జూన్ 1న రాష్ర్టవ్యాప్త రేషన్ షాపులు బంద్

by  |

దిశ, మహబూబ్‌నగర్: రేషన్ డీలర్లపై ప్రభుత్వ నిర్లక్ష వైఖరికి నిరసనగా జూన్ 1న తేదీన రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపులు బంద్‌కు రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు రమేష్ బాబు తెలిపారు. రేషన్ డీలర్ల వ్యవస్థలో రోజురోజుకూ ఆర్థిక స్థితిగతులు దిగజారి డీలర్లు తీవ్ర ఇబ్బందుల పడుతున్న దృష్ట్యా అందరం ఐక్యతను ప్రదర్శించి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాల్సిన సమయం ఆసన్నమైనదన్నారు. కరోనా బారిన పడి రేషన్ డీలర్ మరణించడం, వారి కుటుంబం రోడ్డున పడడం చాలా బాధాకరమని అన్నారు. ప్రభుత్వం ముందస్తుగా రేషన్ డీలర్లకు కనీస రక్షణ చర్యలు కూడా కల్పించకుండా, ఆదేశాలు జారీ చేసి బలవంతంగా పనిచేయించుకోవడం దారుణం అన్నారు. ఏ రకమైనటువంటి కమిషన్ చెల్లించకుండా వెట్టిచాకిరీ చేయించుకోవడం, చేసిన కష్టానికి కమిషన్లు చెల్లించాలని కాళ్లు అరిగేలా తిరిగినా పట్టించుకోక పోవడం ప్రభుత్వ నియంతృత్వానికి నిదర్శనమని మండిపడ్డారు. ఈ పరిస్థితుల్లో రేషన్ డీలర్ల సమస్యలు పూర్తిస్థాయిలో బయటకు తెచ్చే విధంగా ఓ కార్యాచరణతో రాష్ట్ర కమిటీ ముందుకు వస్తుందన్నారు. ఈ కార్యాచరణ విజయవంతం చేయడంలో ప్రతి రేషన్ డీలర్ సంపూర్ణమైన సహాకారం అందించాల్సిన బాధ్యత ఉందని గుర్తించాలని కోరారు. అలాగే జూన్ 2వ తేదీ నుంచి సరుకులు పంపిణీ చేసే సమయంలో డీలర్లు, సహాయకులు తప్పనిసరిగా నల్లబ్యాడ్జీలు ధరించి పని చేయాలని నిర్ణయించడం జరిగిందన్నారు.

Next Story

Most Viewed