సొమ్ము ఒకరిది.. సోకు ఇంకొకరిదంటే ఇదేనేమో!

by  |
సొమ్ము ఒకరిది.. సోకు ఇంకొకరిదంటే ఇదేనేమో!
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: పేదలకు సేవ చేయాలనే సర్కా ర్ ​ఆశయాన్ని క్యాష్​ చేసుకుంది. సౌకర్యాలు లేని ఆస్పత్రి అయినప్పటికీ నిధులు వెచ్చించి రిపేర్లు చేయించిన ప్రభుత్వానికే చేయిచ్చింది. ఆపత్కాలంలో అండగా నిలుస్తుందని చేరదీసిన యంత్రాంగానికి నిజామాబాద్​లోని ఓ ప్రైవేట్​ ఆస్పత్రి యాజమాన్యం షాక్​ ఇచ్చింది. ఇచ్చిన మాట ప్రకారం ఉచితంగా సేవ చేయాల్సిన వేళ ప్లేట్​ ఫిరాయించింది. కరోనా బాధితుల నుంచి డబ్బులు వసూలు చేస్తూ ఖజానా నింపుకుంటుందనే విమర్శలూ ఉన్నాయి.

నిజామాబాద్ లోని ప్రభుత్వ వైద్య కళాశాలకు అనుబంధంగా ఓ జనరల్ ఆస్పత్రి ఉంది. మార్చిలో లాక్ డౌన్ విధించిన సమయంలో నిజామాబాద్ లో 61, కామారెడ్డిలో 12 పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ దవాఖానాను కొవిడ్ హాస్పిటల్​గా మార్చి సేవలు అందించాలని యంత్రాంగం భావించింది. అయితే అన్ లాక్ కాలంలో కరోనా కేసులు వందల సంఖ్యను దాటడంతో ఐసొలేషన్, ఆక్సిజన్, వెంటిలేటర్ల సౌకర్యం కల్పించి తద్వారా బాధితులకు మెరుగైన సేవలందించేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. కాగా, అప్పటివరకు ప్రభుత్వం ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా పరీక్షలకు అనుమతులు ఇవ్వలేదు. దీంతో జనరల్​ ఆస్పత్రిలో కొవిడ్​ సేవలు ప్రారంభం కావడంతో ఇతర సేవలకు రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయాన్ని యంత్రాంగం గుర్తించింది. అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని భావించింది.

ప్రైవేటు దవాఖానతో ఒప్పందం

కరోనా కేసులు పెరుగుతుండడంతో జిల్లా అధికారులు, జనరల్ ఆస్పత్రి వైద్యులు సమాలోచన చేసి ఆస్పత్రికి దగ్గరలోనే ఉన్న ఓ ప్రైవేట్ ​మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్వాహకులతో చర్చలు జరిపారు. ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే రోగులకు అక్కడ వైద్యం అందించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. సుమారు రూ.30 లక్షలకు పైగా వెచ్చించి దవాఖానాలో అన్ని సౌకర్యాలు కల్పించారు. సరిపడా సిబ్బంది లేకపోవడంతో తాత్కాలికంగా కొందరిని, ఔట్​సోర్సింగ్​ ద్వారా మరికొందరిని నియమించారు.

మాట మార్చిన యాజమాన్యం

ఇంతవరకు బాగానే ఉన్నా.. ఇటీవల కొవిడ్​ వైద్యానికి ప్రభుత్వం ప్రైవేట్​ ఆస్పత్రులకు అనుమతులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఓ రాజకీయ నేతతో పైరవీ చేయించుకుని, సర్కార్​ సొమ్ముతో షోకులు అద్దించుకున్న ఆ ఆస్పత్రి కొవిడ్​ వైద్యానికి అనుమతి తెచ్చుకుంది. అప్పటి నుంచి ఆ ఆస్పత్రి నిర్వాహకులు ప్లేట్​ ఫిరాయించారు. కరోనా వైద్యానికి భారీగా డబ్బులు గుంజడం అటుంచితే, పేదలకు ఉచితంగా సేవ చేస్తామన్న మొదట ఇచ్చిన హామీని తుంగలో తొక్కి మామూలు ట్రీట్​మెంట్​కు కూడా అధిక ఫీజులు వసూలు చేస్తున్నది. ప్రైవేట్​ ఆస్పత్రిని అభివృద్ధి చేసేటప్పుడు ఎలాంటి నిబంధనలు విధించుకున్నారు.? ఇప్పుడదే ఆస్పత్రికి కరోనా చికిత్సకు అనుమతి ఎలా ఇచ్చారు..? అనేది జిల్లాలో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై జిల్లా ఆస్పత్రి వర్గాలు మాత్రం నోరు మెదపడం లేదు. పైగా, సదరు ఆస్పత్రి మరమ్మతు కోసం, ఉచితంగా సేవ చేయడానికి రూ.30 లక్షల వరకు ఖర్చు చేసిన మాట వాస్తవమేనని చెప్పడం కొసమెరుపు.

Next Story