కాసులిస్తే కల్యాణలక్ష్మి..!

by  |
కాసులిస్తే కల్యాణలక్ష్మి..!
X

దిశ సూర్యాపేట: ఆడ బిడ్డ పెళ్లి తల్లిదండ్రులకు భారం కాకూడదని ఉద్దేశంతో కల్యాణలక్ష్మి పథకం కొంతమందికి వరంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన కల్యాణలక్ష్మి పథకం అధికారుల నిర్లక్ష్యానికి పక్కదారి పడుతోంది. కాసులకు కక్కుర్తి పడి వివాహ వయసులేని వారికి సైతం అధికారులు తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో అందజేస్తున్నారు. పేద యువతులకు ఎంతగానో దోహదపడే ఈ పథకం కొంతమంది ఆఫీసర్ల చేతివాటానికి తప్పుడు పత్రాలతో కల్యాణలక్ష్మి పథకం నీరుకారిపోతుంది.

ఇటీవల కాలంలో మునగాల మండలం కలకోవ గ్రామంలో జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.. తప్పుడు పత్రాలతో కల్యాణలక్ష్మి పథకాన్ని తప్పుదోవ పట్టించి లబ్ధి పొందారని మండలంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. కల్యాణలక్ష్మి పథకం యువతికి 18 సంవత్సరాలు, యువకుడికి 21 సంవత్సరం పూర్తి కావాలి కానీ 2018 సంవత్సరంలో యువకుడి వివాహం అయింది. అప్పటికి యువకుడికి 19 సంవత్సరాలు ఉండడంతో రెవెన్యూ శాఖ అధికారితో బేరసారాలు మాట్లాడగా 21 సంవత్సరాలు పూర్తి అయినట్టుగా పదో తరగతి నకిలీ పత్రాలు సృష్టించి దరఖాస్తు చేసుకున్నారు. నకిలీ పత్రాలను గుర్తించాల్సిన రెవెన్యూ ఉన్నత అధికారులు ‘నీకెంత నాకెంత’ అనే అనే విధంగా వాటాలు వేసుకొని మరీ నకిలీ ధ్రువపత్రాలను ప్రోత్సహించినట్లు మునగాల మండలంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అధికారులు ఇప్పటికైనా స్పందించి విచారణ జరిపి అక్రమలకు పాల్పడుతున్న అధికారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా మండల ప్రజలు కోరుకుంటున్నారు.

కాసులిస్తే చెక్కు రెడీ..

ప్రభుత్వం మంజూరు చేసినా.. కావాలనే కాలయాపన చేస్తూ కాసులిస్తే చెక్కు రెడీ అంటూ బేరం పెడుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. గ్రామాల్లో కొందరు ప్రజాప్రతినిధులను మధ్యవర్తులుగా పెట్టుకుంటున్న అధికారులు వారితో గుట్టుచప్పుడు కాకుండా లబ్ధిదారులకు చెక్కులను అందజేస్తూ అందినకాడికి జేబుల్లో వేసుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు జిల్లాలో ప్రతి మండలంలో జరుగుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

బాధితులు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం.

కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌లకు సంబంధించి మోసపూరిత దరఖాస్తులు ఎవరైనా చేసుకుంటే అట్టి దరఖాస్తులను తహసీల్దార్లు పరిశీలించి ఆ స్థాయిలో విచారణ నిర్వహించి పిదపనే మంజూరు చేయాలి. తహసీల్దార్లు లాగిన్‌లలో ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకోవాలి. తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తు చేసుకున్న వారిపై తప్పుడు ధ్రువపత్రాన్ని ప్రోత్సహించిన అధికారిపై చర్యలు తీసుకుంటాం.

-ఎల్.కిషోర్ కుమార్ ఆర్డీఓ, కోదాడ



Next Story

Most Viewed