ధరణి రిజిస్ట్రేషన్లు.. డబుల్​.. ట్రిపుల్​

by  |
ధరణి రిజిస్ట్రేషన్లు.. డబుల్​.. ట్రిపుల్​
X

దిశ, తెలంగాణ బ్యూరో: ‘ధరణి’​లో రోజురోజుకూ కొత్త లోపాలు బయటపడుతున్నాయి. భూ రికార్డుల ప్రక్షాళనలో వెలుగుచూసిన పొరపాట్లను సరిదిద్దకుండా డేటాను యథాతథంగా పోర్టల్​లో అప్​లోడ్ చేయడంతో సమస్యలు పెరుగుతున్నాయి. లేఅవుట్లలో ప్లాట్లుగా మారినవాటిని కూడా సాగు భూములుగానే నమోదు చేశారు. కొత్త చట్టం ప్రకారం తహసీల్దార్లు సాగు భూముల రిజిస్ట్రేషన్లను కొనసాగిస్తున్నారు. 23వ తేదీ నుంచి వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లను ఆరంభించనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ధరణి పోర్టల్​లోనే సాగు భూములు, నివాస స్థలాలకు వేర్వేరు ప్లాట్ ఫారాలపై లావాదేవీలు నడుస్తాయి. ఈ క్రమంలో ఒకే భూమికి సమాంతరంగా వేర్వేరు రూపాలలో రిజిస్ట్రేషన్లు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే చాలా మంది ఒకే స్థలంపై వేర్వేరుగా హక్కుల పత్రాలు కలిగి ఉన్నారు. వేలాది మంది దగ్గర సాగు భూముల ప్లాట్లకు సంబంధించిన సేల్ డీడ్లు ఉన్నాయి. హెచ్ఎండీఏ పరిధిలో అక్రమ లేఅవుట్లకు సంబంధించిన భూములపై లక్షల సంఖ్యలో లావాదేవీలు జరిగాయి. రెవెన్యూ రికార్డుల్లో వాటిని ప్లాట్లుగా మార్చలేదు. భూములను అమ్మేసుకున్నవారి పేర్లనే పట్టాదారు కాలమ్​లో నమోదు చేశారు. పాస్​ పుస్తకాలు జారీ అయ్యాయి. పహాణీలు, 1-బి రికార్డుల్లో నమోదయ్యాయి. రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, వికారాబాద్ జిల్లాల్లో ‘ధరణి’ సాగులో ప్లాట్లు ఉన్నట్లు రెవెన్యూ అధికారులు కూడా గుర్తించారు. సాగు భూములు దశాబ్దం క్రితమే ప్లాట్లుగా మారాయి. రియల్టర్లు ఎప్పడో అమ్మేశారు. కొనుగోలు చేసినవారు రీ సేల్ కూడా చేశారు. కొన్ని ప్లాట్లు మూడు, నాలుగు సార్లు కూడా చేతులు మారాయి. అలాంటి స్థలాలు కూడా సాగు భూములుగానే రికార్డు చేశారు. వీటిపై స్పష్టత ఇవ్వకపోతే రానున్న రోజుల్లో సమాంతర రిజిస్ట్రేషన్లు కొనసాగుతాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

వేర్వేరు ఈసీలు

సర్వే నంబర్లు, గ్రామాలు ఒక్కటైనా ఎన్​కంబరెన్స్ వివరాలు వేర్వేరుగా ఉంటున్నాయి. సాగు భూముల కేటగిరీలో కొనసాగిస్తే ఒక మాదిరిగా, ప్లాట్లుగా కొనుగోలు చేస్తే ఇంకోమాదిరిగా వివరాలు బయటికొస్తున్నాయి. ఇప్పుడు వేర్వేరుగా లావాదేవీలు నిర్వహించే వేదికలను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో వాటి లావాదేవీలు ఆగే ప్రసక్తి లేదు. ధరణిలో నమోదైన జాబితా ప్రకారం సాగు భూములుగా తహసీల్దార్లు గుర్తించడం తప్పనిసరి. సేల్ డీడ్, ఈసీ కాపీ ఆధారంగా ప్లాట్లను సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్​ చేస్తారు. ఈ క్రమంలో ప్లాట్లు కొనుగోలు చేసిన యజమానుల హక్కులు ప్రశ్నార్ధకంగా మారనున్నాయి. స్టాంపు డ్యూటీ కట్టి, అమ్మిన వ్యక్తికి రూ.లక్షలు పోసినా వారి హక్కులకు భంగం కలుగుతోంది. సేల్ డీడ్లు చిత్తు కాగితాలుగా మారుతున్నాయి. సరి చేయకపోతే చిక్కుముడులు పెరిగే అవకాశాలు ఉన్నాయని రియల్టర్లు చెబుతున్నారు.

