రిజిస్ట్రేషన్లు నిల్లు.. అప్పులు ఫుల్లు

by  |
రిజిస్ట్రేషన్లు నిల్లు.. అప్పులు ఫుల్లు
X

దిశ, తెలంగాణ బ్యూరో: మూడు నెలలుగా రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. వేల కోట్ల రూపాయల లావాదేవీలు ఆగిపోయాయి. వేలాది మంది అప్పులపాలయ్యారు. వడ్డీలు కట్టలేక సతమతమవుతున్నారు. రిజిస్ట్రేషన్లను నిలిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో చాలా మంది రోడ్డున పడ్డారు. రిజిస్ట్రేషన్లు ఎప్పుడు మొదలవుతాయా? అని ఆశతో ఎదురుచూస్తున్నారు. ఎవరికీ క్లారిటీ లేదు. ఎప్పుడు ఈ ప్రక్రియను మొదలు పెడతారో తెలియదు. ఈ మూడు నెలలలో వేల కోట్ల రూపాయలు చేతులు మారేవి. ఎల్ఆర్ఎస్, ధరణి పేరు చెప్పి రిజిస్ట్రేషన్లను నిలిపివేశారు. ఎల్ఆర్ఎస్ పథకానికి ఏకంగా 29 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వాటిని ఎప్పుడు పరిష్కరిస్తారో తెలియదు. అందుకు మానవ వనరులు కూడా లేవన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రక్రియను ఇప్పుడు ఆరంభించినా కనీసం ఆరు నెలలు పడుతుందని చెబుతున్నారు. ఈ లెక్కన తొమ్మిది నెలల వరకు రిజిస్ట్రేషన్లు జరిగే అవకాశం లేదు. ఒక వేళ అప్రూవ్డ్ లేఅవుట్లలోని ప్లాట్ల రిజిస్ట్రేషన్లను ప్రారంభించినా అవి పది శాతానికి మించి ఉండవని సమాచారం. రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఎన్ని రోజలకు పూర్వపు స్థితికి వస్తుందో తెలియని అయోమయం నెలకొంది. దీంతో రియల్టర్లు, బిల్డర్లు, మేస్త్రీలు ఆందోళన చెందుతున్నారు.

వడ్డీలు కట్టలేక

తెలిసినవారి అప్పు తీసుకుని ఓ మేస్త్రీ ప్రకాశం జిల్లా నుంచి నగరానికి వచ్చారు. బడంగుపేటలో ఐదు ప్లాట్లు కొన్నారు. స్వస్థలం నుంచి 20 మంది కార్మికులను రప్పించి ఇండ్లు కట్టారు. దాదాపు రూ. మూడు కోట్ల వరకు పెట్టుబడి పెట్టారు. ఇండ్లు పూర్తయ్యాయి. మార్కెట్లో అమ్మకానికి పెట్టారు. ఇంతలో ఎల్ఆర్ఎస్ పిడుగు పడింది. రిజిస్ట్రేషన్లు నిలిపేశారు. అప్పులకు వడ్డీలు కట్టలేక ఆయన సతమతమవుతున్నారు. ఓ టీఆర్ఎస్ నాయకుడు, కార్పొరేటర్ అభ్యర్థి అల్మాసుగూడలో ఆరు ప్లాట్లు కొన్నారు. దాదాపు రూ. మూడు కోట్లు పెట్టి ఇండ్లు కట్టేశారు. ఎన్నికలలోనూ ఖర్చయ్యింది. చాలా రోజులుగా పైసా ఆదాయం లేదు. కట్టిన ఇండ్లు కొనేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఓ బిల్డర్ ఘట్ కేసర్ లో మూడు ప్లాట్లు కొన్నారు. రూ.80 లక్షలకు పేమెంట్ చేసేశారు. తెల్లారితే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయ్యేది. అదేరోజు నిలిపివేయడంతో ఆయన ఆందోళనలో ఉన్నారు. బోడుప్పల్ కు చెందిన పది మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు బీబీనగర్ లో 16 ఎకరాల భూమి కొనుగోలు చేశారు. దాదాపు తలా రూ.10 లక్షలకు పైగా పెట్టుబడి పెట్టారు. ఓపెన్ స్పేస్ గ్రామపంచాయతీకి రిజిస్ట్రేషన్ చేయాలి. తెల్లారి చేద్దామకున్నారు. రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి. ఒక్క రోజు గడిస్తే హెచ్ఎండీఏ నుంచి ఎల్పీ నంబరు వచ్చేది. ఇప్పుడు పెట్టుబడికి వడ్డీలు కట్టలేక ఇబ్బంది పడుతున్నారు. ఇలా ఒకటీ రెండు కాదు.. ఉదాహరణలు వందలలో ఉన్నాయి.

