జగన్‌ను కలుసుకోవడం కలేనా..? చంద్రబాబు వద్దకు ప్రజలు క్యూ

by  |
జగన్‌ను కలుసుకోవడం కలేనా..? చంద్రబాబు వద్దకు ప్రజలు క్యూ
X

దిశ, ఏపీ బ్యూరో: ఎన్నికల ప్రచారంలో నేతల హామీలకు అవధులు ఉండవు. నేను ముఖ్యమంత్రి అయితే మీ దగ్గరకే వస్తా.. మీరొచ్చినా కలుస్తానంటూ ఎక్కడా లేని హామీలు ఇస్తారు. ఎన్నికలు అయిపోతాయి. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలు అడుగు దాటడం లేదు. తమ కష్టాలను చెప్పుకునేందుకు వచ్చిన ప్రజలను పట్టించుకునే నాధుడే కరువవుతున్నాడు. ముఖ్యమంత్రి లోపలే ఉన్నా కనీసం లోపలికి కబురే వెళ్లని వైనం. దీంతో తమ సమస్యలను ఏకరువు పెట్టేందుకు వచ్చిన ప్రజలు కొన్ని రోజులపాటు రోడ్లపై పడిగాపులు కాచి చివరకు వెనుదిరిగి వెళ్లిపోతున్నారు.

తాము ఓట్లేసిన ముఖ్యమంత్రి తమకు న్యాయం చేస్తారని వచ్చిన వారు తమ ఆశలను చంపుకుని వెళ్లిపోతున్నారు. ఎన్నికల్లో ఓటర్లే దేవుళ్లు అన్న సీఎం ఇప్పుడు ఓటర్లను మరచిపోయి నేతలను మాత్రమే కలుస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదీ తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం, వైసీపీ కార్యాలయం దగ్గర సామాన్యుడు ఎదుర్కొంటున్న దయనీయ పరిస్థితి.

రాష్ట్రంలోని 13 జిల్లాలకు చెందిన ప్రజలు రోజుకు 5 నుంచి పదిమంది తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయానికి వస్తారు. అపాయింట్మెంట్ లేకపోవడంతో నిర్ధాక్షిణ్యంగా అక్కడ అనుమతించడం లేదు. దీంతో పార్టీ కార్యాలయంలోనైనా తమ గోడు వెళ్లబోసుకుందామని వెళ్తున్నారట. వీరంతా జిల్లా స్థాయిలో అధికారులు వల్ల కాలేని పనులను చేయించుకుందామనో.. లేక అధికారులు చేయకుండా ఇబ్బంది పెడుతున్నారనో.. లేక మరే ఇతర కారణాలతోనే తమ గోడు వెళ్లబోసుకునేందుకు వస్తుంటారు.

కానీ వీళ్లని పట్టించుకునే నాధుడే అక్కడ కరువయ్యాడు. వారు ముఖ్యమంత్రితో తమ గోడు చెప్పుకునే అవకాశం కల్పించకపోగా క్యాంపు కార్యాలయం దగ్గరకు ఎందుకు వచ్చారంటూ నానా చీవాట్లు పెడుతున్నారట. అంతేకాదు పోలీసులు అయితే బైక్‌లను సైతం స్వాధీనం చేసుకుంటున్నారట. ఇలా ముఖ్యమంత్రిని కలిసేందుకు వచ్చి నానా పాట్లు పడుతున్నామని సామాన్యులు వాపోతున్నారు.

ఒక వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు తన గోడు వెళ్లబోసుకునేందుకు పార్టీ కార్యాలయానికి 24 సార్లు వచ్చాడట. 18 సార్లు లేఖలు సైతం అందజేశారట. ఇప్పటి వరకు సీఎం దగ్గర నుంచి తమకు ఎలాంటి సమాచారం అందలేదని వారు మాజీ సీఎం చంద్రబాబు వద్ద వాపోయారు. చంద్రబాబు తన నివాసంలో మంగళవారం సాధన దీక్ష చేపట్టారు. ఆ దీక్ష ముగింపు సందర్భంగా ఆ ప్రజలు అక్కడకు చేరుకుని ఏకరువు పెట్టుకున్నారు.

తమ కళ్లెదుటే అనేక మంది నేతలు నేరుగా వెళ్లి సీఎం జగన్‌తో భేటీ అవుతున్నారని కానీ ఓట్లేసి గెలిపించిన ప్రజలను పట్టించుకోవడం లేదని వాపోయారు. ప్రజాస్వామ్యంలో ప్రజల సమస్యలను పరిష్కరించాలని లేనప్పుడు ప్రభుత్వం ఉన్నా లేకపోయినా ఒక్కటేనని చంద్రబాబు వారిని ఊరడించారు. ముఖ్యమంత్రిని కలిసి తమ గోడు వెళ్లబోసుకునేందుకు వచ్చిన వారిని కలవనీయకపోవడంతో పలువురు ఆత్మహత్యలకు సైతం పాల్పడినట్లు తెలుస్తోంది. ఇటీవలే ఓ దంపతుల జంట అక్కడ ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశారు. అంతకు ముందు కూడా ఇలాంటి ఘటనలు జరిగినా అధికార యంత్రాంగం స్పందించడం లేదనే విమర్శలు ఉన్నాయి. అంతేకాదు సమస్యలు చెప్పుకునేందుకు ఏర్పాటు చేసిన టోల్‌ఫ్రీ నంబర్లు సైతం కనీసం స్పందించడం లేదని విమర్శలు ఇప్పటికీ ఉన్నాయి.

ఇకనైనా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రజల సమస్యలపై తెలుసుకునేందుకు ప్రయత్నం చేయాలి. స్పందన కార్యక్రమం మాదిరిగా సీఎం జగన్ గతంలో మాదిరిగా రచ్చబండ వంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు. నెలలో మూడు జిల్లాల్లో సీఎం జగన్ నేరుగా ప్రజలను కలిసి వారి సమస్యలను వినేలా పథకం రచించాలని సామాన్యులు కోరుకుంటున్నారు. కొన్ని సమస్యలు జిల్లాలోనే పరిష్కారమైనప్పటికీ అధికారులు కొందరు చేయడం లేదని.. అలాంటి వాళ్లు చివరికి ముఖ్యమంత్రైనా న్యాయం చేస్తారని వస్తే అక్కడ కూడా పట్టించుకోకపోతే ఎవరిని కలవాలని, ఎవరితో చెప్పుకోవాలని గోడు వెల్లబోసుకుంటున్నారు. అందువల్ల రాబోయే రోజుల్లో బహిరంగ సభలు వంటివికాకుండా ప్రజలను నేరుగా కలిసే ఒక బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుడితే మంచిదని పలువురు కోరుతున్నారు.

Next Story