ప్రభుత్వ భూములు మాయం.. వారికి ఖాళీ స్థలం కనిపిస్తే పాపం

by  |
ప్రభుత్వ భూములు మాయం.. వారికి ఖాళీ స్థలం కనిపిస్తే పాపం
X

దిశ, భద్రాచలం అర్బన్: పట్టణం ఆక్రమణలకు అడ్డాగా మారింది. ప్రభుత్వ జాగా కనిపిస్తే పాగా వేస్తూ తమ ఆక్రమణల దాహం తీర్చుకుంటున్నారు కొంతమంది మహానుభావులు. ప్రభుత్వం ఏదైనా కార్యాలయం నిర్మించాలన్న, ప్రజా సంక్షేమ కార్యక్రమాల కోసం స్థలం ఏర్పాటు చేయాలన్నా, ప్రభుత్వానికి, ప్రజాప్రతినిధులకు సెంటు జాగా దొరకదు. పుణ్యాత్ములైన కబ్జా కోరులకు కొరకు మాత్రం ఎకరాలకు ఎకరాలు ప్రభుత్వ భూములు దర్శనమిస్తున్నాయి. గిరిజనుల హక్కుల కోసం, పరిరక్షణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్రాంత వాసులకు కొన్ని ప్రత్యేకమైన చట్టాలు తీసుకు వచ్చింది. కానీ చట్టాలు అక్రమార్కులకు చుట్టాలు‌గా మారి, వారి దన దాహాన్ని తీర్చుతున్నాయి. ఓ నిరుపేద వ్యక్తి ఇల్లు కట్టుకుందాం అంటే సెంటు ప్రభుత్వ భూమి ఎక్కడ ఉండదు. కానీ అక్రమార్కులకు మాత్రం బోలెడంత జాగా ఉంటుంది.

భద్రాచలం పట్టణంలోని అనేక చెరువులు, బావులు, ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురయ్యాయి. సంబంధిత గ్రామపంచాయతీ, రెవెన్యూ అధికారులు ఏమాత్రం పట్టించుకోకుండా చోద్యం చూడటం వారికే చెల్లింది. ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డబల్ బెడ్ రూమ్ ఇండ్లకు ఆనుకొని ఉన్న స్థలాన్ని భద్రాచలం పట్టణంలోని ఓ ప్రముఖ వ్యక్తి పెన్సింగ్ వేసుకోవడం జరిగింది. కరోనా పుణ్యమా అని కాలం కలిసొచ్చి తను ఆక్రమించిన ఎకరాల ప్రభుత్వ భూమి కి మరో ఎకరం భూమి వేసుకోవడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ( ఈ మహానుభావుడే ఏజెన్సీ చట్టాలకు వ్యతిరేకంగా వారి పేరుపై పట్టా చేసుకొని కొన్ని సంవత్సరాల క్రితం సంచలనం సృష్టించాడు.) అధికారుల, ప్రజాప్రతినిధుల అండదండలతో భూకబ్జా పర్వాలు కొనసాగించడం ఆయనకే చెల్లింది. ఖాళీ జాగా కనిపిస్తే అన్ని పండుగలు ఒకేసారి చేసుకోవడం ఆయనకే సొంతం. అధికారుల తోడ్పాటు లేకుండా, సహకారం లేకుండా ఇన్ని ఎకరాల భూములను కబ్జా చేయడం ఎలా సాధ్యమో ఎవరికీ తెలియడం లేదు. ఇప్పటికే అనేక మార్లు అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ అనే తేడా లేకుండా భూకబ్జా పర్వాలు పలు దినపత్రికలలో ప్రతిరోజు ప్రచురితమవుతున్న విషయం తెలిసిందే. అయినా సంబంధిత అధికారులు అవి ఏవి పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం చూస్తుంటే ఊసరవెల్లి కూడా సిగ్గు పడుతుందనడంలో సందేహం లేదు. ఇలాంటి కబ్జాకోరుల చెరలో చిక్కుకున్న ప్రభుత్వ భూములు తక్షణమే అధికారులు స్వాధీనం చేసుకొని ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి, ఏజెన్సీ చట్టాలకు తూట్లు పొడుస్తున్న దొంగల ముఠాను అరెస్టు చేసి, ప్రభుత్వ భూములను, ఏజెన్సీ చట్టాలను పరిరక్షించాలని ప్రజలు, నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

భద్రాచలం ఐటీడీఏ అధికారుల,వివరణ ..

డబల్ బెడ్ రూమ్ పక్కన ఉన్న స్థలాలలో కొంతమంది బడాబాబులు కబ్జా చేయడం ఫెన్సింగ్ వేయడం జరిగిందని, సంబంధిత రెవిన్యూ, గ్రామ పంచాయతీ అధికారుల సమక్షంలో వాటిని స్వాధీనం చేసుకునేందుకు అధికారులు ఉత్తర్వులు ఇవ్వడం జరిగిందని భద్రాచలం ఐటీడీఎ ATWO పూనెం నరసింహారావు తెలిపారు.

భద్రాద్రి ఆదివాసీ సమితి..

భద్రాచలం పట్టణంలోని ప్రభుత్వ స్థలాలను చెరువులను కొంతమంది భూ కబ్జాదారులు కబ్జా చేస్తుంటే అధికారులు ప్రజా ప్రతినిధులు వారికి వత్తాసు పలకడం సరైనది కాదని ఎటువంటి ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన తక్షణమే స్వాధీనపరచుకొని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పూనెం కృష్ణ దొర, పూనెం వీరభద్రం లు తెలిపారు.



Next Story

Most Viewed