కేసీఆర్ చెప్పిన మాట విని.. తీవ్రంగా నష్టపోయానంటున్న గోపాల్‌రెడ్డి

119
Farmers-kcr11

దిశ, ఓదెల: శుక్రవారం రాత్రి కురిసిన అకాల వర్షంతో ఓదెల మండలంలోని కనగర్తి, మడక, జీల కుంట, ఓదెల, పోతకపల్లి గ్రామాల్లో వడగండ్ల వర్షం, ఈదురు గాలులకు 50 ఎకరాల మొక్కజొన్న నేలమట్టం అయింది. అకాల వర్షంతో మొక్కజొన్న పంట ఎక్కువ నష్టపోయినట్లు తెలిసింది. పత్తి రంగు మారడంతో పెట్టుబడులు కూడా రావని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా మొక్కజొన్న రైతులకు నష్టం వాటిల్లింది. అనుకోకుండా అకాల వర్షం కురవడంతో వరి రంగు మారి రోగాల బారిన పడే పరిస్థితి ఉందని పలువురు రైతులు ఆందోళన చెందుతున్నారు. అసలే దిగుబడి లేక అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతులు అకాల వర్షం మళ్ళీ అప్పులోకి నెట్టిందని ఆవేదన వ్యక్తం చేస్తు్న్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వరి సాగు చేయొద్దని చెప్పడంతో చాలామంది రైతులు ఆరుతడి పంటలైన మొక్కజొన్న వేయడంతో అకాల వర్షానికి పంట నష్టం వాటిల్లిందన్నారు. కొలనూరు నుంచి పెద్దపల్లికి వెళ్లే రహదారిపై చెట్లు విరిగి పడడంతో ప్రయాణికులు ఇబ్బందులు గురయ్యారు.

Panta11

నేల పాలైన మొక్కజొన్న పంట: జంగ గోపాల్ రెడ్డి రైతు కొలనూర్

ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికి వచ్చే సమయంలో శుక్రవారం రాత్రి కురిసిన అకాల వర్షానికి నేలమట్టమైంది అని రైతులు తెలిపారు. ఓదెల మండలం కొలనూర్ గ్రామానికి చెందిన జంగ గోపాల్ రెడ్డి తన సర్వే నెంబర్ 215 గల భూమిలో ఎకరా పది గుంటల్లో మొక్కజొన్న పంట సాగు చేశాడు. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు వరి వేయవద్దని సూచించండంతో మొక్కజొన్న పంట తీసుకున్నానని తెలిపారు. పంట పెట్టుబడి 30 వేల రూపాయలు ఖర్చు పెట్టానని, పంట చేతికొస్తే సుమారు రూ. 65 వేల నుంచి 80 వేల వరకు ఆదాయం వచ్చేది అని ఆయన అన్నారు. పంట నేలమట్టం కావడంతో పెట్టిన పెట్టుబడి కూడా నష్టపోయానని, ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని ఆయన వేడుకుంటున్నారు.