డ్రగ్స్ కేసులో అనూహ్య ట్విస్ట్.. ఈడీ చేతిలో వారి గుట్టు..!

by  |
Drugs case
X

దిశ, ప్రత్యేక ప్రతినిధి : టాలీవుడ్ ​డ్రగ్​ కేసులో కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ (ఈడీ)​లోతైన దర్యాప్తు సినీతారల వెన్నులో చలిపుట్టిస్తున్నది. డ్రగ్​ స్మగ్లర్​లు ఈడీకి అప్రూవర్​గా మారి జాతకాల చిట్టా విప్పుతుండటంతో కేసు రోజు రోజుకు ఝఠిలమవుతున్నది. తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖుల గుట్టు‌ను కింగ్ పిన్ కెల్విన్ రట్టు చేయడంతో ఈడీ అధికారులు తమ పట్టు బిగిస్తున్నారు. డ్రగ్ సరఫరాలో కింగ్ పిన్‌గా ఉన్న స్మగ్లర్ ​కెల్విన్, నైజీరియాకు చెందిన పీటర్​ కమింగ, అప్రూవర్​గా మారి మొత్తం జాతకాలను బయటపెట్టినట్లు సమాచారం. సినీ తారల‌కు సంబంధించిన సమాచారాన్ని కెల్విన్, ఐటీ, విద్యాసంస్థలకు డ్రగ్స్​ ఏ విధంగా సరఫరా చేసిన విషయాన్ని పీటర్​ వెల్లడించినట్లు తెలిసింది. స్మగ్లర్లు, సరఫరాదారులు ఈడీకి అప్రూవర్​గా మారిన క్రమంలో మరిన్ని కొత్త లింకులు బయటపడే ఆస్కారమున్నది.

టాలీవుడ్​లో ఇంకొందరి పెద్దల గుట్టు బయటపడనున్నదనే ప్రచారం కలకలం సృష్టిస్తున్నది. అసలు తెలంగాణ ఆబ్కారీ అధికారులు విచారించిన వారి జాబితాలో లేని దగ్గుబాటి రానా, రకుల్​ప్రీత్​సింగ్​ల పేర్లు అకస్మాత్తుగా తెరపైకి రావడానికి అప్రూవర్లు ఇచ్చిన తాజా వివరాలే కారణమని చెబుతున్నారు. వాస్తవానికి కింగ్ పిన్ కెల్విన్ కు చెందిన మూడు అకౌంట్ లను ఈడీ అధికారులు సీజ్ చేశారు. అకౌంట్లో లావాదేవీలు ఆధారంగా ఈడీ దర్యాప్తు కొనసాగిస్తున్నది. ఆ అకౌంట్లలో సినీ తారల లావాదేవీల గుట్టు మొత్తం ఉంది. అకౌంట్ల ఆధారంగానే పూరి పై ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. కెల్విన్ అకౌంట్లోకి నిధులు ఎలా వచ్చాయని గుచ్చి గుచ్చి ప్రశ్నించినట్లు సమాచారం.

ఈ అకౌంట్‌ల లావాదేవీల ఆధారంగా రానా, రకుల్​ప్రీత్​సింగ్​ల‌ను విచారణకు రావాలని సమన్లు జారీ చేసినట్లు స్పష్టమవుతున్నది. వాస్తవానికి గురువారం సినీ నటి ఛార్మి ఈడీ ఎదుట హాజరుకానుండగా ఈనెల 6న రకుల్​ప్రీత్​సింగ్​, 8న దగ్గుబాటి రానా విచారణను ఎదుర్కోనున్నారు. దగ్గుబాటి రానా, రకుల్​ప్రీత్ సింగ్​లకు టాలీవుడ్​తో పాటు బాలీవుడ్​తో ఉన్న లింక్​లపై ఆరాతీయనున్నట్లు ప్రచారం జరుగుతున్నది.

వెన్నులో వణుకు పుట్టిస్తున్న విచారణ తీరు..

వాస్తవానికి డ్రగ్స్​ కేసులో జరిగిన ఆర్థిక లావాదేవీలపై ఈడీ వివరాలను సేకరించి పంపవచ్చని భావించారు. కానీ మంగళవారం ఈడీ అధికారులు ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్​ను దాదాపు పదిగంటలపాటు విచారించడం సినీతారలకు చెమటలు పట్టిస్తున్నది. ఈడీ దర్యాప్తు ఆషమాషీగా లేదని, పూరీ విషయంలో స్పష్టమైంది. ఆర్థిక లావాదేవీలే కాకుండా ఈడీ అసలు మూలాలను కదిలిస్తున్నదని స్పష్టమైంది. పూరీ జగన్నాథ్​ ఖాతాలను క్షుణ్ణంగా పరిశీలించిన ఈడీ అధికారులు గోవా, మలేషియాతో పాటు దక్షిణాఫ్రికా వరకు తరలిన ప్రతీ పైసాపై పక్కా లెక్కలను అడిగి ఉక్కిరి బిక్కిరి చేసింది. పూరీ సమాధానలతో సంతృప్తి చెందని ఈడీ మరో సారి విచారణకు అందుబాటులో ఉండాలని ఆదేశించడం గమనించదగ్గ విషయం.

గతంలో తెలంగాణ ఆబ్కారీ విచారణను ఎదుర్కొన్న సినీనటి చార్మిని గురువారం ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. పూరి జగన్నాథ్‌తో పాటు ఛార్మి లావాదేవీలు జరిపినట్లు కెల్విన్ అకౌంట్లలో ఆధారం ఉన్నట్లు తెలుస్తున్నది. డ్రగ్స్​ సరఫరా దారులకు డబ్బులనిచ్చారా… ఇస్తే ఏ ఖాతాల నుంచి ఎవరెవరికి వాటిని మళ్లించారనే విషయాలను విచారించనున్నారు. తెలంగాణలో 2017లో వెలుగుచూసిన మాదకద్రవ్యాల కేసులో లక్షల రూపాయలు విదేశాలకు చేరాయనే విషయంపై ప్రధానంగా ఆరాతీస్తున్న ఈడీ ఇతర విషయాలపై కూడా కూపీ లాగడం సినీతారలకు సంకటంగా మారింది.

Next Story