తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పులు.. సీనియర్ నేతల్లో కల్లోలం!

by  |
TRS,-CONGRESS,-BJP
X

దిశ, తెలంగాణ బ్యూరో: పాత తరం నేతలు, రాజకీయ కురువృద్ధులు, వారి బంధువులతో నిండిన రాష్ట్ర రాజకీయాల్లో కొత్తదనం చోటుచేసుకుంటోంది. ఓవైపు అధికార పార్టీలో కేటీఆర్ టీం సిద్ధమవుతుంటే.. అధికార టీఆర్‌ఎస్‌కు, ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌కు చెక్ పెట్టేలా ప్రతిపక్షాల రాజకీయాలు ఊపందుకున్నాయి. ఇప్పటి వరకు సభలు, సమావేశాలు, కార్యక్రమాలు ఏవైనా ముందుండి నడిపించే సీనియర్లు ఇప్పుడు వెనక వరుసలో ఉంటున్నారు. రాష్ట్ర రాజకీయాలు ప్రక్షాళన జరుగుతున్నాయనే పరిణామాలకు అవుననే సమాధానాలు ఇస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్‌లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. అటు బీజేపీలోనూ అంతే. ఇటీవల టీపీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి నిర్వహించిన సభలు, నిరసనల్లో నయా టీం కీలకంగా వ్యవహరించింది. అటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన పాదయాత్రలో కూడా సీనియర్లు గెస్ట్ రోల్‌కే పరిమితమవుతున్నారు. ఇక టీఆర్‌ఎస్‌లో కూడా కొత్తతరం నేతలకు అవకాశాలు ఇవ్వాలనే అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతున్నాయి. దీనిలో భాగంగా జిల్లా కమిటీల్లో కేటీఆర్ వర్గీయులకు పెద్దపీట వేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్ర కేబినెట్‌లో కూడా కేసీఆర్ ముద్ర కంటే.. కేటీఆర్ చలువతో పదవులు దక్కినవారే ఎక్కువ.

నామినేటెడ్​నుంచి జిల్లా కమిటీల దాకా..!

అధికార టీఆర్‌ఎస్ పార్టీలో ఇటీవల జరుగుతున్న పరిణామాల్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బృందానికే ఎక్కువ అవకాశాలిస్తున్నారు. అంతేకాకుండా కార్పొరేషన్​పదవుల్లో కూడా ఆయన మార్క్​స్టష్టమవుతోంది. కొంతకాలం ఏర్పాటు చేసిన టీఎస్ పీఎస్సీలో ఒకటీ, రెండు తప్ప మిగిలిన మెంబర్ల నియామకంలో కేటీఆర్‌తో పాటు మరో నేత ఖరారు చేసినట్లు పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. అటు మంత్రివర్గంలో పువ్వాడ అజయ్, శ్రీనివాస్​గౌడ్, మల్లారెడ్డి, గంగుల కమలాకర్​వంటి వారికి అవకాశం ఇప్పించింది కేటీఆర్​అని ఇప్పటికే ప్రచారం. దీనికి తోడుగా ప్రస్తుతం జరుగుతున్న జిల్లా కమిటీలు, జిల్లా ఇన్ చార్జీలను కూడా ఆయనే ఖరారు చేస్తున్నారని, జాబితా సైతం రూపొందించారనే ప్రచారం జరుగుతోంది. పలు నామినేటేడ్​ పోస్టులను కూడా మంత్రి కేటీఆర్​సూచనలతోనే ఖరారు చేయనున్నట్లు టాక్. ఉద్యమకాలం, అంతకుముందు నుంచి కేసీఆర్ వెంట నడిచిన సీనియర్లకు కేటీఆర్​టీం అడ్డుకట్ట వేస్తుందనే అభిప్రాయాలు పార్టీలోనే వ్యక్తమవుతున్నాయి.

