ప్రాణ త్యాగాలు అవసరం లేదు… ప్లకార్డులు పట్టుకోండి.. ఏపీ ఎంపీలపై పవన్ ఫైర్

by srinivas |   ( Updated:2021-12-20 03:43:10.0  )
Pawan kalyan
X

దిశ, ఏపీ బ్యూరో : జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ విశాఖ ఉక్కు- ఆంధ్రుల హ‌క్కు నినాదంతో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్ర‌ైవేటీక‌ర‌ణకు వ్య‌తిరేకంగా డిజిటల్ క్యాంపైన్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న విశాఖ ఉక్కు ఫ్యాక్ట‌రీ ప్ర‌యివేటీక‌ర‌ణ నిర్ణ‌యాన్ని వెనక్కితీసుకునేంత వ‌ర‌కు త‌మ పోరాటం కొన‌సాగిస్తామ‌ని జ‌న‌సేన ప్ర‌క‌టించింది. జనసేన డిజిటల్ క్యాంపైన్ సోమవారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో సోమవారం పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా అధికార వైసీపీ ఎంపీల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘విశాఖ స్టీల్ ప్లాంట్ ప్ర‌యివేటీక‌ర‌ణ‌కు వ్యతిరేకంగా వైసీపీ ఎంపీలు పార్లమెంట్‌లో ప్లకార్డులు పట్టుకోవాలని డిమాండ్‌ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ప్రాణ త్యాగాలు చేస్తామన్న వైసీపీ ఎంపీలు.. ప్లకార్డులు పట్టుకుంటే చాలని.. ప్రాణత్యాగాలు వంటి త్యాగాలు అక్కర్లేదంటూ’ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేసిన ఈ ట్వీట్ ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారింది. ఇకపోతే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యోగులు, కార్మిక సంఘాలు చేస్తున్న ఆందోళనలకు పవన్ కళ్యాణ్ గతంలో మద్దతు పలికారు. ఇందులో భాగంగా భారీ బహిరంగ సభను సైతం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. విశాఖ ఉక్కు ఫ్యాక్ట‌రీ ప్ర‌యివేటీక‌ర‌ణ‌ను అడ్డుకునేందుకు.. అఖిలపక్షాన్ని దేశ‌రాజ‌ధాని ఢిల్లీకి తీసుకెళ్లాలని విశాఖ సభలో పవన్ డిమాండ్ చేశారు.

అయినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడంతో పవన్ కళ్యాణ్ ఈ నెల 12న ‘విశాఖ ఉక్కు పరిరక్షణ దీక్ష’ పేరిట ఆయ‌న ఒక రోజు దీక్ష సైతం చేశారు. తెలంగాణ పార్ల‌మెంట్ స‌భ్యుల మాదిరిగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎంపీలు ఎందుకు పోరాటం చేయ‌డం లేద‌ని ఆరోపించారు. ఏపీలోని 25 మంది ఎంపీలు విశాఖ ఉక్కు ఫ్యాక్ట‌రీ కోసం పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లో ఎందుకు పోరాడ‌టం లేదని నిలదీశారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్ర‌యివేటీక‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా అంద‌రూ క‌లిసిక‌ట్టుగా పోరాడాల‌ని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.

Next Story