చిన్నారులను పనికి పంపితే ఇక అంతే సంగతులు.. కీలక ఉత్తర్వులిచ్చిన ప్రభుత్వం..

by  |
చిన్నారులను పనికి పంపితే ఇక అంతే సంగతులు.. కీలక ఉత్తర్వులిచ్చిన ప్రభుత్వం..
X

దిశ, తెలంగాణ బ్యూరో: చిన్నారులను తల్లిదండ్రులు పనికి పంపిస్తే వారిపై కూడా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్ర చట్టానికి అనుగుణంగా రాష్ట్రంలో బాలకార్మిక చట్టాన్ని సవరిస్తూ విధివిధానాలు ఖరారు చేస్తూ కార్మికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 14 ఏళ్ల లోపు చిన్నారులతో ఎవరైనా, ఎక్కడైనా పనిచేయించుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని, ఇందుకు ఆర్నెళ్ల నుంచి ఏడాది జైలుశిక్షతో పాటు రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకు జరిమానా విధించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఒకవేళ చిన్నారులను తల్లిదండ్రులే పనికి పంపిస్తే వారు కూడా శిక్షార్హులేనని, అయితే చిన్నారుల విద్యకు ఎలాంటి ఆటంకం కలగకుండా పనుల్లో చిన్నారులు వారి తల్లిదండ్రులకు సహాయపడవచ్చని సూచించింది. హానికరమైన పనులు, ఆదాయం వచ్చేలా తయారీ రంగం, ఉత్పత్తి, రిటైల్ చైన్ సరఫరా పనులకు వినియోగించరాదని స్పష్టం చేసింది. అదే విధంగా పాఠశాల సమయాలతో పాటు రాత్రి 7 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు చిన్నారులు పని చేయరాదని, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన, పర్యవేక్షణ కోసం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.

ముందస్తు అనుమతి లేకుండా 30 రోజుల పాటు చిన్నారి పాఠశాలకు గైర్హాజరైతే ఆ విషయాన్ని పాఠశాల ప్రిన్సిపాల్ నోడల్ అధికారి దృష్టికి తీసుకెళ్లాలని స్పష్టం చేసింది. ఇక కళాకారులుగా చిన్నారులు పనిచేసే అంశంలో నిబంధనలు పాటించాలని, సినిమాలు, ఇతర చిత్రీకరణలో చిన్నారులు నటించేందుకు కలెక్టర్ల నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని, నిర్మాత లేదా దర్శకులు ఈ మేరకు అనుమతి పొందాలని పేర్కొన్నారు. చిన్నారుల ఇష్టానికి వ్యతిరేకంగా ఎలాంటి చిత్రీకరణలోనూ పాల్గొనేలా చేయరాదని, రోజుకు ఐదు గంటలకు మించి, విరామం లేకుండా మూడు గంటలకు మించి చిన్నారులను చిత్రీకరణలో పనిచేయించకూడదని తెలిపారు.

చిత్రీకరణ సమయంలోనూ అన్ని రకాల జాగ్రత్తలు పూర్తి స్థాయిలో పాటించాల్సి ఉంటుందని, చిన్నారుల పరిరక్షణ, విద్యాహక్కు చట్టం, లైంగిక వేధింపుల చట్టం ఉల్లంఘనలు లేకుండా చూడాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. చిన్నారుల విద్యకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవడంతో పాటు 27 రోజులకు మించి ఏ చిన్నారిని చిత్రీకరణకు అనుమతించకూడదని హెచ్చరించింది. ఐదు మందికి మించి చిన్నారులు చిత్రీకరణలో ఉన్నట్లైతే వారి పర్యవేక్షణ కోసం ఒక వ్యక్తిని ప్రత్యేకంగా నియమించాలని, చిన్నారులకు వచ్చే ఆదాయంలో కనీసం 25శాతం మొత్తాన్ని బ్యాంకులో ఫిక్స్ డ్ డిపాజిట్ చేయాలని, సదరు చిన్నారి మేజర్ అయ్యాక ఆ మొత్తం చిన్నారికి చెందేలా చూడాలని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో వెల్లడించింది.



Next Story

Most Viewed