కాంగ్రెస్‌లో రేవంత్ టీం

ఇక రాష్ట్ర కాంగ్రెస్‌లో సంస్థాగతంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయని తెలుస్తున్నదే. ఇప్పటికే దళిత, గిరిజన దండోరా సభల నిర్వహణ అంటూ రేవంత్​ వర్గానికి చెందిన నేతలకు అవకాశం ఇచ్చారు. మరోవైపు కాంగ్రెస్​ కండువా కప్పుకున్నప్పటి నుంచి సీతక్క, పెద్దపల్లి విజయరమణారావు, వేం నరేందర్​రెడ్డితో పాటు పలువురు నేతల ప్రాధాన్యం పెరిగింది. కొంతకాలం కిందట వరకు సైలెంట్‌గా ఉన్న కొండా దంపతులు మళ్లీ కాంగ్రెస్‌లో చక్రం తిప్పుతున్నారు. ఇటీవల గజ్వేల్ సభను సీనియర్లు వద్దంటూ ఆపే ప్రయత్నాలు చేశారు. వద్దని చెప్పిన కొంతమంది నేతలు కూడా గైర్హాజరయ్యారు. అయినా సభను నిర్వహించి విజయవంతం చేశారు. ఇదే సమయంలో కాంగ్రెస్​ అంటే మేమే అన్నట్టుగా ఉండే ఉత్తమ్, జానా, కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి, రాజగోపాల్​రెడ్డి, వీహెచ్, చిన్నారెడ్డి, మధుయాష్కీ​వంటి నేతలు ప్రధానంగా కనిపించలేదు. తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడం, వచ్చే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావాలంటే రేవంత్​ తన వర్గాన్ని పెంచుకుంటానని అధిష్టానం దగ్గరే హామీ తీసుకున్నట్లు పార్టీ నేతలే చెప్పుతున్నారు. అందుకే సీనియర్లు అసంతృప్తితో ఉన్నా.. అప్పుడప్పుడు వ్యతిరేక విమర్శలు చేస్తున్నా రేవంత్​కార్యక్రమాలను ఆపడం లేదు. తాజాగా ప్రజా సంఘాలను ఒక్కతాటిపైకి తీసుకురావడంలో కూడా సక్సెస్​సాధించారు. పార్టీ సీనియర్లు, కొత్త తరం, సామాజిక సమతుల్యత వంటి వాటికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారనే చర్చ. రాష్ట్రంలో కురువృద్ధులుగా ఉన్న వారిని జాతీయ రాజకీయనేతలుగా అందలం ఎక్కిస్తూనే రాష్ట్ర రాజకీయాలకు వ్యూహాత్మకంగా దూరం చేస్తున్నారని, దీంతో రాష్ట్ర కాంగ్రెస్‌లో యువ రక్తం నింపుతారని స్పష్టమైన సంకేతాలు వస్తున్నాయి.

బీజేపీలో నయా ట్రెండ్

మరోవైపు బీజేపీలో సైతం కొత్త ముఖాలు కీలకంగా మారుతున్నాయి. బండి సంజయ్​ప్రజా సంగ్రామ యాత్రలో సీనియర్లు కనుచూపుమేర కూడా కనిపించడం లేదు. పాదయాత్ర రూట్​మ్యాప్ నుంచి మొదలుకుని రాత్రి భోజనాల వరకు సంజయ్​కొత్త నేతలకు బాధ్యతలిస్తున్నారు. ఒకవేళ సీనియర్లు వచ్చినా.. నాలుగడుగులు వేసి వెనక్కి వెళ్లిపోతున్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని కూడా సంజయ్​పక్కన పెడుతున్నారని పార్టీ నేతల్లోనే చర్చ జరుగుతోంది. అంతేకాకుండా పార్టీ కార్యాలయానికి వచ్చేవారి కంటే బండి వెనక ఉండేవాళ్లే ఎక్కువవుతున్నారు. బండి పాదయాత్రను బీజేపీ జాతీయ నేతలు అరుణ్​సింగ్, తరుణ్ చుగ్​ప్రారంభం చేయగా.. రాజాసింగ్, ఎంపీలు అరవింద్, సోయం బాబూరావు, మునుస్వామి, ఎమ్మెల్యే రఘునందన్‌ రావు, పార్టీ నేతలు విజయశాంతి, వివేక్‌ వెంకటస్వామి, నల్లు ఇంద్రసేనారెడ్డి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, స్వామిగౌడ్, మనోహర్‌రెడ్డి, దుగ్యాల ప్రదీప్‌కుమార్, ప్రేమేందర్‌రెడ్డి, బంగారు శ్రుతి, ఎస్‌.కుమార్, మంత్రి శ్రీనివాసులు వంటి నేతలు ఒకటి, రెండు రోజులు కలిసి నడిచారు. అయితే జిల్లాల వారిగా చూస్తే మాత్రం కొత్త నేతలు ప్రతిరోజూ వెంట నడుస్తున్నారు. అయితే తెలంగాణ నేతలను కాకుండా.. ఈ యాత్రకు కేంద్ర నాయ‌క‌త్వం తరుపున కొంతమంది నేతలను రంగంలోకి దింపుతున్నారు. ఇత‌ర రాష్ట్రాల్లోని బీజేపీలో కీల‌క‌మైన నేత‌ల‌ను సంజ‌య్‌కు మ‌ద్దతుగా దించుతున్నారు. ఇక్కడకు వచ్చినవారంతా వ‌స్తూనే సంజయ్‌ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. పాద‌యాత్రతో మార్పు వ‌స్తుంద‌ని, సీఎం కేసీఆర్‌పై విమర్శలు చేస్తూ దీన్ని జాతీయ టాపిక్‌గా చేస్తున్నారు. ఇప్పటికే మ‌హారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫ‌డ్నవీస్, ఛత్తీస్ ఘ‌డ్ మాజీ సీఎం రమణ్ సింగ్, కర్ణాటక బీజేపీ ఎంపీ శోభాకరంద్లాజే పాద‌యాత్రకు క‌లిసి వ‌చ్చారు. దీంతో బండి సంజయ్​ వ్యూహాత్మకంగానే రాష్ట్ర నేతలకు చెక్​పెట్టినట్లు తేటతెల్లమవుతోంది.


Next Story

Most Viewed