TSIIC జోనల్ మేనేజర్‌కు చేదు అనుభవం.. మా భూముల్లో అడుగుపెట్టొందంటూ..!

by  |
TSIIC జోనల్ మేనేజర్‌కు చేదు అనుభవం.. మా భూముల్లో అడుగుపెట్టొందంటూ..!
X

దిశ, చిగురుమామిడి : కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఓగులాపూర్ గ్రామంలో గురువారం టీఎస్ఐఐసీ పనులను పరిశీలించేందుకు వచ్చిన జోనల్ మేనేజర్ అజ్మీర్ స్వామి, ప్రాజెక్టు ఇంజినీర్ సృజన్ కుమార్, మేనేజర్ బహుగుణను అక్కడి రైతులు తమ భూముల వద్దకు వెళ్లకుండా అడ్డుకున్నారు. జోనల్ మేనేజర్‌ను వాహనాన్ని అడ్డుకుని అక్కడే బైఠాయించారు. సమాచారం అందుకున్న కరీంనగర్ ఆర్డీవో ఆనంద్ కుమార్, చిగురుమామిడి తహసీల్దార్ సయ్యద్ ముబిన్ అహ్మద్‌లు అక్కడికి చేరుకుని రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా రైతులు అధికారులతో మాట్లాడుతూ.. 79 జీవో ప్రకారం తమ భూములు తమకే కావాలని, ఈ భూముల్లో ఎలాంటి పనులు చేపట్టవద్దని తెగేసి చెప్పారు.

ఆర్డీఓ ఆనంద్ కుమార్‌తో పాటు జోనల్ మేనేజర్‌తో గంటసేపు రైతులు వాగ్వాదానికి దిగారు. ఈ భూములకు సంబంధించి కేసు కోర్టులో ఉన్నందున, ఇక్కడ ఎలాంటి పనులు ప్రారంభించవద్దన్నారు. తమ భూములను లాక్కొని భయబ్రాంతులకు గురి చేయడం సరైంది కాదని అధికారులను రైతులు వేడుకున్నారు. హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీష్ కుమార్ ఈ భూములపై కోర్టులో కేసులు లేవనటం సరికాదని, కోర్టులో కేసులు ఉంటే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా? అని రైతులు ప్రశ్నించారు. బాధిత రైతుల పక్షాన ఉండాల్సిన ఎమ్మెల్యే సతీష్, తెలంగాణ ప్రభుత్వం మెప్పుకోసం రైతులను చిన్నచూపు చూడటం సరైంది కాదన్నారు. కాగా, టీఎస్ఐఐసీ అధికారులను రైతులు అడ్డుకోవడంతో వారు వెనుదిరిగారు.

అనంతరం కరీంనగర్ ఆర్డీవో ఆనంద్ మాట్లాడుతూ.. ఓగులాపూర్ గ్రామంలో 442 ఎకరాల భూమిని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కోసం టీఎస్ఐఐసీ వారికి ప్రభుత్వం అప్పగించిందని, ఆ పనులను రైతులు అడ్డుకోవడం సరైంది కాదన్నారు. అధికారులు ఏది చేసినా చట్టపరిధిలోనే చేస్తారని, కోర్టులో కేసులు ఉన్న మాట వాస్తవమేనని, కోర్టు కేసులో ఉన్న భూముల వద్దకు వెళ్లొద్దని కోర్టు ఆదేశాలున్నాయని, వాటికి కౌంటర్ దాఖలు చేశామన్నారు. పదిరోజుల్లో అవి పూర్తవుతాయని తెలిపారు. కోర్టు ఆదేశాల మేరకు త్వరలోనే రైతులు, గ్రామస్తుల సహకారంతో పనులు ప్రారంభిస్తామన్నారు. రైతులకు, ప్రజలకు ఏమైనా సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకు వచ్చి పరిష్కరించుకోవాలే తప్పా పనులను, అధికారులను అడ్డుకోవటం చేయవద్దన్నారు.

Next Story