ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య కాల్పులు

by  |
ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య కాల్పులు
X

సియోల్: గత కొన్ని రోజులుగా ఎలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడని ఉత్తర కొరియా ఇవాళ అకస్మాత్తుగా దక్షిణ కొరియా వైపు కాల్పులకు తెగబడింది. రెండు దేశాల మధ్య ఉన్న డీమిలిటరైజ్డ్ జోన్‌లో ఈ ఘటన జరిగినట్లు సియోల్ మిలటరీ అధికారులు తెలిపారు. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 7.40 గంటలకు ఈ ఘటన జరిగిందని.. ఉత్తర కొరియా వైపు నుంచి వచ్చిన తుపాకీ గుండ్లు సరిహద్దుకు దగ్గరగా ఉన్న చేర్వోన్ నగరానికి సమీపంలోని దక్షిణ కొరియా సైనిక శిబిరానికి తాకినట్లు తెలిపింది. ఈ ఘటనలో దక్షిణ కొరియా వైపు ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టాలు సంభవించలేదని స్పష్టం చేసింది. అయితే, ఈ దాడికి ప్రతీకారంగా రెండు రౌండ్ల కాల్పులు జరిపినట్లు దక్షిణ కొరియా మిలటరీ ప్రకటించింది. కాగా, గత కొన్ని రోజులుగా కిమ్ ఆరోగ్యంపై ఆందోళన, ఆయన మరణంపై ఊహాగానాలు చెలరేగిన సమయంలో సైలెంట్‌గా ఉన్న ఉత్తర కొరియా అకస్మాత్తుగా ఇవాళ కాల్పులు జరిపింది. అసలు ఈ కాల్పులు ఎందుకు జరపాల్సి వచ్చిందో కూడా తెలియజేయలేదు. ఈ ప్రాంతంలో గత ఐదేండ్లలో ఎలాంటి కాల్పులు కూడా జరగలేదు. ఉత్తర కొరియా బలగాలు దక్షిణ కొరియాపై దాడి చేయడం గత ఐదేండ్లలో ఇదే తొలిసారి. డీమిలిటరైజ్డ్ జోన్‌ను శాంతియుత ప్రాంతంగా మార్చేందుకు గత రెండేళ్లుగా సియోల్ నాయకత్వం ప్రయత్నిస్తోంది.

Tags : South Korea, North Korea, Seoul, Pyongyang, Crossfire

Next Story

Most Viewed