తీరని నర్సుల బాధలు.. ప్రమోషన్లు ఇవ్వరా?

by  |
staff nurses
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని పేద ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందించేందుకు కొత్త మెడికల్​ కాలేజీలు, నర్సింగ్​ కళాశాలలను అందుబాటులోకి తెస్తున్నట్లు సీఎం కేసీఆర్​ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. సుమారు 10 వేల కోట్లతో మౌలిక వసతులను ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారు. వైద్యరంగాన్ని మరింత బలోపేతం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని నొక్కి చెప్పారు. ఆ దిశగా ప్రభుత్వం ప్రత్యేక ప్లాన్‌తో ముందుకు వెళ్తున్నట్టు స్పష్టం చేశారు. నగరం నలుమూలల నాలుగు మల్టీ సూపర్​ స్పెషాలిటీ ఆస్పత్రులతో పాటు జిల్లాల్లోనూ ప్రత్యేక ఆస్పత్రులను ఏర్పాటు చేయబోతున్నట్టు వివరించారు.

అయితే కొత్త ఆసుపత్రులు, కళాశాలలు అందుబాటులోకి వస్తున్నా.. వాటిలో శాశ్వత పద్ధతిలో నియామకాలను ఎందుకు చేయలేకపోతున్నారని పలువురు నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా పేషెంట్లను 24 గంటల పాటు కంటికి రెప్పలా పర్యవేక్షించే నర్సింగ్​ వ్యవస్థపై సర్కార్​ దృష్టి పెట్టడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అనేక ఆస్పత్రుల్లో నర్సింగ్ పోస్టులు ఖాళీలు వెక్కిరిస్తున్నా.. వాటిని భర్తీ చేయలేకపోవడం గమనార్హం. దీంతో ప్రభుత్వాసుపత్రుల్లో పనిచేస్తున్న నర్సులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. పడకలకు అనుగుణంగా సిబ్బంది లేక పనిభారంతో ఇబ్బంది పడుతున్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ఈ ఒత్తిడి మరింత ఎక్కువైంది.

దీంతో నర్సులతో పాటు పేషెంట్లకూ నష్టం వాటిల్లుతున్నది. సకాలంలో వైద్యసేవలు అందక రోగులు ఇబ్బంది పడుతున్నారు. ఐదారుగురు చేసే పనిని ఒక నర్సు చేయాల్సి వస్తున్నది. కొత్త పోస్టులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి ఎన్ని సార్లు విన్నపించినా.. పట్టించుకోవడం లేదని నర్సులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర విభజన జరిగిన సమయంలో ఏర్పడ్డ 9270 పోస్టుల్లో కూడా 3 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయంటే.. ప్రభుత్వ పనితీరును అర్ధం చేసుకోవచ్చు. ఆస్పత్రుల్లోని బెడ్ల కనుగుణంగా నర్సులను నియమించేందుకు నోటిఫికేషన్లు విడుదల చేయకుండా, ఉన్న వారికి ప్రమోషన్లు ఇవ్వకుండా ప్రభుత్వం నర్సులను సతాయిస్తున్నది. దీంతో ప్రభుత్వాసుపత్రుల్లో పనిభారంతో చాలా మందికి మానసిక సమస్యలు తలెత్తుతున్నట్లు నర్సింగ్ అసోసియేషన్లు చెబుతున్నాయి.

