ఉద్యోగం ఆడ.. జీతం ఈడ.. రూల్స్ వర్తించవా?

by  |
ఉద్యోగం ఆడ.. జీతం ఈడ.. రూల్స్ వర్తించవా?
X

దిశ, ఓదెల : మండలంలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు పట్టణాల్లో నివాసముంటూ పల్లె ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తూ సమయపాలన పాటించకపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రభుత్వ అధికారులు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలని ప్రభుత్వం చెబుతున్న అధికారులు మాత్రం తమ ఇష్టానుసారం నడుచుకుంటూ ఉండడంతో ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను నిర్ణీత సమయంలో పూర్తి చేయాల్సి ఉండగా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడంతో అభివృద్ధి పనులు కుంటుపడుతుందని ఆరోపిస్తున్నారు. మండలంలోని జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, పావలా వడ్డీ రుణాలు, సీసీ రోడ్లు, డ్రైనేజీలు తదితర పథకాలన్నీ పూర్తిస్థాయిలో అమలు కాకపోవడానికి అధికారుల నిర్లక్ష్యమే నని మండల వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మండల పరిషత్, రెవెన్యూ ,పంచాయతీరాజ్, ఇంజనీరింగ్, వైద్య ,విద్య ,నీటిపారుదల వ్యవసాయ శాఖల అధికారులు. వరంగల్, హనుమకొండ ,జమ్మికుంట ,కరీంనగర్ ,పెద్దపల్లి వంటి పట్టణాల్లో నివాసముంటూ ఇక్కడికి రాకపోకలు కొనసాగిస్తున్నారు. ప్రతిరోజు పది గంటలకు కార్యాలయానికి రావలసిన అధికారులు అనునిత్యం రెండు మూడు గంటలు ఆలస్యంగా వస్తూ సాయంకాలం మూడు గంటలకు తిరుగు ప్రయాణం చేస్తున్నారని ప్రజాప్రతినిధులు ,ప్రజలు చెబుతున్నారు. కార్యాలయంలో సిబ్బంది తో సహా అధికారులు గైర్హాజర్ అవుతున్న పట్టించుకునే వారు కరువయ్యారు.

ప్రజలు ఎంతో వ్యయప్రయాసలకోర్చి పనుల కోసం కార్యాలయాలకు వస్తే అధికారులకు బదులు అటెండర్ దర్శనమిస్తారని పలువురు వాపోతున్నారు. విధుల పట్ల శ్రద్ధ చూపని అధికారులపై మండల సభలో సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు అనేకమార్లు ధ్వజమెత్తినప్పటికీ ఫలితం శూన్యం మవుతుందని పలువురు నాయకులు పేర్కొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసి గ్రామసభలు, సంక్షేమ పథకాల కార్యక్రమాల్లో అధికారుల పనితీరు నిలదీసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. స్థానికంగా ఉండాలని ప్రభుత్వ నిబంధనలు ఉన్నప్పటికీ అధికారులు మాత్రం వాటిని ఉల్లంఘిస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనేది వాస్తవం. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి విధులు సక్రమంగా నిర్వహించని అధికారుల పై కొరడా జులుపించి సంక్షేమ పథకాల అమలుకు కృషి చేయాలని ఓదెల మండల ప్రజలు కోరుతున్నారు.

Next Story

Most Viewed