‘ధరణి’ పార్టు-2 సహకరించేనా?

by  |
‘ధరణి’ పార్టు-2 సహకరించేనా?
X

దిశ, తెలంగాణ బ్యూరో : మూడేండ్ల కష్ట ఫలం ‘ధరణి’ పోర్టల్- కొత్త ఆర్వోఆర్ చట్టం. దాని ఆధారంగా సాగు భూముల రిజిస్ట్రేషన్లు, ఆటోమెటిక్ మ్యూటేషన్ల ప్రక్రియ సాగుతోంది. అన్ని తహసీల్దార్ కార్యాలయాల్లో సర్వీసులను అందుబాటులోకి తెచ్చారు. ఇంకా బాలారిష్టాలను దాటలేదు. కానీ సీఎం కేసీఆర్ కు మాత్రం అంతా బాగుందన్న నివేదికలే అందినట్లు తెలుస్తోంది. ఇప్పుడేమో సాగు భూముల రిజిస్ట్రేషన్ల స్ఫూర్తిగా వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియనూ ‘ధరణి’ పోర్టల్ ద్వారానే నడుపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 23 వ తేదీ నుంచి మొదలయ్యే ఆస్తుల రిజిస్ట్రేషన్లు, ఆటోమెటిక్ మ్యూటేషన్లపై సామాన్యుడికి అనేక సందేహాలు ఉన్నాయి. పార్టు-2 లో నమోదు చేసే ఆస్తుల వివరాలు ఇటీవల సర్వే ద్వారా సేకరించినవేనా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. కొందరేమో మా ఇంటికి ఎవరూ రాలేదంటున్నారు. ఇంకొందరేమో ఆస్తుల పంపకం జరుగలేదంటున్నారు. మరికొందరి ఇండ్లకు తాళాలు వేసి ఉండడంతో వివరాలేవీ చెప్పలేదంటున్నారు. ఈ క్రమంలో ఆ వివరాలనే నమోదు చేసి క్రయ విక్రయాలను ప్రారంభిస్తే మళ్లీ సమగ్రత లోపిస్తుందంటున్నారు.

ఒక వేళ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలోని సేల్ డీడ్ ఆధారిత వివరాలను నమోదు చేస్తారా? ఏ డేటాను ‘ధరణి’ పోర్టల్ ప్రామాణింగా పాటిస్తుందో అధికారులు స్పష్టం చేయడం లేదు. పైగా సాగు భూములకు క్లాసిఫికేషన్లు పెద్దగా ఉండవు. పట్టా భూములకు మాత్రమే అమ్మకాలను అంగీకరిస్తారు. కానీ వ్యవసాయేతర భూములకు అనేక క్లాసిఫికేషన్లు ఉంటాయి. వాటన్నింటికీ సరిపోయే ‘ధరణి’ పోర్టల్ ను సిద్ధం చేయాల్సి ఉంటుందని రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు, ఉద్యోగులు స్పష్టం చేస్తున్నారు. వాటి గురించి తాము సాఫ్ట్ వేర్ బృందానికి గుర్తు చేస్తేనే సహకరించడం లేదన్న అపవాదును మూట కట్టుకున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. మిగతా శాఖలకు తమ శాఖకు మధ్య చాలా వ్యత్యాసం ఉందని, అనేక చట్టాల సమాహారంతో పని చేస్తాము, బ్రిటిష్ కాలం నాటి అనేక చట్టాలకు కాస్త మార్పులు చేసుకొని వినియోగిస్తున్నట్లు చెబుతున్నారు. అలాంటి వాటికి అనుగుణంగానే ‘ధరణి’ పార్టు 2 ను రూపొందించాలని ప్రభుత్వాన్ని కోరామని, కొందరు నిపుణులు తమ సూచనలను అపార్థం చేసుకున్నారని వాపోతున్నారు. చీఫ్ సెక్రెటరీ సోమేష్ కుమార్ నేతృత్వంలోని సాంకేతిక బృందం తమ సూచనలను స్వీకరిస్తే విజయవంతం అవుతుందంటున్నారు.

