‘లోకల్’ ఎలక్షన్స్‌కు న్యూ రూల్స్.. వారికి ‘ఆరోగ్యసేతు’ తప్పనిసరి

by  |
‘లోకల్’ ఎలక్షన్స్‌కు న్యూ రూల్స్.. వారికి ‘ఆరోగ్యసేతు’ తప్పనిసరి
X

దిశ, తెలంగాణ బ్యూరో : గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు ఓటు వేయడానికి వచ్చే ఓటర్లకు ‘నో మాస్క్ … నో ఎంట్రీ‘ విధానాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం తప్పనిసరి చేసింది. మాస్కు లేకుంటే పోలింగ్ కేంద్రంలోకి అనుమతి ఉండదని, ప్రతీ పోలింగ్ కేంద్రం ఎంట్రీ దగ్గర శానిటైజర్ ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. నామినేషన్ దాఖలు చేయడానికి ఈసారి ‘ఆన్‌లైన్‘ విధానం ద్వారా వెసులుబాటు కల్పించింది. అఫిడవిట్, నేర చరిత్ర, ఆస్తులు-అప్పులు తదితర పత్రాలన్నింటినీ ‘ఆన్‌లైన్‘ ద్వారానే సమర్పించవచ్చని స్పష్టం చేసింది. సంతకం చేసిన ప్రింటు ప్రతులను సమర్పించడానికి అభ్యర్థి వెంట మరో ఇద్దరికి మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది. రోజువారీ ఎన్నికల ఖర్చును కూడా ‘ఆన్‌లైన్‘ ద్వారా సమర్పింవచ్చని స్పష్టం చేసింది.

స్థానిక సంస్థల ఎన్నికల్లో కొవిడ్ నిబంధనల అమలు ఏ విధంగా ఉంటుందో అటు ఓటర్లకు, ఇటు ఎన్నికల సిబ్బందికి అర్థమయ్యేలా మార్గదర్శకాలను రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి అశోక్ కుమార్ గురువారం జారీ చేశారు. ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న పోలింగ్ సిబ్బందికి ‘ఆరోగ్యసేతు‘ మొబైల్ యాప్ వినియోగం తప్పనిసరి అని పేర్కొన్నారు. కరోనా నిబంధనల అమలు ఎలా ఉందో పరిశీలించడానికి ప్రతీ వార్డులో వైద్యారోగ్య శాఖ సిబ్బంది నోడల్ అధికారులుగా ఉండాలని పేర్కొన్నారు. వీలైనంత వరకు విశాలంగా ఉన్న హాళ్ళలోనే పోలింగ్ కేంద్రాలను నెలకొల్పాలని సూచించారు.

ఓటు వేయడానికి వచ్చేవారికి సోషల్ డిస్టెన్స్ నిబంధన తప్పనిసరి అని, ఇందుకోసం ప్రతీ ఆరు అడుగుల దూరానికి ఒకటి చొప్పున మొత్తం పదిహేను మంది నిల్చునేలా ‘సర్కిల్‘ గుర్తుల్ని మార్కు చేయాలని సూచించారు. రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గరికి వచ్చేటప్పుడు అభ్యర్థితో పాటు మరో ఇద్దరికి మాత్రమే అనుమతి ఉంటుందని, వాహనాలు కూడా రెండింటికి మాత్రమే అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు. రిటర్నింగ్ అధికారి ఆఫీసు రూమ్ విశాలంగా ఉండాలని, లోపలికి వచ్చే ప్రతీ ఒక్కరికీ మాస్కు ఉండాల్సింధేనని, లేకుంటే అనుమతి ఉండదని స్పష్టం చేశారు. వీలైన అన్ని చోట్లా శానిటైజర్లు ఉండాలన్నారు.

పురుషులు, మహిళలు, వృద్ధులు/దివ్యాంగుల కోసం మూడు వేర్వేరు లైన్లు ఉండాలని, వీలైతే వృద్ధులు, దివ్యాంగులు క్యూలో నిల్చునే అవసరం లేకుండా నేరుగా లోపలికి వెళ్ళి ఓటు వేసేలా సౌకర్యం కల్పించాలన్నారు. సోషల్ డిస్టెన్స్ అమలవుతుందో లేదో బూత్ స్థాయి అధికారులు, వాలంటీర్లు గమనిస్తూ ఉండాలన్నారు. ఇంటింటి ప్రచారంచేసే సమయంలోనూ అభ్యర్థితో కలిపి ఐదుగురు మాత్రమే ఉండాలన్నారు. కాన్వాయ్‌లో ప్రతీ వాహనం మధ్య పది మీటర్ల దూరం ఉండాలని, వేర్వేరు పార్టీల అభ్యర్థులు నిర్వహించే రోడ్ షో లాంటి ప్రదర్శనల మధ్య గంట గ్యాప్ ఉండాలన్నారు. భారీ బహిరంగ సభల విషయంలో జనం గుమికూడకుండా పురపాలక శాఖ, పంచాయతీశాఖ అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

ఓట్ల లెక్కింపుకు తొమ్మిది టేబుళ్ళు మాత్రమే ఉండాలని, బ్యాలట్ బాక్సుల్ని ముందుగా శానిటైజర్‌తో శుభ్రం చేయాలని, బ్యాలట్ పేపర్లను మిక్స్ చేసే సిబ్బంది వీలైతే పీపీఈ కిట్లను ధరించాలన్నారు.

Next Story

Most Viewed