బడి లేదాయే.. ఆన్‌లైన్ క్లాసులు మొదలాయే

by  |
బడి లేదాయే.. ఆన్‌లైన్ క్లాసులు మొదలాయే
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో ఏడాదిన్నరగా పాఠశాలలు మూతపడి ఉన్నాయి. విద్యార్థులు పాఠశాలకు వెళ్లకుండా ఇంటికే పరిమితమయ్యారు. కరోనా సెకండ్ వేవ్ కాస్త తగ్గడంతో జూలై 1నుంచి ఆన్‌లైన్ క్లాసులు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఈరోజు నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ స్కూళ్లు, జూనియర్ కాలేజీల విద్యార్థులకు గత ఏడాది లాగానే ఆన్‌లైన్‌లో క్లాసులు ప్రారంభం కానున్నాయి. కరోనా తగ్గే వరకు అన్ని తరగతుల విద్యార్థులకు ఆన్‌లైన్‌లో విద్యాబోధన జరగనుంది. ఇందుకు తగ్గ ఏర్పాట్లు చేసింది విద్యాశాఖ. టీ-శాట్, దూరదర్శన్ ద్వారా విద్యార్ధులు ఆన్‌లైన్ తరగతులను వీక్షించవచ్చునని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ప్రతి రోజూ విద్యార్థులకు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రత్యేక తరగతులు ఉంటాయన్నారు. ఇప్పటికే 50శాతం మంది ఉపాధ్యాయులు ప్రతిరోజు స్కూళ్లకు హాజరవుతున్నారు.

అలాగే ప్రభుత్వం ఇచ్చిన సూచనల మేరకు విద్యా సంస్థల్లో బోధనా సిబ్బంది హాజరు 50 శాతానికి పరిమితం కాగా, బోధనేతర సిబ్బంది ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో డ్యూటీ కోసం రిపోర్ట్ చేయాలని కాలేజియేట్ ఎడ్యుకేషన్ కమిషనరేట్ తెలిపింది. అన్ని బోధన, బోధనేతర సిబ్బంది కళాశాలలో చేరేటప్పుడు బయో మెట్రిక్ హాజరును గుర్తించాలని ఆదేశించారు. అలాగే ఇంటి నుండి పనిచేసేటప్పుడు, బోధనా సిబ్బంది ఆన్‌లైన్ పాఠాలను రికార్డ్ చేసి కమిషనరేట్ ప్రిన్సిపాల్, అకాడమిక్ సెల్‌కు సమర్పించాలని కోరారు. అదేవిధంగా ఈ ఏడాది కూడా విద్యాసంస్థలు కేవలం ట్యూషన్ ఫీజును మాత్రమే వసూలు చేయాలని 30 శాతం ఫీజులు తగ్గించుకోవాలన్నారు. ఒకటి, రెండు తరగతి పిల్లలకు ఆగష్టు 1 నుంచి క్లాసులు ప్రారంభం అవుతాయని వెల్లడించారు.



Next Story