వేర్వేరుగా డీడ్స్..

సాగు భూములకు రెండు, మూడు రకాల డీడ్స్ మాత్రమే ఉంటాయి. కానీ వ్యవసాయేత భూములకు ఓపెన్ ల్యాండ్, ఇండ్లు, అపార్టుమెంట్లు, మార్ట్ గేజ్, జీపీఏ, ఏజీపీఏ, పార్టిషన్, రిలీజ్ డీడ్, డెవలప్​ మెంట్​ అగ్రిమెంట్, గిఫ్ట్ డీడ్ ఇలా అనేక రకాల లావాదేవీలు ఉంటాయి. డాక్యుమెంట్లు వేర్వేరుగా ఉంటాయి. అలాగే స్టాంపు డ్యూటీ కూడా విభిన్నంగా ఉంటుంది. అనేక చట్టాలకు అనుగుణంగా ప్రక్రియ నడుస్తుంది. ఈ డాక్యుమెంట్లు చేసేందుకు అవసరమైన సాఫ్ట్ వేర్ ను డెవలప్ చేయాలని తాము అడిగితే అడ్డుకుంటున్నారన్న అపవాదు మూటగట్టారని కొందరు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఒకరి పేరిట ఈసీ సెర్చ్ చేస్తే రాష్ట్రంలో ఆయన ఆస్తుల వివరాలన్నీ వచ్చేటట్లుగా మెరుగైన సాంకేతిక అంశాలతో రావాలి. 23వ తేదీన మొదలు కానున్న రిజిస్ట్రేషన్లకు విధి విధానాలను విడుదల చేసిన తర్వాతే ఏ మేరకు సక్సెస్ అవుతుందో చెప్పగలమంటున్నారు. ఓ మైనర్ తన ఆస్తులను అమ్ముకోవాలంటే పెద్ద తతంగమే ఉంటుంది. కోర్టు అనుమతి ద్వారా విక్రయించినా వచ్చిన సొమ్మును అతడి సంక్షేమం కోసమే ఖర్చు చేయాలన్న నిబంధనలు ఉంటాయి. ఇలాంటి అనేక సూక్ష్మమైన అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందంటున్నారు.

80 రోజుల తర్వాత..

1999 నుంచి ఎన్ఐసీ పర్యవేక్షణలో కార్డ్ ద్వారా కంప్యూటర్ ఆధారిత రిజిస్ట్రేషన్లను రిజిస్ట్రేషన్ల శాఖ నిర్వహిస్తోంది. వేగవంతంగానే ప్రక్రియలు చేపట్టారు. పాదర్శకత కనిపిస్తోంది. సంబంధిత శాఖ వెబ్ సైట్ ద్వారా ఆస్తుల వివరాలు పారదర్శకంగానే ఉంచుతున్నారు. ఎవరైనా వెబ్ సైట్ ద్వారా యజమాని వివరాలను పొందొచ్చు. ఈసీ ద్వారా కూడా లావాదేవీలను తెలుసుకోవచ్చు. ఇప్పుడు 80 రోజుల తర్వాత అందుబాటులోకి వచ్చే ‘ధరణి’ ద్వారా రిజిస్ట్రేషన్ల సేవలు కార్డ్ కంటే ఏ మేరకు మెరుగైన సేవలు అందిస్తారో వేచి చూడాలి. అప్పుడు కూడా హెచ్ఎండీఏ, డీటీసీపీ అనుమతి పొందిన లేఅవుట్లలోని ప్లాట్లు, గతంలో ఎల్ఆర్ఎస్ ద్వారా క్రమబద్ధీకరించిన ప్లాట్లు మాత్రమే రిజిస్ట్రేషన్ చేసే అవకాశం కనిపిస్తోంది. మిగతా అన్ని వ్యవసాయేతర ఆస్తుల క్రయ విక్రయాలు జరుగాలంటే మరో మూడు, నాలుగు నెలలు పట్టేటట్లు ఉందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

Next Story

Most Viewed