ఏపీలో ఏం జరుగుతోంది?.. మాకంతా తెలుసు: సుప్రీం కోర్టు

by  |
supreme court notices to twitter
X

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో మరోసారి చుక్కెదురైంది. ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ను కొనసాగించాలన్న హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించాలంటూ సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్ విచారణకు వచ్చింది. అయితే ఈ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బోబ్డే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం.. హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. హైకోర్టు ఉత్తర్వులను యధావిధంగా అమలు చేయాలని ఆదేశించింది.

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేశ్ ను కొనసాగించాలని ఆదేశిస్తూ త్రిసభ్య ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేసు విషయంలో చోటుచేసుకుంటున్న ప్రతి అంశం తమకు తెలుసని స్పష్టం చేసింది. హైకోర్టు ఆదేశించినా… గవర్నర్ లేక పంపినా పోస్టింగ్ ఇవ్వకపోవడాన్ని ధర్మాసనం తీవ్రంగా పరిగణించింది. గవర్నర్ ఆదేశాలు ఎందుకు అమలు చేయలేదని ప్రభుత్వాన్ని ధర్మాసనం సూటిగా ప్రశ్నించింది. గవర్నర్ ఆదేశించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని ప్రశ్నించింది.

అసలు ఆంధ్రప్రదేశ్‌లో ఏం జరుగుతోందని నిలదీసింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టకుండా స్టే ఇవ్వాల్సిన అవసరం కనిపించడం లేదని స్పష్టం చేసింది. అందుకే ఈ విషయంలో ధర్మాసనం స్టే ఇవ్వడం లేదని తెలిపింది. అంతే కాకుండా వచ్చే శుక్రవారం లోపు నిమ్మగడ్డ రమేష్ కుమార్‌కు పదవీ బాధ్యతలు అప్పగించాలని గడువు విధించింది. దీంతో సుప్రీంకోర్టులో వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి ఊహించని షాక్ తగిలింది. ఇంతకాలం వైఎస్సార్సీపీ నేతలు చేస్తున్న వాదనలు వీగిపోయినట్టైంది.

కాగా, వివాదం వివరాల్లోకి వెళ్తే… స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ విచక్షణాధికారాలతో నిర్ణయం తీసుకోవడంతో వివాదం రాజుకుంది. దీనిని తీవ్రంగా పరిగణించిన రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ నిర్ణయంతో ఆయనను పదవి నుంచి తప్పించి జస్టిస్ కనగరాజ్‌ను ఎస్ఈసీగా నియమించింది. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ ఆయన విజయం సాధించడంతో ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇంతలో ఆయన మరోసారి హైకోర్టును ఆశ్రయించడంతో గవర్నర్‌ను కలవాలని సూచించింది. ఆయన గవర్నర్‌ను కలవడంతో ఆయన నిమ్మగడ్డకు పదవీ బాధ్యతలు అప్పగించాలని సూచించింది. అయితే వివాదం సుప్రీంకోర్టులో ఉందన్న సుప్రీంకోర్టు ఆయనకు బాధ్యతలు అప్పగించకపోడంతో సుప్రీంతీర్పు ఇచ్చింది.

Next Story