మీరు నర్సులా.. అయితే నో ఎంట్రీ! షాకిస్తోన్న ఇంటి ఓనర్లు

109
House Rental

దిశ, తెలంగాణ బ్యూరో : జోనల్ ​పోస్టింగ్ ​తర్వాత కొత్త ఊర్లలో నర్సులు ఇంటి కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఆసుపత్రుల్లో పనిచేస్తే ఇళ్లు అద్దెకివ్వమంటూ కొందరు వ్యక్తులు విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. మీ వల్ల తమ కుటుంబ సభ్యులకు ఒమిక్రాన్​అంటుకునే ప్రమాదం ఉన్నదంటూ ఓనర్లు చెప్పడం గమనార్హం. జాగ్రత్తలు తీసుకుంటూ డ్యూటీలు చేస్తామని ప్రాధేయపడినా ఇళ్ల ఓనర్లు కనికరించడం లేదు. తమ పిల్లలకు, పేరెంట్లకు వైరస్​అంటుకుంటే మీరు బాధ్యత వహించలేరు కాదా? అంటూ మరి కొంత మంది ఓనర్లు వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తున్నారని నర్సులు వాపోతున్నారు.

మరి కొన్ని చోట్ల ఫ్యామిలీలకే రూమ్‌లు ఇస్తామంటూ తేల్చేస్తున్నారు. ఇంకొన్ని జిల్లాల్లో అడ్వాన్స్‌లు తీసుకొని ఇంటి ఓనర్లు రూమ్‌లు ఇచ్చినా, మిగతా రూమ్‌లలో అద్దెకుండే వారు ఇళ్లు ఖాళీ చేసి వెళిపోతామని ఓనర్లకు చెబుతున్నారు. దీంతో చేసేదేమీ లేక తీసుకున్న అడ్వాన్స్‌లు తిరిగి నర్సులకు ఇచ్చేస్తున్నారు. ఇంటి సామాగ్రీని ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు తెచ్చుకున్న తర్వాత కూడా చివరి నిమిషంలో ఓనర్లు ఇల్లు ఇవ్వలేమని నొక్కి చెబుతున్నారు. దీంతో నర్సులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరి కొందరు చేసేదేమీ లేక హాస్టళ్లు, హోటళ్లలో ఉండాల్సిన దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి.

స్థానికత లేకపోవడమే సమస్య..

కొత్త జోన్ల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా నర్సింగ్​పోస్టింగ్‌లన్నీ గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. స్థానికత ఆధారంగా కొత్త పోస్టింగ్‌లు ఇవ్వకపోవడంతో ఆయా ఊర్లలో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇక బ్యాచిలర్స్, భార్యాభర్తలిద్దరూ జాబ్​చేస్తుంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విధులను కూడా సక్రమంగా నిర్వర్తించలేకపోతున్నామని పలువురు నర్సలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త విధానంతో ఒక వైపు పని ఒత్తిడితో పాటు మానసికంగా ఆందోళన చెందుతున్నట్లు నర్సులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ప్రభుత్వం స్పందించి కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలను కాపాడుతున్న తమకు న్యాయం చేయాలని నర్సులు కోరుతున్నారు.

హైదరాబాద్​నుంచి సిరిసిల్లాలో పడేశారు.. ఓ స్టాఫ్​నర్సు ఆవేదన

మాది ఉమ్మడి నల్గొండ జిల్లా. 2017లో స్టాఫ్ నర్సు ఉద్యోగాన్ని సాధించాను. 2021లో పోస్టింగ్‌లు ఇచ్చారు. అప్పట్లో సూర్యాపేట, నల్లగొండలో ఖాళీ లేదంటే హైదరాబాద్​నిలోఫర్‌లో చేరాం. కానీ విధుల్లో చేరి ఆరు నెలలు కాకముందే మళ్లీ కొత్త జోన్లంటూ తీసుకెళ్లి రాజన్న సిరిసిల్లా జిల్లాలో పడేశారు. అర్ధరాత్రి మెస్సేజ్‌లు పెట్టి మూడు రోజుల్లో చేరాలని ఆదేశాలిచ్చారు. చేసేదేమీ లేక సడన్‌గా వచ్చి డ్యూటీలో చేరాను. కానీ ఇక్కడ ఇల్లు అద్దెకు దొరకడం లేదు. చిన్నపిల్లలు ఉన్నారు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఆసుపత్రుల్లో పనిచేస్తే రూమ్‌లు ఇవ్వమని చెప్పేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది నర్సులు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం దీన్ని సీరియస్‌గా తీసుకొని పరిష్కరించాలి.