ఎన్నెన్నో వింతలు

ఘట్‌కేసర్‌ మండలం అంకుషాపూర్‌లో సర్వే నం.127లో 18.33 ఎ, 130లో 17.20 ఎ, 131లో 17.09 ఎ, 132లో 17.14 ఎకరాల వంతున 70.36 ఎకరాల భూమి ఉంది. సేల్‌డీడ్ల ప్రకారం చూస్తే 73.30 ఎకరాలను విక్రయించినట్లుగా తెలుస్తోంది. చాలా భూములను 30 ఏండ్ల క్రితమే లేఅవుట్లు చేసి అమ్మారు. వాటినే మళ్లీ సాగు భూములుగా విక్రయించినట్లు ఆధారాలు ఉన్నాయి. కొండాపూర్‌లో సర్వే నం.96, 97, 112, 113ల్లో 1990 కాలంలోనే లేఅవుట్లు చేసి విక్రయించారు. పట్టాదారులు చనిపోయిన తర్వాత వారి వారసులు పాస్​ పుస్తకాలు సంపాదించి మరోసారి భూములను విక్రయించారన్న ఆరోపణలు ఉన్నాయి. సర్వే నం.14, 15, 16, 17, 18లలోని చాలా భూములు లేఅవుట్లుగా మారాయి. వీటిలో చాలా వరకు ‘ధరణి’ పోర్టల్​లో సాగు భూములుగా నమోదయ్యాయి. మరోచోట తొలుత లేఅవుట్‌ చేసి ప్లాట్లు అమ్మేశారు. పట్టాదారులు దానినే తిరిగి వ్యవసాయ భూమిగా విక్రయించారు. తొలుత లేఅవుట్‌ చేసిన యజమానులు మళ్లీ విక్రయించేందుకు వెళ్తే సేల్‌డీడ్‌ చేయడం లేదు. వ్యవసాయ భూమిగా మాత్రం రిజిస్ట్రేషన్‌ చేశారు. కొనుగోలు చేసిన వ్యక్తులకు హెచ్‌ఎండీఏ అనుమతి ఉంది. దీతో మొదటి లేఅవుట్‌లో కొనుగోలు చేసిన ప్లాట్ల యజమానులు కోర్టును ఆశ్రయించారు. అవుషాపూర్‌లోనూ చాలా భూముల పరిస్థితి ఇలాగే ఉంది. రియల్టర్లు, బ్రోకర్ల దగ్గర మొదట చేసి ప్లాట్లను విక్రయించిన లేఅవుట్‌ మాత్రమే చెలామణిలో ఉన్నది. ఘట్ కేసర్ మండలంలోని పలు గ్రామాలలో ప్లాట్లుగా చేసి విక్రయించిన భూములనే కొందరు పెద్దలు కొనుగోలు చేశారు. అక్కడే విద్యా సంస్థలు, ఫంక్షన్ హాళ్లు నెలకొల్పారన్న ఆరోపణలు ఉన్నాయి. యాదాద్రి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం రాచకొండలోనూ వేలాది ఎకరాలలో ప్లాట్లు చేశారు. ఓ బడా సంస్థ గుట్టలను కూడా పేపరుపై లేఅవుట్​గా చూపించి అమ్మేసింది. వెబ్​సైట్ లో చిత్ర విచిత్రాలను చూపించి ప్లాట్లను 15 ఏండ్ల క్రితమే విక్రయించారు. ఇప్పుడా భూములకూ పట్టాదారు పాస్​ పుస్తకాలు జారీ అయ్యాయి. దాని ఆధారంగా చేసుకొని సాగు భూముల అమ్మకాలు జరిగినట్లు విశ్వసనీయంగా తెలిసింది. కీసర, మేడ్చల్ మండలాలలోనూ భూములను ప్లాట్లుగా అమ్మేశారు. ఊరికి దూరంగా, ఎలాంటి సౌకర్యాలు లేకపోవడంతో ఎవరూ ఇండ్లు కట్టుకోలేదు. దశాబ్దాలుగా ఖాళీగా ఉన్నాయి. దీన్ని ఆసరాగా చేసుకొని మళ్లీ సాగు భూములుగా అమ్మే వెసులుబాటు లభించింది.

పెద్దలే కొనుగోలుదార్లు

రెవెన్యూ రికార్డులలో మ్యూటేషన్ చేయకపోవడంతో అక్రమ దందాకు దారిపడుతోంది. స్థానిక నాయకులు ఇందుకు తోడ్పాటునందిస్తున్నారు. అమ్మేశారన్న సమాచారం తెలిసే తక్కువ ధరకు మళ్లీ కొంటున్నారు. అలా ప్లాట్లను సాగు భూములుగా కొనుగోలు చేసినవారిలో ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారని తెలిసింది. గ్రామాల్లో కొందరు ఇదే దందాను కొనసాగిస్తున్నట్లు సమాచారం. దశాబ్దాల క్రితం వెంచర్లు వేసినా, పట్టాదారులను గుర్తించే పనిలో పడ్డారు. వారి చేతిలో కొంత మొత్తం పెట్టేసి రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. ‘ధరణి’ రికార్డుల్లో మార్పులు చేయకపోతే ఈ వ్యవహారం రానున్న రోజుల్లో మరిన్ని కష్టాలు తెచ్చి పెట్టే అవకాశముందనే ఆందోళన వ్యక్తం అవుతోంది. సేల్ డీడ్ కలిగిన వారికి హక్కులు కల్పించకపోతే కోర్టుకు వెళ్లే ప్రమాదం ఉన్నది. డబుల్ రిజిస్ట్రేషన్లతోపాటు రెండో సారి లేఅవుట్లు వేసి అమ్మిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోకపోతే ఈ అవినీతి దందా యథేచ్ఛగా కొనసాగేందుకు ‘ధరణి’ పోర్టల్ సహకరించేటట్లు కనిపిస్తోంది.

Next Story