తనఖాలో ప్లాట్..? 3 రోజులే గడువు..!

by  |
తనఖాలో ప్లాట్..? 3 రోజులే గడువు..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: బ్యాంకులలో తనఖాపెట్టిన ప్లాట్లకు ఎల్ఆర్ఎస్‌లో దరఖాస్తు ఎవరు చేయాలి..? ప్లాట్ల యజమానులా లేక బ్యాంకులా..? అనే సంశయం ఇటు యజమానుల్లో, అటు బ్యాంకు అధికారుల్లోనూ నెలకొన్నది. కొందరు డిఫాల్టర్లుగా కూడా ఉన్నారు. యజమాని పేరున చేస్తే ఫీజు ఎవరు చెల్లించాలి..? వంటి ప్రశ్నలు యజమానుల్లో వ్యక్తమవుతున్నాయి. డిఫాల్టర్ల పేరు మీదనే డాక్యుమెంట్ ఉంటుంది. అతడి పేరు మీదే ఎల్ఆర్ఎస్ చేస్తే ఏదేని లీగల్ సమస్య వస్తుందా..? అని చర్చించుకుంటున్నారు.

ఎల్ఆర్ఎస్‌కు దరఖాస్తు చేసుకునేందుకు మరో మూడ్రోజుల గడువు మాత్రమే మిగిలి ఉన్నది. ఈ నెల 15తో గడువు ముగియనున్నది. ఈ నేపథ్యంలో బ్యాంకులో తనఖా పెట్టిన ఆ ప్లాట్ల యజమానులు ఆధార్ కార్డు ఇవ్వని పక్షంలో పరిస్థితి ఏమిటి..? డిఫాల్టర్లు అందుబాటులో లేకుంటే దరఖాస్తు చేయడమెలా..? వంటి ప్రశ్నలు చిక్కుముడిగా మారాయని బ్యాంక్ అధికారులు అంటున్నారు. బ్యాంక్‌ల వద్ద తనఖా పెట్టిన ప్లాట్లు వందల సంఖ్యలో ఉన్నాయి. వాటికి సాంకేతికపరమైన సమస్యలు ఎదురవుతున్నట్లు వారు వెల్లడిస్తున్నారు.

పలు సందేహాలు..

ఎల్ఆర్ఎస్ లేకుంటే ప్లాట్ల క్రయవిక్రయాలు కావని సర్కారు చెప్పిన దరిమిలా ఇప్పుడు బ్యాంకర్లను తమ వద్ద తనఖాగా ఉన్న ప్లాట్లకు ఎల్ఆర్ఎస్‌ దరఖాస్తు చేయాలని రుణం తీసుకున్నవారు కోరుతున్నారు. ఒకవేళ బ్యాంకర్లు, రుణం తీసుకున్నవారు ఇద్దరూ ఎల్ఆర్ఎస్ చేయకపోతే ప్లాట్లు నిరుపయోగంగా మారనున్నాయా? అనే చర్చ సాగుతున్నది.

కొందరు రియల్టర్లు లేఅవుట్లు అప్రూవ్డ్ అని ప్రచారం చేసుకుని లేఅవుట్ ఎల్‌పి నెంబర్ వేసి ప్లాట్ల రిజిస్ట్రేషన్ చేశారు. కానీ, అప్రూవ్‌డ్ లేఅవుట్‌ డాక్యుమెంట్ ఎవరికీ ఇవ్వలేదు. తీరా అనుమానాలు వచ్చి ప్లాట్ల యజమానులు హెచ్ఎండీఏకు, డీటీసీపీలకు వెళ్లి అడిగితే ఆ లేఅవుట్ వివరాలు తమ వద్ద లేవని చెబుతున్నారు. వాస్తవానికి లేఅవుట్‌కు అనుమతి పొందినదా? లేదా? అనేది ఆఫీసర్లు చెప్పాలి. కానీ, వివరాలు చెప్పడం లేదు. దీంతో తుదిగడువు సమీపిస్తున్నదని, ఏదో ఒక విషయం తేల్చి చెప్పాలని శంషాబాద్ మండల ప్లాట్ల యజమానులు పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఆఫీసర్ల బాధ్యతారాహిత్యం..

గ్రామాల్లో, పట్టణాల్లో లేఅవుట్లు వెలుస్తున్న సందర్భంలో వాటికి అనుమతులు ఉన్నాయా? లేదా? అనేది ఆఫీసర్లు రికార్డు చేయాలి. కానీ, ఆ రికార్డులు లేవు. ఇది వారి బాధ్యతా రాహిత్యాన్ని తెలియజేస్తుంది. నియమాల ప్రకారం లేఅవుట్‌లోని ఓపెన్ స్పేస్‌ను పట్టణ స్థానిక సంస్థలు సేకరించాలి. లేఅవుట్లు చేసే వారు స్థానిక సంస్థలకు రిజిస్ట్రేషన్ చేయాలి. అలా చేయని పక్షంలో ఆఫీసర్లు వాటిపై చర్యలు తీసుకోవాలి. కానీ, ఆ ప్రక్రియ జరగడం లేదు. స్థానిక సంస్థల వల్ల ఎల్ఆర్ఎస్ మంజూరయ్యే మాటెటు ఉన్నా.. ప్రస్తుతం మేము దరఖాస్తు చేసుకునేందుకు కూడా ఇబ్బందులకు గురికావాల్సి వస్తుందని పలువురు దరఖాస్తుదారులు అంటున్నారు.

అప్రూవ్డ్ ప్లాట్లని తెలుసుకుని మరీ ఖరీదు చేసినప్పటికీ అనుమతి లేదనే సమాచారం మాలో అనుమానాలను రేకెత్తిస్తోందనీ షాద్‌నగర్ వాసులు చెబుతున్నారు. పట్టణ స్థానిక సంస్థలు, గ్రామపంచాయతీలు లేఅవుట్లలోని ఓపెన్ స్పేస్ వివరాలు సేకరించకపోవడం వారి నిర్లక్ష్యాన్ని వెల్లడిస్తుందంటున్నారు. గ్రామపంచాయితీల పట్టింపులేని ధోరణి వల్ల ఇప్పుడు అప్రూవ్డ్ లేఅవుటా కాదా..? అనే సమాచారం తెలుసుకోలేక దరఖాస్తుదారులు ఇబ్బందులు పడుతున్నారు.

Next Story

Most Viewed