అమాయకులను వేధించకండి.. పోలీసులను కోరిన మంత్రి నిరంజన్ రెడ్డి

by  |
Niranjan Reddy has advised to the police dept dont harass innocents in prevent adulterated seeds
X

దిశ, తెలంగాణ బ్యూరో: కల్తీ విత్తనాలను అరికట్టే విషయంలో అమాయకులను వేధించవద్దని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి పోలీసులకు సూచించారు. శనివారం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ నుంచి రాష్ట్రంలోని పోలీసులు ఉన్నతాధికారులు, వ్యవసాయాధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. విత్తనాల కొనుగోలుకు సంబంధించిన రశీదుపై రైతు సంతకం లేనంత మాత్రాన అవి నకిలీ, నాణ్యతలేని విత్తనాలు కాదని తెలిపారు.

పూర్తి విచారణలు చేపట్టిన తరువాతే 420 కేసులు బుక్ చేయాలని సూచించారు. రైతుల నుంచి సంతకాలను తీసుకోవాలని దుకాణదారులకు అవగాహన కల్పించాలన్నారు. పత్తి విత్తన ప్యాకెట్లలో ఆర్ఐబీ (రెఫ్యూజ్ ఇన్ బ్యాగ్) శాతం మీద 420 కేసులు చేయాల్సిన అవసరం లేదని తెలిపారు. విత్తన ప్యాకెట్లలో 5 నుంచి 10 శాతం వరకు ఆర్ఐబీ ఉండొచ్చని వివరించారు. ప్రతీ దానికి కేసులు నమోదు చేయవద్దని.. సరిదిద్దుకోగలిగిన తప్పుల విషయంలో సంబంధిత దుకాణాదారులకు, విత్తన కంపెనీలకు సరిచేసుకోమని అదేశించాలని చెప్పారు.

సరిదిద్దుకోలేని తప్పుల విషయంలో కచ్చితంగా చర్యలు తీసుకోవాలని, కాలపరిమితి అయిపోయిన విత్తనాలు, హెచ్‌టీ కాటన్ విత్తనాలు, లైసెన్స్‌లేని అమ్మకపుదారుల విషయంలో కేసులు నమోదు చేయాలని సూచించారు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 177 కేసులు నమోదు చేసి 276 మందిని అరెస్ట్ చేయడం జరిగిందని తెలిపారు. తెలంగాణను కల్తీ రహిత విత్తన భాండాగారంగా ఏర్పాటు చేయడమే ప్రభుత్వ ఉద్దేశమని తెలిపారు. టాస్క్ ఫోర్స్ దాడులతో నకిలీ విత్తనాల తయారీదారుల్లో వణుకుపుట్టిందని చెప్పుకొచ్చారు. పదే పదే కల్తీవిత్తనాల విక్రయాలకు పాల్పడుతున్న 32 మందిపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేశామని చెప్పారు.

వీరిలో ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలకు చెందిన వారే ఎక్కవగా ఉన్నారని అన్నారు. పత్తి, మిరప విత్తనాల విషయంలో ప్రధానంగా దృష్టి సారించాలని ఆదేశించారు. లైసెన్స్‌ల జారీని సరళతరం చేసి నూతన విధానాలను అమలు చేస్తామని చెప్పారు. 1966 విత్తనచట్టం నూతన వంగడాలకు తగినట్లు లేదని తెలిపారు. జిల్లాల వారీగా క్షేత్రస్థాయిలో టాస్క్‌ఫోర్స్ దృష్టికి వచ్చిన అంశాలను సమీక్షించి భవిష్యత్ ప్రణాళికలను సిద్దం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డీజీపీ మహేందర్ రెడ్డి.. వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, ఐజీ నాగిరెడ్డి, విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ కేశవులు, అన్ని జిల్లాల ఎస్పీలు, సీపీలు, డీఎస్పీలు, క్షేత్రస్థాయి పోలీసు అధికారులు, జిల్లా వ్యవసాయ అధికారులు, ఏడీఏలు, ఏఓలు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed