అధికారులు సమన్వయంతో పనిచేయాలి: ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

53
MLA Devireddy Sudheer Reddy

దిశ, ఎల్బీనగర్: జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఆదేశించారు. శుక్రవారం ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి నియోజకవర్గ పరిధిలోని జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలపై ఎస్.ఎన్.డి.పీ, జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్ అధికారులచే సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి అధికారులకు పలు సూచనలు, సలహాలు చేశారు.

ముఖ్యంగా మూడు శాఖల అధికారులు సమన్వయం చేసుకుని పనులు చేపట్టాలని సూచించారు. బండ్లగూడ చెరువు దగ్గర నూతన డ్రైన్స్ నిర్మించాలన్నారు. జీహెచ్ఎంసీ 70 మీటర్ల చిన్న లైన్ వేశారని, అక్కడే ఎస్.ఎన్.డి.పీ కూడా పనులు చేస్తున్నారు. కావున ఒకరికొకరు సమన్వయం చేసుకుని ఎత్తు, పల్లాలు చూసుకొని లైన్స్ సరిగ్గా వేయాలని సూచించారు. అలాగే ముందుకు వెళితే ఒక ప్రైవేట్ స్థలం ఉందని, ఆ స్థల యజమానులతో మాట్లాడి ఆ స్థలం గుండా డ్రైన్స్ పోయే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ఆ స్థల యజమానులకు తగిన నష్టపరిహారం కూడా ఇప్పించడం జరుగుతుందని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో పనులు ఆగకుండా ఒకరికొకరు సమన్వయంతో వచ్చే వర్షాకాలంలోపు పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

అలాగే చంద్ర గార్డెన్స్ నుండి వయా మెగా ఫంక్షన్ ఎదురుగా సరూర్ నగర్ చెరువు వరకు ,సరూర్ నగర్ చెరువు నుంచి కోదండరాం నగర్ మీదుగా చైతన్య పూరి బ్రిడ్జి వద్ద, ప్రియదర్శిని పార్క్ నుండి చౌడి గుండా జెడ్.సి.ఆఫీస్ నుంచి చైతన్య పూరి బ్రిడ్జి వరకు వరదనీటి నూతన పైప్ లైన్స్ పనులు అతి త్వరలో మొదలుపెట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు ఎవరు ఇబ్బందులు పడకుండా పనులు చేయాలని సూచించారు. అలాగే ఇట్టి పనులు ప్రారంభం దృష్ట్యా ప్రజలు కూడా అధికారులకు సహకరించాలని కోరారు. వచ్చే వర్షాకాలం వరకు పూర్తి చేస్తే ప్రజలు వరద నీటి నుండి విముక్తి లభిస్తుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జీ.హెచ్.ఎం.సీ.సర్కిల్ – 3 కమిషనర్ మారుతి దివాకర్, ఇరిగేషన్ ఎస్ఈ మురళి కృష్ణ, డి.ఈ.పవన్, ఈ ఈ నారాయణ తదితరులు పాల్గొన్నారు.