రోజుకు ఆరు వేల ఆలోచనలట!

by  |
రోజుకు ఆరు వేల ఆలోచనలట!
X

మనిషి ఆలోచనలకు అంతే ఉండదనే మాటను తరచూ వింటుంటాం. అయితే ఒక్కరోజులో ఎన్ని ఆ ఆలోచనలు వస్తాయనే సంగతిని క్వీన్స్ యూనివర్సిటీ పరిశోధకులు కనిపెట్టారు. ఒక సగటు మానవుడు ఒక రోజులో కనీసం 6000 ఆలోచనలు చేస్తాడని వీరి పరిశోధనలో తేలింది. ఆలోచన ఎప్పుడు మొదలై, ఎప్పుడు అంతమవుతుందనే సంగతిని డాక్టర్ జోర్డాన్ పొప్పెంక్ బృందం పరిశోధిస్తోంది. అయితే వారి పరిశోధనలో భాగంగా మెదడులో థాట్ వార్మ్ అనే కొత్త పాయింట్లను కనిపెట్టారు. ఒక ఆలోచన మొదలైనపుడు థాట్ వార్మ్ పుడుతుంది. కొద్దిగా పురోగతి సంపాదించిన తర్వాత వేరే ఆలోచన మొదలవగానే ఈ థాట్ వార్మ్‌తో పాటు మరో థాట్ వార్మ్ పుడుతుంది. ఇలా ఒకరోజులో పుట్టిన థాట్ వార్మ్‌ల సంఖ్య 6000లకు పైగా ఉందని లెక్కించి, తద్వారా ఒక మనిషి ఆలోచనల సంఖ్యను లెక్కించగలిగినట్లు జోర్డాన్ వివరించారు.

ఈ పరిశోధనలో భాగంగా వాలంటీర్ల మెదళ్లను సీటీ స్కాన్ ద్వారా దగ్గరుండి పరిశోధించి, వారి ఆలోచనలను మౌఖికంగా అడిగి తెలుసుకుని, వారు చెప్పిన మాటలను థాట్ వార్మ్ సంఖ్యతో సరిపోల్చారు. అంతేకాకుండా వీటిని పగటి పూట ఆలోచనలు, రాత్రి పూట ఆలోచనలుగా కూడా విభజించారు. ఆలోచనను బట్టి థాట్ వార్మ్ పరిమాణం కూడా మారిపోతోందని వారి పరిశోధనలో తేలింది. అయితే రాత్రి పూట నిద్రిస్తున్న సమయంలో వచ్చే కలల కారణంగానూ థాట్ వార్మ్‌లు పుడుతున్నాయని, వాటిని లెక్కించడంలో కొద్దిగా ఇబ్బంది ఎదురైన కారణంగా కనీసం 6000 ఆలోచనలు అని దాదాపుగా చెప్పవలసి వస్తోందని జోర్డాన్ వివరించారు. మెదడు ఒక సంక్లిష్టమైన సున్నితమైన నిర్మాణం కాబట్టి, పరిశోధనలో పురోగతికి మరికొంత సమయం పడుతుందని జోర్డాన్ తెలిపారు.

Next Story