క్రికెట్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌కు మరోసారి నిరాశే.?

by  |
క్రికెట్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌కు మరోసారి నిరాశే.?
X

దిశ, వెబ్ డెస్క్ : ఐపీఎల్, టీ20 ప్రపంచ కప్ తర్వాత దేశంలో మళ్లీ క్రికెట్‌ సందడి మొదలు కానుంది. మూడు దేశాల క్రికెట్ జట్లతో టీ20, వన్డేలు, టెస్టు మ్యాచ్‌ల మోత మోగనుంది. స్వదేశంలో వచ్చే ఏడాది ఎనిమిది నెలల్లో టీమిండియా ఆడే అంతర్జాతీయ సిరీస్‌లకు సోమవారం బీసీసీఐ ఆమోద ముద్ర వేసింది. బీసీసీఐ మ్యాచ్‌లు నిర్వహించే నగరాల్లో మరోసారి హైదరాబాద్‌కు నిరాశే మిగిలింది. ఉప్పల్‌ స్టేడియానికి మరోసారి మొండిచెయి ఎదురైంది. సుధీర్ఘ సిరీస్‌లో భాగంగా ఓ టీ20 మ్యాచ్‌కు ఆతిథ్యమిచ్చే అవకాశాన్ని ఈ సంవత్సరం విశాఖపట్నం దక్కించుకుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 18న వెస్టిండీస్‌తో రెండో టీ20 విశాఖలో జరుగుతుంది. భవిష్యత్‌ ప్రణాళికలో భాగంగా ఈ ఏడాది నవంబర్‌ నుంచి 2022 జూన్‌ మధ్యలో సొంతగడ్డపై భారత్‌ 14 టీ20లు, 4 టెస్టులు, 3 వన్డేలు కలిపి మొత్తం 21 మ్యాచ్‌లు ఆడనుంది. కానీ అందులో ఒక్క మ్యాచ్‌కు కూడా హైదరాబాద్‌ను ఎంపిక చేయకపోవడం గమనార్హం.

అంతర్గత కుమ్ములాటలే కారణమా..

మొదటి నుంచి వివాదాలకు కేంద్ర బిందువుగా ఉన్న హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం(హెచ్‌సీఏ)లోని అంతర్గత కుమ్ములాటలే కారణమంటూ క్రికెట్ అభిమానులు, నగరవాసులు హెచ్‌సీఏపై మండి పడుతున్నారు. రెండు వర్గాలుగా చీలిపోయిన హెచ్‌సీఏ పాలకవర్గం విభేదాలతో బీసీసీఐ దగ్గర ఇప్పటికే అబాసుపాలైంది. ఈ ఏడాది ఐపీఎల్‌ 14వ సీజన్‌ మొదటి దశ మ్యాచ్‌ల వేదికల్లోనూ హైదరాబాద్‌కు చోటు దక్కలేదు. ఇక ఇప్పుడు అంతర్జాతీయ మ్యాచ్‌ల విషయంలోనూ నిరాశ తప్పలేదు.

మ్యాచ్‌ల నిర్వహణలో ఎంతో చరిత్ర కలిగిన హైదరాబాద్‌కు ఇప్పుడు ఇలాంటి దుస్థితి.. గడ్డు పరిస్థితులు రావడం రాష్ట్ర క్రికెట్‌ ప్రేమికులకు రుచించట్లేదు. ఇక టెస్టులకు కాన్పూర్‌, ముంబై, బెంగళూరు, మొహాలీ.. పరిమిత ఓవర్ల మ్యాచ్‌లకు జైపూర్‌, రాంచీ, లఖ్‌నవూ, విశాఖ, కోల్‌కత్తా, అహ్మదాబాద్‌, కటక్‌, త్రివేండ్రం, చెన్నై, రాజ్‌కోట్‌, ఢిల్లీ ఆతిథ్యమిస్తాయి. ఈ నగరాల కంటే హైదరాబాద్ అన్ని రకాల వసతులు, సదుపాయాలు కలిగిన ప్రాంతం. అన్ని సౌకర్యాలున్న హైదరాబాద్‌ను కాదని క్రికెట్ ప్రేమికులు తక్కువగా ఉండే విశాఖను ఎంచుకోవడం తెలంగాణ క్రికెట్ అభిమానులకు ఇబ్బందిగా మారింది.

వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్‌ ఉంటుంది. డిసెంబర్ నుంచి జనవరి మధ్యలో టీమిండియా దక్షిణాఫ్రికాలో పర్యటిస్తుంది. ఏప్రిల్ నుంచి ఐపీఎల్ 15 సీజన్ జరిగే అవకాశాలున్నాయి. దీంతో సంవత్సరం పాటు హైదరాబాద్‌లో మ్యాచ్ లు జరిగే అవకాశాలు దాదాపుగా లేనట్లే.

Next Story

Most Viewed