కరోనా పరీక్షలకు కొత్త యంత్రాలు

by  |
కరోనా పరీక్షలకు కొత్త యంత్రాలు
X

దిశ, న్యూస్ బ్యూరో: దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటం, ఇతర రాష్ట్రాల నుంచి వలస కార్మికులు పెద్ద సంఖ్యలో రాష్ట్రానికి రావడానికి సిద్ధపడుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కొత్త వైద్య పరికరాలను సిద్ధం చేసుకుంటోంది. ఇందుకు స్విట్జర్లాండ్‌కు నుంచి ‘కోబాస్ 8800, కోబాస్ 6800’ కరోనా టెస్టింగ్ మెషీన్లను కొనుగోలు చేసేందుకు వైద్యారోగ్య శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల చివరికల్లా ఈ మూడు కొత్త యంత్రాలు రాష్ట్రానికి చేరనున్నాయి. వాటిని ఇన్‌స్టాల్ చేసిన తర్వాత వచ్చే నెల రెండో వారం నుంచి పనిచేయడం ప్రారంభిస్తాయి. ప్రస్తుతం వివిధ జిల్లా ఆసుపత్రుల్లో ఉన్న ‘ట్రూనాట్’, ‘జెన్ ఎక్స్‌పర్ట్ సీబీనాట్’ మెషీన్ల ద్వారా పరీక్షలు చేయడానికి అవసరమైన అనుబంధ పరికరాలను కూడా సమకూర్చుకుంటున్నారు.

కొత్త యంత్రాలతో అదనంగా పరీక్షలు..

ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఎనిమిది లేబొరేటరీలతోపాటు కేంద్ర ప్రభుత్వానికి చెందిన సీసీఎంబీ కూడా కరోనా నిర్ధారణ పరీక్షలకు సిద్ధంగా ఉన్నాయి. వీటన్నింటి సామర్థ్యం రోజుకు 1540 మాత్రమే. ఒకవేళ కరోనా కేసులు పెరిగితే ఒకే రోజులో వీలైనన్ని ఎక్కవ పరీక్షలు చేసేందుకు స్విట్జర్లాండ్ దేశం నుంచి కోబాస్ 6800, కోబాస్ 8800 మిషీన్లు తెప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో కోబాస్ 6800 ద్వారా ప్రతి నాలుగు గంటలకు కనీసంగా 1500 పరీక్షలు, కోబాస్ 8800 యంత్రం ద్వారా ప్రతీ నాలుగు గంటలకు 3000 చొప్పున పరీక్షలు చేయవచ్చని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అధికారి ఒకరు తెలిపారు. ఇప్పటివరకు దేశంలో మరే రాష్ట్రం దగ్గర ఇలాంటి యంత్రాలు లేవని తెలిపారు.

ఈ మూడు కొత్త మెషీన్లకు తోడుగా రాష్ట్రంలోని వివిధ జిల్లా ఆసుపత్రుల్లో ఉన్న ‘ట్రూ నాట్’, ‘సీబీ నాట్’ మెషీన్లకు కూడా ప్రత్యేకంగా ‘చిప్’లు, ‘కిట్’లను అనుసంధానం చేయనున్నారు. దీంతో మరికొన్ని అదనపు పరీక్షలు చేయడం వీలవుతుంది. ఈ నెల చివరికల్లా ఇవి కూడా రాష్ట్రానికి చేరనున్నాయి. సీబీనాట్ మెషీన్ ద్వారా ప్రతీ రోజు ఒక్కో మాడ్యూల్‌కు 80 చొప్పున పరీక్షలు చేయడం సాధ్యమవుతుంది. ఒక రోజులో తొమ్మిది మెషీన్ల ద్వారా మొత్తం 720 పరీక్షలు చేయవచ్చు. ట్రూ నాట్ మెషీన్ ద్వారా ఒక్కో మాడ్యూల్‌కు రోజుకు 12 చొప్పున మొత్తం పది మెషీన్ల ద్వారా 120 టెస్టులు చేసే అవకాశం ఉంది.



Next Story

Most Viewed