నందిపేటలో పటిష్ట బందోబస్తు

by  |
నందిపేటలో పటిష్ట బందోబస్తు
X

దిశ, నిజామాబాద్: నందిపేట మండలంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. శుక్రవారం కరోనా బారిన పడిన వ్యక్తుల్లో మండలానికి చెందిన ఓ వ్యక్తి కూడా ఉండటంతో ఈ మేరకు తక్షణ చర్యలు చేపట్టారు. అధికార యంత్రాంగం అప్రమత్తమై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేసింది. నందిపేట మండల కేంద్రంలోని భార్య భర్తలు ఇద్దరూ ఢిల్లీలో జరిగిన మర్కజ్ ప్రార్థనలకు వెళ్లి వచ్చారు. వీరిని నందిపేట మండలం ఆరోగ్య, పోలీసు, రెవెన్యూ సిబ్బంది 4 రోజుల కిందట హైదరాబాద్‌లోని కింగ్ కోఠి హాస్పిటల్‌కు తరలించారు. పరీక్షల అనంతరం భార్యకు కరోనా పాజిటివ్ అని తేలింది. వెంటనే రంగంలోకి దిగిన మండల అధికార యంత్రాంగం ఈ రోజు ఉదయం కుటుంబ సభ్యులను జిల్లా కేంద్రంలోని క్వారంటైన్ కేంద్రానికి తరలించింది. శుక్రవారం ప్రకటించిన పాజిటివ్ రిపోర్ట్ లిస్టులోని 16 మంది జిల్లాకు చెందిన వారు ఉన్నారు. ఇందులో నందిపేట మండలంలోని వివాహితకు కరోనా పాజిటివ్ రావడంతో తెల్లవారుజామున అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది.ఎస్‌ఐ రాఘవేందర్ మండలం మొత్తం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎవరూ ఇండ్ల నుంచి బయటకు రాకుండా పోలీసులు గస్తీ తిరుగుతున్నారు.
నందిపేట మెడికల్ ఆఫీసర్ డాక్టర్ విజయ భాస్కర్ రావు సిబ్బందితో కలసి వెళ్లి పాజిటివ్ వచ్చిన కుటుంబానికి పక్కన ఉన్న ఇండ్ల వాళ్లందరినీ జాగ్రత్తగా ఉండాలని కోరారు. అందరూ సామాజిక దూరం పాటించాలని సూచించారు. నందిపేట కుటుంబానికి సన్నిహితంగా ఉన్న ఆరుగురిని ప్రైమరీ కాంటాక్ట్‌గా గుర్తించి క్యారెంటైన్‌‌కు పంపనున్నట్టు పేర్కొన్నారు.

Tags: corona, lockdown, nandipet one more positive, nizamabad



Next Story