అవయవ దానంతో ఆయువు పోద్దాం

by  |
అవయవ దానంతో ఆయువు పోద్దాం
X

దిశ, గచ్చిబౌలి: చనిపోయాక కూడా ఇతరుల జీవితాల్లో వెలుగు నింపి మరోసారి జీవించే అవకాశం అవయవదానం కల్పిస్తోంది. అవయవ దానాన్ని మించిన దానం లేదు. ప్రజల్లో అవగాహన కొరవడడంతో దాతలు ముందుకు రావడం లేదు. దీంతో అత్యవసర సమయంలో దాతలు లేక ఎంతో మంది మృత్యువాత పడుతున్నారు. ఒక వ్యక్తి అవయవ దానంతో నలుగురికి కొత్త జీవితాన్ని ప్రసాదించవచ్చు. రోడ్డు ప్రమాదంలో గాయపడి, బ్రెయిన్​డెడ్ ​అయినవారు సైతం అవయవదానం చేయవచ్చు. దేశంలో కిడ్నీ వ్యాధితో బాధపడుతూ దాతలు కోసం సుమారు రెండు లక్షల మంది ఎదురుచూస్తున్నారు. వారిలో కేవలం 3 నుంచి 4 వేల మందికి మాత్రమే దాతలు దొరకడం గమనార్హం. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు అవయవదానంపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

అన్న దానాన్ని మించిన మహాదానం అవయవదానం.. ఆధునిక వైద్యం మనకు ఇచ్చిన ఓ వరం. మనిషి తనలోని అవయవాలను డొనేట్​ చేసి ప్రాణాపాయంలో కొట్టుమిట్టాడుతున్న వారికి నూతన జీవితాన్ని ప్రసాదించడమే అవయవ దానం. మనిషి తాను చనిపోతూ నలుగురికి తనలోని కిడ్నీ, ఊపిరితిత్తులు, గుండె, కళ్లు ఇతరులకు దానం చేయవచ్చు. అవయవదానంపై ఇంకా పూర్తిగా ప్రజల్లో అవగాహన రాలేదు. చాలా కొద్ది మంది మాత్రమే చనిపోయాక తమ అవయవాలను దానం చేస్తున్నారు. కిడ్నీ, గుండె, ఊపిరితిత్తుల వ్యాధులతో మృత్యువుతో పోరాడుతున్న వారు అవయవ దానం చేసే వారి కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి సరైన సమయంలో రక్తం లభించక, దాతలు ముందుకురాక మృతిచెందిన ఘటనలూ ఉన్నాయి. మన దేశంలో కిడ్నీ వ్యాధితో బాధపడుతూ దాతలు కోసం సుమారు రెండు లక్షల మంది ఎదురుచూస్తున్నారు. వారిలో కేవలం 3 నుంచి 4 వేల మందికి మాత్రమే కిడ్నీ దాతలు దొరకడం గమనార్హం. దాదాపు 80% మంది దాతలు లేక మరణిస్తున్నారు. కాలేయ వ్యాధి బారిన పడి సుమారు 25 వేల మంది కాలేయ మార్పిడి చికిత్స చేయించుకోవాల్సి దాదాపు 800 మందికి మాత్రమే దొరుకుతుందని నిపుణులు చెబుతున్నారు. 50 ఏళ్ల వరకు గుండె, ఊపిరితిత్తులు, 70 ఏళ్ల వరకు కిడ్నీలు, కాలేయం, వందేళ్ల వయసు వరకు కార్నియా చర్మం దానం చేయవచ్చని క్యాన్సర్​ రోగులు కూడా దానం చేయవచ్చని వైద్యులు తెలిపారు.

ఏ అవయవాలు దానం చేయవచ్చు..

రక్తం, ఎముక మజ్జ, కిడ్నీ, కాలేయంలో కొంత భాగం దానం చేయవచ్చు. అయితే రక్తం దాత గ్రూపు వ్యక్తులకు సరిపోతుంది. మిగతావన్నీ అందరికీ సరిపోవు. దానం చేస్తున్న వారికి రోజు వైద్య పరీక్షలు నిర్వహించాలి. అవయవాలు సరిపోతాయా లేదా అని వైద్యులు నిర్ణయిస్తారు. ఎముక మజ్జ, కాలేయం, ఊపిరితిత్తులు రక్త సంబంధీకులకు ఎక్కువగా పనికొస్తాయి.

మరణించిన వ్యక్తుల అవయవాలు..

కళ్లు, గుండె వాల్వులు, చర్మం, ఎముకలు, కార్జీ లాజ్, నరాలు.

బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తుల అవయవాలు..

కిడ్నీలు, కాలేయం, ఊపిరితిత్తులు, పాంక్రియాస్, చిన్న పేగు, స్వరపేటిక, చేతులు, యుటిరస్, అండాలు, కళ్ళు, చర్మం, ఎముకలు, కార్జ్ లాజ్, నరాలు, కాలి వేళ్లు, చేతి వేళ్లు, మధ్య చెవిలోని ఎముకలు.

ట్రాన్స్ ప్లాంటేషన్ కు పట్టే సమయం

ఊపిరితిత్తులు, గుండెకు సుమారు ఆరు గంటలు, కాలేయ మార్పిడి సుమారు 12 గంటలు, ప్రాంక్ క్రియాస్ కు 24 గంటలు, కిడ్నీలకు సుమారు 45 గంటలు.

స్వచ్ఛంద సంస్థలు ప్రచారం చేపట్టాలి

కిడ్నీ, రక్తం, గుండె వ్యాధుల బారిన పడిన రోగులకు అత్యవసర సమయంలో దాతలు దొరకక చాలా మంది చనిపోతున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి రక్తం కూడా సమయానికి లభించక మరణిస్తున్నారు. అవయవ దానం చేయడంతో చనిపోయి కూడా ఇతరుల జీవితాల్లో వెలుగు నింపవచ్చు. మన దేశంలో అవయవదానంపై కొంత మందికి మాత్రమే అవగాహన ఉంది. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు అవయవ దానం పై మరింత ప్రచారం చేసి ప్రజలను చైతన్యం చేయాలి.

–డాక్టర్ పల్లవి వసల్, ఎంబీబీఎస్ డీజీఓ (ఎంఆర్ సీఓజీ)

Next Story

Most Viewed