అంతేగాక స్టాఫ్ తక్కువుండటంతో కొన్ని సందర్బాల్లో రౌండ్ ది క్లాక్ పనిచేయాల్సి వస్తున్నదని గాంధీ ఆస్పత్రికి చెందిన ఓ హెడ్ నర్సు కన్నీళ్లు పెట్టుకున్నారు. పెరిగిన పడకలకు అనుగుణంగా పోస్టులు ఏర్పాటు చేసి, అర్హులైన వారికి ప్రమోషన్లు కల్పించాలని నర్సింగ్ అసోసియేషన్స్ కోరుతున్నాయి. అర్హతలు ఉన్నప్పటికీ చాలా మందికి పదోన్నతులు రావడం లేదంటున్నారు. దీంతో కొత్త వారికి అవకాశాలు లభించడం లేదు. ఏళ్ల తరబడి ప్రమోషన్లు పెండింగ్ లో ఉండటంతో స్టాఫ్ నర్సు, హెడ్ నర్సులు వారి వారి స్థానాల్లోనే రిటైర్డ్ అవ్వాల్సిన పరిస్థితి ఉన్నది.

ప్రస్తుతం ఉన్న కాలేజీల్లో అరకొర సేవలే

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఏడు నర్సింగ్​ కాలేజీలు కొనసాగుతున్నాయి. అయితే వీటన్నింటిలోనూ అరకొర సౌకర్యాలున్నాయి. సరైన బిల్డింగ్​ లు లేక విద్యార్ధులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల ఉస్మానియా, గాంధీ నర్సింగ్​ కాలేజీల బిల్డింగ్​ లను కూడా ఆయా ఆస్పత్రులకు కేటాయించారు. దీంతో ఆ విద్యార్ధులు క్లాస్​ లు చేప్పేందుకు టీచర్లకు సమస్యగా మారింది. డీఎంఈ డా రమేష్​రెడ్డికి చెప్పినా పట్టించుకోవడం లేదని నర్సింగ్​ ఆఫీసర్లు చెబుతున్నారు. దీంతో కొత్త కాలేజీలు కంటే ప్రస్తుతం ఉన్న వాటికి అన్ని సౌకర్యాలను సమకూర్చాలని నర్సులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

కౌన్సిల్‌లో 32 వేల మంది రిజిస్టర్

రాష్ట్ర విభజన తర్వాత ఏర్పాటైన నర్సింగ్ కౌన్సిల్ లో ఇప్పటి వరకు 32 వేల మంది నర్సులు రిజిస్టర్ చేసుకున్నారు. వీరిలో ప్రస్తుతం డీఎంఇ, డీహెచ్, టీవీవీపీ పరిధిలోని ప్రభుత్వాసుపత్రుల్లో సుమారు 6 వేల మంది మాత్రమే పనిచేస్తున్నారు. మిగతా వారంతా ప్రైవేట్ దవాఖాన్లలో పనిచేయాల్సిన పరిస్థితులు వచ్చాయి. పెరిగిన రోగాలు, రోగులు, బెడ్లకు అనుగుణంగా కొత్త సిబ్బందిని తీసుకోవాల్సి ఉన్నా.. సర్కార్ తీసుకోవడం లేదు. దీంతో అధికారులు సైతం చేసేదేమీ లేక చేతులెత్తేస్తున్నారు.

కౌన్సిల్ నిబంధనల ప్రకారం నర్సులు ఉండాల్సిన సంఖ్య

వార్డు బెడ్లు నర్సుల సంఖ్య
జనరల్ 5 1
ఐసీయూ 1 1
లేబర్ ప్రతీషిప్టు 4
ఆపరేషన్ ప్రతీషిప్టు 3
ఓపీ .. 1
క్యాజువాలిటీ 1 1
చిన్నపిల్లల 2 1
========
రాష్ట్ర విభజన తర్వాత మంజూరైన నర్సింగ్​ పోస్టులు
=స్టాఫ్ నర్స్ = 7,830
=హెడ్ నర్స్ = 937
=నర్సింగ్ సూపరింటెండెంట్​ గ్రేడ్ ll =122
=నర్సింగ్ సూపరింటెండెంట్​ గ్రేడ్ l = 66
=డిప్యూటీ అసిస్టెంట్​ నర్సింగ్ సూపరింటెండెంట్​/ హెడ్ నర్స్ =28
=నర్సింగ్ సూపరింటెండెంట్​ గ్రేడ్ lll =14



Next Story