ప్రత్యక్ష పన్ను వసూళ్లలో రెట్టింపు వృద్ధి

by  |
ప్రత్యక్ష పన్ను వసూళ్లలో రెట్టింపు వృద్ధి
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జూన్ 15 నాటికి నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు ఏకంగా రెట్టింపు వృద్ధితో రూ. 1,85,871 కోట్లుగా నమోదైనట్టు కేంద్ర ఆర్థిక శాఖ గణాంకాలు వెల్లడించాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో రూ. 92,762 కోట్లుగా నమోదయ్యాయి. మొత్తంగా ఇది 100.4 శాతం పెరుగుదల కావడం విశేషం. ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, కార్పొరేట్ పన్నుతో సహా నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ. 74,356 కోట్లుగా ఉండగా, సెక్యూరిటీ లావాదేవీల పన్నుతో కలిపి వ్యక్తిగత ఆదాయ పన్ను వసూళ్లు రూ. 1,11,043 కోట్లు వసూలయ్యాయి.

2021-22లో ఇప్పటివరకు స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు(వాపసుల సర్దుబాటుకు ముందు) రూ. 2,16,602 కోట్లుగా నమోదయ్యాయి. ఇందులో కార్పొరేట్ పన్ను రూ. 96,923 కోట్లుగా ఉండగా, సెక్యూరిటీ లావాదేవీ పన్నుతో సహా వ్యక్తిగత ఆదాయ పన్ను రూ. 1,19,197 కోట్లుగా ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో స్థూల ప్రత్యక్ష పన్ను వసూల్లు రూ. 1,37,825 కోట్లు వసూలయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో పలు సవాళ్లు ఎదురైనప్పటికీ అడ్వాన్స్ పన్ను చెల్లింపు రూ. 28,780 కోట్లుగా వసూలయ్యాయని మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఇది గతేడాది వసూలైన రూ. 11,724 కోట్లతో పోలిస్తే 146 శాతం అత్యధికమని వెల్లడించింది. ఇందులో కార్పొరేట్ పన్ను రూ. 18,358 కోట్లు కాగా, వ్యక్తిగత ఆదాయ పన్ను రూ. 10,422 కోట్లని, బ్యాంకుల నుంచి పూర్తి సమాచారం అందించ తర్వాత ఈ మొత్తం పెరగవచ్చని ఆశిస్తున్నట్టు మంత్రిత్వ శాఖ అభిప్రాయపడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ. 30,731 కోట్ల వాపసులు జారీ చేసినట్టు మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Next Story

Most Viewed