చేనేత కార్మికుల కష్టాలను దూరం చేస్తాం: నిర్మలా

by  |
చేనేత కార్మికుల కష్టాలను దూరం చేస్తాం: నిర్మలా
X

దిశ, ఏపీ బ్యూరో: దేశంలోని ఖాదీ పరిశ్రమను ప్రోత్సాహించడంతోపాటు చేనేత కార్మికులు ఆర్ధికంగా నిలదొక్కుకొనేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా పొందూరులో ఆంధ్రాఫైన్ ఖాదీ కార్మిక అభివృద్ధి సంఘం భవనంలో జరిగిన జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తొలుత నూలు వడుకు యంత్రాలను పరిశీలించిన ఆమె అనంతరం చేనేత కార్మికులతో మాట్లాడారు. అలాగే భవనం ఆవరణలో కొత్తగా నిర్మించిన ఖాదీ కార్మికుల సామూహిక షెడ్‌కు ఆమె శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత వస్త్ర ప్రదర్శనను తిలకించి..ప్రాంగణంలో మొక్కను నాటారు.

అనంతరం ఆమె మాట్లాడుతూ చేనేత కార్మికులు పడుతున్న కష్టాలను దూరం చేసేందుకు కేంద్రప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. దేశవ్యాప్తంగా చేనేత మెగా క్లస్టర్లను ఏర్పాటుచేసి వారిని ప్రోత్సహించేలా చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు. పొందూరు ఖాదీకి ప్రత్యేకత ఉందని..అయితే ఇక్కడ మెగా చేనేత క్లస్టర్ ఏర్పాటు కాకపోవడానికి నేత కార్మికుల సంఖ్య తగ్గడమే అని ఆమె అభిప్రాయపడ్డారు. నేత కార్మికుల సంఖ్యను పెంచుకుని మెగా క్లస్టర్లను ఏర్పాటుచేసుకోవాలని ఆమె సూచించారు. ఈ సందర్భంగా ఆంధ్రాఫైన్ ఖాదీ కార్మిక అభివృద్ధి సంఘానికి రూ.18 లక్షల చెక్కును ఆమె అందజేశారు. అలాగే భవన నిర్మాణానికి చెందిన ధ్రువీకరణ పత్రాలను ఆమె సంఘ ప్రతినిధులకు అందజేశారు. అంతకుముందు విశాఖపోర్టు గెస్ట్‌హౌస్‌లో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ను రాష్ట్ర డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే మాధవ్ తదితరులు మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలోని పలు ఆర్థిక సమస్యలపై చర్చించారు. ఈ పర్యటన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, స్పీకర్ తమ్మినేని సీతారాం, ఎంపీలు రామ్మోహన్ నాయుడు, జీవీఎల్ నరసింహారావు, ఎమ్మెల్సీలు పీవీఎన్ మాధవ్, దువ్వాడ శ్రీనివాస్ ఇతర అధికారులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed