టేక్(డే)​కేర్ చిల్డ్రన్స్..

by  |
Childrensin day care centers
X

ఉమ్మడి కుటుంబాలు కనుమరుగయ్యాయి. బంధాలు, బంధుత్వాలు కనిపించడం లేదు. ఎవరి పనుల్లో వారు బిజీ. అంతా ఉరుకుల పరుగుల జీవితం. నగర జీవి ఉదయం నుంచి రాత్రి వరకు బిజీబిజీగా గడుపుతుంటాడు. తల్లిదండ్రులు ఉద్యోగం, వ్యాపారాల పనుల్లో మునిగి తేలుతుంటే పిలల్లతో ఆటలు ఆడేవారు, మాట్లాడే వారే ఉండరు. డే కే ర్ సెంటర్లలో వదిలి ఉద్యోగాలకు వెళ్తుంటారు. దీంతో బాల్యం నుంచే చిన్నారులు ఒంటరిగా ఫీలవుతున్నారు. చిన్నారులకు ఆటబొమ్మలు, వీడియో గేమ్స్ మాత్రమే తోడవుతున్నాయి. లేదంటే టీవీలకు అతుక్కుపోతున్నారు. దీంతో చిన్నారుల్లో ఒత్తిడి, మానసిక ఆందోళనలు ఎక్కువ అవుతున్నాయని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

దిశ, శేరిలింగంపల్లి: మహానగరం కాంక్రీట్ జంగిల్ లా మారింది. ఉద్యోగ, వ్యాపార నిమిత్తం సిటీకి వచ్చిన వారు పొద్దస్తమానం పనులు చూసుకోవడంలోనే తలమునకలై ఉంటున్నారు. కుటుంబంతో గడిపేది తక్కువే. ఇంట్లో ఉన్న కాసేపు కూడా ఏదో ఒక టెన్షన్. ఇక పిల్లలకు సమయం కేటాయించడం అంతంత మాత్రమే. ఇక పెద్దవారిని ఎలాగూ నగరానికి తీసుకురారు. ఒకవేళ వచ్చినా వాళ్లు ఈ సిటీ వాతావరణంలో ఒకటి రెండు రోజులకు మించి ఉండలేరు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో పిల్లలను డే కేర్ సెంటర్లలో వేయాల్సి వస్తోంది. ఎక్కువ మంది చిన్నారులను అక్కడే వదిలేసి ఉద్యోగాలకు వెళ్తున్నారు. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులకు ఇది తప్పడం లేదు. ఎక్కువమంది క్రేష్, డే కేర్ సెంటర్లలో తమ పిల్లలను వేస్తున్నారు. దీంతో నగరంలో వీధికో డే కేర్ సెంటర్లు వెలిశాయి.

పెద్దవాళ్ల ముచ్చట్లు కరువు..

ఇంట్లో పెద్దవారు చిన్నపిలల్లను ఆడిస్తూ, చిట్టిపొట్టి మాటలు నేర్పిస్తూ ఉంటారు. కానీ, ఇప్పుడు అమ్మమ్మల ఆటలు లేవు, నానమ్మల ముచ్చట్లు లేవు. తాతయ్యల మురిపాలు కానరావడం లేదు. పెద్దలే కాదు పిల్లలు కూడా యాంత్రిక జీవితాలకు అలవాటు పడుతున్నారు. కొంతమంది పిల్లలకు ఏళ్లు గడుస్తున్నా మాటలు రావడం లేదన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇక గ్రహణశక్తి, వినికిడి సమస్య, ఇతర మానసిక సమస్యలు తలెత్తుతున్నాయి. కొంతమంది చిన్నారులు తోటి పిల్లలతో కూడా కలవకుండా ఒంటరిగా గడుపుతుంటారని కేర్ సెంటర్స్ నిర్వాహకులు చెబుతున్నారు. కొంతమంది పిల్లలు అయితే కేర్ సెంటర్ కు వస్తూనే ఏడుపు లంఖించుకుంటున్నారని, తిరిగి వెళ్లే వరకూ మూడీగా ఉంటూ ఎవరితో కలవకుండా ఉంటున్నారని చెబుతున్నారు. అదే పెద్దవారు ఇంట్లో ఉంటే చిన్నారులకు ఆడిస్తూ.. పాడిస్తూ ఉంటారని మానసిక నిపుణులు పేర్కొంటున్నారు.

ఒత్తిడి లేకుండా చూడాలి..

ప్రస్తుత పరిస్థితుల్లో పెద్దలే కాకుండా పిల్లలు కూడా మానసిక ఆందోళనకు గురవుతున్నారు. పిల్లలు సున్నిత మనస్కులు. వారికి ఏది చెప్పాలన్నా, ఏది నేర్పాలన్న చిన్నప్పుడే చేయాలి. పిల్లలు ఒకసారి మానసిక ఒత్తిడికి లోనైతే అది దీర్ఘకాలంలో తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఎన్ని పనులున్నా కొంత సమయం పిల్లలకోసం కేటాయించాలి. వారితో చిన్నచిన్న సంతోషాలు షేర్ చేసుకుంటూ టైమ్ స్పెండ్ చేస్తే చిన్నారులు హ్యాపీగా ఉంటారు. – డాక్టర్ శ్రీనివాస్, మానసిక నిపుణుడు

Next Story

Most Viewed