రిజిస్ట్రేషన్ల నిలిపివేత ప్రభావం నగర శివారు ప్రాంతాల మీద తీవ్రంగా పడింది. బోడుప్పల్, బడంగ్ పేట, మీర్ పేట, పహడీషరీఫ్, తుక్కుగూడ, తుర్కయంజాల్, ఇబ్రహీంపట్నం, పెద్దఅంబర్ పేట, ఘట్ కేసర్, బోడుప్పల్, పీర్జాదిగూడ, జవహర్ నగర్, తూంకుట, మేడ్చల్, కొంపెల్లి, నిజాంపేట, నార్సింగి, బండ్లగూడ, మణికొండ, శంషాబాద్, శంకర్ పల్లి తదితర మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో వేలాది ఇండ్లు అమ్మకానికి ఉన్నాయి. ప్రతి కాలనీలోనూ హౌజ్ ఫర్ సేల్ అంటూ బోర్డులు దర్శనమిస్తున్నాయి. వాటిలో సింహభాగం చిన్న చిన్న మేస్త్రీలు కట్టినవే. 90 శాతం వరకు 100 నుంచి 200 గజాలలోపు ప్లాట్లల్లో కట్టినవే. అన్నీ రూ.40 లక్షల నుంచి రూ. కోటి విలువజేసేవే. ఇండ్లు కట్టి అమ్మేవారిలో అత్యధికం ప్రకాశం, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, కృష్ణా, శ్రీకాకుళం జిల్లాల నుంచి వచ్చినవారే. వారి వెంట వచ్చిన కార్మికులంతా సొంతూర్ల బాట పట్టారు. తీసుకున్న అడ్వాన్సులు కూడా చెల్లించకుండా వెళ్లారని ఓ మేస్త్రీ ఆవేదన వ్యక్తం చేశారు.

సడెన్‌గా ఆపేశారు

ప్రభుత్వం రిజిస్ట్రేషన్లు ఎందుకు నిలిపివేసిందో అర్ధం కావడం లేదు. అడ్వాన్సులు చెల్లించి రిజిస్ట్రేషన్ల కోసం ఎదురుచూస్తున్నాం. సడెన్ గా ఆపేశారు. ఇప్పుడేం చేయాలో తెలియడం లేదు. కట్టిన ఇండ్లు కూడా ఆగిపోయాయి. కస్టమర్లు రావడం లేదు. ఎల్ఆర్ఎస్ పథకంలోనూ క్లారిటీ లేదు. మేం డబ్బులు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికే టోకెన్ అమౌంట్ చెల్లించి దరఖాస్తు చేసుకున్నాం. వాటినీ క్లియర్ చేయడం లేదు. ఎన్నాండ్లు ఆగాలో తెలియదు. ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ చూడలేదు. ఇలాగే కొనసాగితే వేలాది మంది ఆర్ధికంగా తీవ్ర కష్టాల్లో కూరుకుపోతారు. ప్రభుత్వం ఇకనైనా ఆలోచించాలి.

‌‌– రమణారెడ్డి, రియల్టర్ కమ్ బిల్డర్, బోడుప్పల్

అప్పులు ఎలా తీరాలి

మేం చిన్న ప్లాట్లు కొనుగోలు చేసి ఇండ్లు కట్టి అమ్మేవాళ్లం. ఐదు చోట్ల ఇండ్లు పూర్తయ్యాయి. మూడు నెలలుగా ఒక్క కస్టమర్ రావడం లేదు. ఎప్పుడు ఓపెన్ చేస్తారో అంతు చిక్కడం లేదు. అప్పులు తెచ్చి పెట్టాం. వడ్డీలు కట్టలేకపోతున్నాం. వాటిని అమ్మేస్తే మరో చోట ప్లాట్లు కొని ఇండ్లు కట్టే ఆలోచన లేదు. కట్టిన ఇండ్లు అమ్మేస్తే చాలు. అప్పులు చెల్లించి ఏదో ఒక పని చేసుకుంటాం. ఎల్ఆర్ఎస్ అమౌంట్ కట్టడానికి సిద్ధంగా ఉన్నాం. అప్పుడైనా రిజిస్ట్రేషన్లు చేస్తారా? అల్మాస్ గూడ, బడంగ్ పేట ప్రాంతాల్లోనే 1000 ఇండ్ల వరకు రెడీగా ఉన్నాయి.

– ఎ.వెంకటేశ్, బిల్డర్, అల్మాస్ గూడ

పేరుకే పెద్ద కంపెనీ

మాకు వందల ఎకరాలు ఉన్నాయి. వేలాది ప్లాట్లు ఉన్నాయి. లాభం ఏమిటి? మూడు నెలల నుంచి లావాదేవీలు నిలిచిపోయాయి. బ్యాంకు నిల్వలు ఎంత కాలం ఉంటాయి? ఆఫీసు నిర్వహణ కూడా ఇప్పుడు కష్టంగా ఉంది. పెట్టుబడులన్నీ నిలిచిపోయాయి. ఒక్క ప్లాటు అమ్మలేదు. మేం వ్యవసాయ భూములు కొన్నాం. వారికి అడ్వాన్సులు ఇచ్చాం. ప్లాట్లు అమ్మకపోతే ఎక్కడి నుంచి తీసుకొచ్చేది? ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ రాలేదు. ముందు కరోనా, తర్వాత వరదలు. ఇప్పుడు రిజిస్ట్రేషన్ల నిలిపివేత. వరుస కష్టాలను ఎదుర్కొన్నాం.

– సీఎండీ, ప్రముఖ రియల్​ ఎస్టేట్​ కంపెనీ

Next Story