రాష్ట్ర సరిహద్దులో గొడవ.. వారించబోతే ప్రాణం పోయింది..

by  |
Riot at a wine shop
X

దిశ, కోదాడ: సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. మండలంలోని రామాపురం క్రాస్‌రోడ్డులో ఉన్న హనుమాన్‌ ‌వైన్స్‌‌ వద్ద జరిగిన ఘర్షణలో ఒకరు మృతిచెందారు. వివరాల్లోకి వెళితే.. నల్లబండగూడెంలోని హనుమాన్ వైన్స్ రాష్ట్ర సరిహద్దు ప్రాంతం కావడంతో రోజూ వందలాది మద్యం ప్రియులు ఇక్కడికి వస్తుంటారు. ఆదివారం సాయంత్రం కృష్ణాజిల్లాలోని షేర్ మహమ్మద్ పేట్‌కు చెందిన కొందరు వ్యక్తులు మద్యం కోసి ఈ వైన్ షాప్‌కు వచ్చారు. వారితో పాటు వచ్చిన నాగయ్య(45) అనే వ్యక్తికి మద్యం సేవించే అలవాటు లేకపోవడంతో కారులోనే ఉండిపోయాడు. ఆ సమయంలో వర్షం పడుతోంది. దీంతో నాగయ్యతో వచ్చిన మిత్రులు పక్కనే ఉన్న తోపుడుబండి వద్దకు వెళ్లారు. అదే సమయంలో తోపుడు బండికి విద్యుత్ షాక్ వస్తుండటంతో వారు వైన్స్ షాపు సిబ్బందికి తెలియజేశారు.

ఈ విషయంలో వారికి వైన్స్ షాపు సిబ్బందికి మధ్య ఘర్షణ జరిగింది. గమనించిన నాగయ్య ఇరువురికి సర్దిచెబుతుండగా వైన్స్ షాపు సిబ్బంది కర్రలతో దాడికి దిగారు. ఈ దాడిలో నాగయ్య బలమైన గాయాలుకావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. దీంతో భయాందోళన చెందిన నిందితులు అక్కడినుంచి పరారయ్యారు. విషయం తెలిసిన మృతుడి బంధువులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని ఆందోళనకు దిగారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, మద్యం దుకాణాన్ని సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. డీఎస్పీ రఘు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేస్తామన్నారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. మృతునికి భార్య నాగమణి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నట్లు సమాచారం.



Next Story

Most Viewed