దేశంలో మళ్లీ ఆకాశాన్నంటనున్న ఉల్లి ధరలు.. ఎప్పటినుంచంటే ?

by  |
onians
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ ఏడాది పండుగ సీజన్ సమయంలో ఉల్లి ధరలు కన్నీళ్లు పెట్టించనున్నాయని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. రానున్న కొద్దిరోజుల్లో ఉల్లి కిలో రెట్టింపునకు చేరుకుంటుందని ప్రముఖ పరిశోధనా సంస్థ క్రిసిల్ అభిప్రాయపడింది. ఇటీవల దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురవడంతో పాటు ఇప్పుడున్న స్టాక్ తరిగిపోనున్న క్రమంలో ఉల్లి కొరత ఏర్పడనుంది. దీంతో భారత్‌లో మరోసారి ఉల్లి ధరలు ఆకాశానంటనున్నాయని క్రిసిల్ వెల్లడించింది. గత రెండు సంవత్సరాలు ఉన్న ధోరణిని గమనిస్తే ఆగష్టు-సెప్టెంబర్ మధ్య అకాల వర్షాలతో ఉల్లి పంట దెబ్బతిందని, దీంతో 2018 నాటితో పోలిస్తే ధరలు రెట్టింపు అయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఉల్లి ధరలు వంద శాతం కంటే ఎక్కువగానే పెరుగుతాయని క్రిసిల్ అంచనా వేసింది.

దేశవ్యాప్తంగా ప్రతి నెలా దాదాపు 13 లక్షల టన్నుల ఉల్లి వినియోగంలో ఉంది. ఇందులో సగానికి పైగా ఉల్లి పంత మహారాష్ట్ర నుంచే రవాణా అవుతోంది. దేశంలోని అన్ని ప్రాంతాలకు ఈ ప్రాంతం నుంచే ఉల్లి సరఫరా జరుగుతుంది. మహారాష్ట్ర తర్వాత కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ల నుంచి ఉల్లి సరఫరా అధికంగా ఉంటుంది. ఈ మధ్య తౌక్టే తుఫాను ధాటికి మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో ఉల్లి సాగు ఆలస్యమైంది. సాధారణంగా 75 శాతం ఖరిఫ్ సీజన్‌లోనే ఉల్లి పండిస్తారు. ఈసారి ఇది ఆలస్యమయ్యే అవకాశం ఉందని క్రిసిల్ తెలిపింది. ఒకవేళ పంట చేతికి వచ్చినప్పటికీ ప్రాసెసింగ్, సరఫరా వల్ల మార్కెట్లకు రావడానికి మరింత ఆలస్యమవుతుంది. ఈ కారణాల వల్లే ఉల్లి ధరలు పెరగనున్నాయని క్రిసిల్ వెల్లడించింది.

Next Story

Most Viewed