తావించడం సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతుంది.

ఏం జరిగిందంటే..

దేశంలో భూ అంతర్భాగంలో లభిస్తున్న వివిధ విలువైన ఖనిజ సంపద వనరులను దేశ అభివృద్ధి, ఆర్థిక పరిస్థితిని మెరుగు పరిచేందుకు  కేంద్ర ప్రభుత్వం వెలికితీసేందుకు చర్యలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలోనే నల్లమల అటవీ ప్రాంతంలో భూ అంతర్భాగంలో నిక్షిప్తమైన, విలువైన ఖనిజ సంపదలో ఒకటైన యురేనియం నిక్షేపాలు విరివిగా ఉన్నాయని, ఆ సంపద ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ మరింత మెరుగు పడుతుందని భావించారు.  కావున ఆ నిక్షేపాలను వెలికి తీసేందుకు మొదటగా 2004లో అప్పటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సానుకూలతను వ్యక్తం చేశాయి. తదుపరి పరిణామాల అనంతరం 2009, 2014 మరియు 2018- 19 ఎన్నికల అనంతరం పలుమార్లు నల్లమల యురేనియం నిక్షేపాల వెలికితీత విషయం కేంద్ర ప్రభుత్వం మరోసారి తెరపైకి తెచ్చింది. ఈ సందర్భంగా నల్లమల ప్రాంత ప్రజలు, పర్యావరణవేత్తలు, విద్యావంతులు, మేధావులు, సినీ ప్రముఖులు, “సేవ్ నల్లమల” పేరుతో అనేక పోరాటాలు చేశారు. ఈ నేపథ్యంలో 2019 లో కాంగ్రెస్ పార్టీ ఇతర అఖిలపక్ష రాజకీయ నాయకులతో కలిసి హైదరాబాద్ నగరంలో నల్లమలలో యురేనియం నిక్షేపాల వెలికితీత విషయంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు.

ఈ సమావేశంలో చెంచు బిడ్డలు ఏమన్నారంటే..

ఆనాటి రౌండ్ టేబుల్  సమావేశంలో నల్లమల ప్రాంతంలోని నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం సార్లపల్లి గ్రామానికి చెందిన సర్పంచ్ చెంచు బిడ్డ చిగుళ్ల మల్లికార్జున్ మరియు పదర మండలానికి చెందిన శివ అనే వ్యక్తులు హాజరయ్యారు. ఈ సందర్భంగా చిగుళ్ల మల్లికార్జున్ మాట్లాడుతూ.. నల్లమలలో యురేనియం నిక్షేపాలు వెలికితీయడం మూలంగా చెంచు జాతి కనుమరుగవుతుందని, పర్యావరణం ముప్పు వాటిల్లుతుందని, అడవి తల్లిని, అడవిలో ఉన్న వన్యప్రాణులను ఆదివాసీలు కాపాడుతూ వస్తున్నారని తెలిపారు.  ఆదివాసీ గిరిజనులు కుటుంబ సభ్యులతో సమానంగా వన్యప్రాణులును కూడా చూసుకుంటారని, వాటిని కుటుంబ సభ్యులానే సంబోధిస్తారని అన్నారు. అలాగే భారత రాజ్యాంగంలో ఆదివాసీల హక్కులకు భంగం కలవకుండా 6వ షెడ్యూల్లో పొందుపరిచిన అంశాలను వివరించడం జరిగింది.

అందరి పోరాటాల ఫలితంగా..

ఏదేమైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా అసెంబ్లీలో మాట్లాడుతూ.. నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం నిక్షేపాలు వెలికితీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకిస్తోందని తెలుపుతూ  అసెంబ్లీలో  తీర్మానాన్ని చేసి కేంద్రానికి పంపించిన విషయం విదితమే. తదుపరి కేంద్ర ప్రభుత్వం ఒక అడుగు వెనక్కి వేసి, కేంద్ర పర్యావరణ బోర్డు సూచనల మేరకు నల్లమలలో యురేనియం నిక్షేపాలు వెలికితీసేందుకు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న అటవీశాఖ సర్వేకు అనుమతులు నిరాకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం విదితమే. ఈ విజయం నల్లమల ప్రజల సొంతం అయ్యింది.

చెంచుల గురించి పవన్ ఇప్పుడెందుకు మాట్లాడారంటే..?

జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సోమవారం పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ.. “అంతకుముందు మా పార్టీ కార్యాలయం వద్ద వర్షానికి తడుస్తున్న ఇద్దరు వ్యక్తులు నా కంట పడ్డారని, సహజంగా ఎవరినైనా కనిపిస్తే విష్ చేస్తూ వెళ్తానని.. కానీ, ఆ ఇద్దరు వ్యక్తులను చూసినప్పుడు వారు ఎందుకు వచ్చారో, విషయమేమిటో పూర్తిగా తెలుసుకోవాలని వారిని కార్యాలయంలోకి పిలిచి చర్చించడం జరిగిందన్నారు.

ఆ రౌండ్ టేబుల్ సమావేశంలో..

కాంగ్రెస్ తో పాటు అన్ని పార్టీల అఖిలపక్ష నాయకులతో కలిసి నల్లమలలో యురేనియం వెలికితీత.. ఈ విషయంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేక జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పెద్దలు వీహెచ్ హనుమంతరావు, కోదండరాం, పాశం యాదగిరి, నల్లగొండ జిల్లా పర్యావరణవేత్తలు, వారితో పాటు చెంచుల ప్రతినిధి చిగుళ్ల మల్లికార్జున్ తాను మాట్లాడుతున్న మాటలు నిత్య గుర్తు చేస్తుంటాయని ఆయన ప్రస్తావించారు. తన మాటల్లో అమెరికాలో రెడ్ ఇండియన్ చీప్ మాట్లాడుతున్నట్లుగా అనిపించిందని ఆ మాటను భీమ్లా నాయక్ మరోసారి జనసేన పార్టీ కార్యకర్తలతో ప్రస్తావిస్తూ.. “అడవిలో ఉన్న నా వాగులు, వంకలు, చెట్లు, చేమలు సెలయేళ్లు.. మా అన్నదమ్ములుగా, అక్కచెల్లెళ్లుగా భావిస్తామని, పెద్దపులిని పెద్దమ్మతల్లిగా, ఎలుగు బంటిని లింగమయ్యగా, తేనె పట్టును మల్లన్నగా మా చంచల జీవితాలు అడవిలో అనేకమైన బ్రతుకుతూ ఉంటామని, పర్యావరణం పరిరక్షించినప్పుడే అభివృద్ధి కొనసాగుతుందని, అదే నిజమైన అభివృద్ధిని, చెంచులను కాపాడాల్సిన అవసరం ఉందని ఆయన గుర్తు చేశారు. అలాగే మల్లికార్జున్ పర్యావరణ మంత్రిగా మరియు శివ అనే యువకుడు అటవీశాఖ మంత్రిగా మరో 10 సంవత్సరాల తర్వాత అయితే ఎలా ఉంటుందో వారి మాటల్లో నిక్షిప్తమై ఉన్నదని, అలాంటి నాయకులు అవసరమని తాను కార్యకర్తలనుద్దేశించి మాట్లాడిన వీడియో నేడు వైరల్ అవుతూ సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతుంది.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..