అమిత్ షా సభ తర్వాత బీజేపీలో మొదలైన వింత రగడ..

by  |
అమిత్ షా సభ తర్వాత బీజేపీలో మొదలైన వింత రగడ..
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ నియోజక వర్గం బీజేపీలో సరికొత్త రాజకీయ సమీకరణాలు మొదలయ్యాయి.. ఇందుకు ఇటీవల నిర్మల్ లో నిర్వహించిన అమిత్ షా సభ వేదికగా మారింది.. ఇప్పటి వరకు ఆదిలాబాద్ నియోజకవర్గంలో తిరుగులేని నాయకుడిగా ఉన్న పాయల్ శంకర్ కు కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. పార్టీలో ఆయనకు పొగ పెడుతున్నారనే చర్చ సాగుతుండగా.. తాజాగా పాయల్కు పోటీగా ఐటీ కంపెనీ అధినేత కంది శ్రీనివాసరెడ్డి తెరపైకి రావటంతో సమీకరణాలు మారుతున్నాయి.. ఎంతో కాలంగా పార్టీ కోసం పని చేస్తున్న తనకు గుర్తింపు రావటం లేదని అసంతృప్తితో ఉన్న పాయల్.. తాజాగా ఫ్లెక్సీల్లో తన ఫోటో లేకపోవటంతో అలక బూనారు. దీంతో బీజేపీ తెలంగాణ ఇంచార్జి తరుణ్ చుగ్ ఆదిలాబాద్ వచ్చి బుజ్జగించినట్లు తెలిసింది.

ఆదిలాబాద్ నియోజకవర్గ బీజేపీ రాజకీయాల్లో సరికొత్త సమీకరణాలు నెలకొంటున్నాయి. ఇప్పటి వరకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ మాట చెల్లుబాటుకాగా.. మూడు సార్లు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2012 ఉప ఎన్నికల్లో టీడీపీ నుంచి, 2014, 2018లో బీజేపీ నుంచి రెండు సార్లు పోటీ చేసి ఓటమి చవి చూశారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకు చెక్ పెట్టేందుకు మరో యువ నాయకుడిని రంగంలోకి దింపుతున్నట్లు తెలుస్తోంది. ఐటీ కంపెనీ అధినేత, ఎన్ఆర్ఐ కంది శ్రీనివాసరెడ్డి వచ్చే ఎన్నికల్లో ఆదిలాబాద్ నియోజకవర్గంలో బీజేపీ నుంచి బరిలోకి దిగేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలిసింది. కేంద్ర నాయకత్వంతో మంచి సంబంధాలు ఉండటంతో.. ఆయనకే టికెట్ వస్తుందనే చర్చ సాగుతోంది. ఇప్పటికే ఓ యూట్యూబ్ చానెల్, వెబ్సైట్ కూడా ఏర్పాటు చేశారు. దీంతో వచ్చే ఎన్నికల్లో పాయల్ శంకర్కు బీజేపీ టికెట్ ఇస్తుందా.. లేదా.. ఆయన భవితవ్యం ఏంటనే ప్రశ్న తలెత్తుతోంది.

ఈ నెల 17న నిర్మల్ పట్టణంలో అమిత్ షా పర్యటించగా.. స్వాగతం పలుకుతూ ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఎన్ఆర్ఐ శ్రీనివాసరెడ్డి ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఇందులో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఎంపీ సోయం బాపురావు ఫోటోలు పెట్టగా.. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ ఫోటోలు లేకపోవటంతో వివాదం మొదలైంది. ఈ ఫ్లెక్సీలను కొందరు చించివేయగా.. ఇది పాయల్ అనుచరులు చేశారనే ప్రచారం సాగింది. తాను పార్టీ కోసం భారీగా డబ్బులు ఖర్చు పెట్టి.. కష్టపడి పని చేస్తుంటే తనకు పార్టీలో తగిన గుర్తింపు ఉండటం లేదనే అసంతృప్తితో పాయల్ శంకర్ ఉన్నారు. తాజాగా ఫ్లెక్సీలో ఫోటో లేకపోవటంతో మరింత ఆజ్యం పోసింది. దీంతో ఆయన అలక బూనగా.. ఒక దశలో రాజీనామా చేస్తానని చెప్పటంతో అధిష్టానం రంగంలోకి దిగింది. బీజేపీ రాష్ట్ర ఇంచార్జి తరుణ్ చుగ్ ఆదిలాబాద్ వచ్చి ఆయనను బుజ్జగించినట్లు తెలిసింది. ఇక ఫ్లెక్సీ వివాదం ఇంతటితో ముగిసినట్టేనా.. పెట్టిన వారిపై, చించిన వారిపై చర్యలుంటాయా.. లేదా.. అనేది చూడాలి.

పాయల్ శంకర్ మొదటి నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే జోగు రామన్నతో సత్సంబంధాలు కలిగి ఉన్నారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. గత మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ జెండా మోసి పని చేసిన కార్యకర్తలకు కాకుండా.. తన సొంత మనుషులు, అసలు పార్టీలో సభ్యత్వం లేని వారికి టికెట్లు ఇచ్చి పార్టీ పాయల్ ఓటమికి కారణమయ్యారనే విమర్శలున్నాయి. రామన్న కుమారుడు మున్సిపల్ ఛైర్మన్ అయ్యేందుకు పరోక్షంగా సహకరించారనే ఆరోపణలున్నాయి. ఆయన జిల్లా అధ్యక్ష పగ్గాలు చేపట్టాక.. జిల్లాలో పార్టీ రెండుగా చీలిపోయింది. దశాబ్దాల నుంచి ఉన్న ప్రపుల్ కుమార్ పార్టీకి రాజీనామా చేసి టిఆర్ఎస్ పార్టీలో చేరాడు. పార్టీ నాయకురాలు సుహాసిని రెడ్డి, మరికొంత మంది సీనియర్లు పలుమార్లు రాష్ట్ర, జాతీయ నాయకులకు శంకరుపై ఫిర్యాదులు చేసినట్లు తెలుస్తున్నది. పాయల్ నాయకత్వంపై ఇటు క్యాడర్, అటు లీడర్లు అసంతృప్తితో ఉండగా.. కొత్తగా కంది శ్రీనివాసరెడ్డి రాకతో రాజకీయ సమీకరణాలు మారే అవకాశాలున్నాయి.

Next Story

Most Viewed